రాష్ట్రంలో సుస్థిర అభివృద్ధికి తాము నిర్దేశించిన లక్ష్యాలను చేరుకునేలా ఎప్పటికప్పుడు జిల్లా కలెక్టర్లతో సమీక్షించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేష్ కుమార్ కు ఆదేశాలిచ్చారు. ఇటీవల జరిగిన కలెక్టర్ల సదస్సులో సిఎం ఆర్థికాభివృద్ధి, సులభతర వ్యాపార నిర్వహణ, ఎలపీజీ కేటాయింపులు, విద్యుదీకరణ, గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పన వంటి కీలక అంశాలపై చర్చించారు. వాటి పురోగతిపై తాజాగా సిఎం ఆదివారం సమీక్ష చేశారు. ఈ సందర్భంగా సిఎస్ దినేష్ కుమార్ పలు పథకాల్లో సాధించిన పురోగతిని సిఎంకు వివరించారు. అనంతరం సిఎస్ ఇంధన, పెట్టుబడులు, మౌలిక సదుపాయాలు తదితర శాఖల అధికారులతో టెలికాన్ఫరెన్సు నిర్వహించారు.
శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, గుంటూరు జిల్లాల్లోని నక్సల్స్ ప్రభావిత మారుమూల గ్రామాల్లో నిరంతరంగా 3ఫేజ్ విద్యుత్తు సరఫరా చేసే ప్రాజెక్టు ప్రతిపాదనకు ముఖ్యమంత్రి ఆమోదం తెలిపారని సిఎస్ వెల్లడించారు. 3ఫేజ్ విద్యుత్తుతో ఆయా ప్రాంతాల్లో ఆర్థిక కార్యకలా పాలు పెరిగి ప్రజల జీవన ప్రమాణాలు పెరుగు తాయన్నారు. నక్సల్స్ ప్రభావిత జిల్లాల్లోని 4972 గ్రామాల్లో ప్రస్తుతం 341 గ్రామాలకే 3 ఫేజ్ కరెంట్ అందుతోందని, ఇంధన, ఐఆండ్ఐ ప్రిన్సిపల్ సెక్రటరీ అజయ్ జైన్, ఐటిశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కె విజయానంద్ వివరించారు.
మిగిలిన 4631 గ్రామాలకు 3ఫేజ్ విద్యుత్తును అందించాలంటే 347 కోట్లు ఖర్చవుతుందన్నారు. నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లోని మారుమూల గ్రామాలకు 3ఫేజ్ కరెంటివ్వడం వల్ల ఆర్థిక కార్యకలాపాలు పెరిగి ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడతాయని రాష్ట్ర డీజీపీ మాలకొండయ్య, ఇంటెలిజెన్స్ అదనపు ఐజి ఏబీ వెంకటేశ్వరరావు, ఇతర పోలీస్ ఉన్నతాధికారులు కూడా సిఎంకు సూచించారు. నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లోని మారుమూల గ్రామాలకు ప్రస్తుతం నీరంతరాయంగా విద్యుత్తు సరఫరా చేస్తున్నప్పటికీ అత్యధిక ఇళ్లకు 3 ఫేజ్ కరెంట్ అందడం లేదని, సింగిల్ ఫేజ్ మాత్రమే సరఫరా అవుతోంది. ఆయా గ్రామాలకు 3ఫేజ్ కరెంటిస్తే సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు నెలకొల్పుకునే అవకాశం వుంటుందని సిఎస్ ముఖ్యమంత్రికి వివరించారు. ఫలితంగా 6 జిల్లాల్లోని 4972 గ్రామాల్లో ఆర్థికాభివృద్ధితో పాటు ఉద్యోగ కల్పన పెరిగి ప్రజల జీనవ ప్రమాణాలు మెరుగుపడతాయన్నారు. ఖర్చు అనేది పెద్ద విషయంకాదు, ప్రజల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం. ప్రజలకు మెరుగైన విద్య, వైద్యం, తదితర సౌకర్యాలు కల్పించాలని చంద్రబాబు అన్నారు...