తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి నిన్న, మొన్న కొన్ని కొత్త అంశాలు బయటికి వచ్చాయని టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ అన్నారు. టీటీడీ వివాదంపై మంగళవారం ముఖ్యమంత్రి చంద్రబాబుతో ఆయన భేటీ అయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ అన్ని అంశాలపై చట్టపరంగా ముందుకెళ్తామని అన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ తిరుమల పవిత్రతకు భంగం కలగకూడదని సీఎం చెప్పారన్నారు. శ్రీవారి భక్తులకు అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తున్నామని... ఆలయ ప్రతిష్ఠకు భంగం కలగకుండా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఆలయ మాజీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు తితిదేపై ఆరోపణలు చేస్తుండటం.. దీనికి మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావుతో పాటు మరికొందరు వంత పాడుతున్న నేపథ్యంలో..
తితిదే నిర్వహణపై అమరావతి సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి పాలకమండలి ఛైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్‌తో పాటు ఈవో అనిల్‌కుమార్ సింఘాల్, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. అనంతరం ఈవో మీడియాతో మాట్లాడుతూ... ఆలయ పవిత్రతకు భంగం కలిగించకుడా అన్ని చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి తమను ఆదేశించినట్లు తెలిపారు. శ్రీవారికి వచ్చే నిధులన్నింటినీ సక్రమంగా వినియోగిస్తున్నామని.. ఎలాంటి దుర్వినియోగం చేయడం లేదన్నారు. శ్రీవారికి జరిగే కైంకర్యాలన్నీ సక్రమంగానే జరుగుతున్నాయన్నారు.
రమణ దీక్షతులు ఆరోపిస్తున్నట్లుగా శ్రీవారి బూందీ పోటులో ఎలాంటి తవ్వకాలు జరగలేదన్నారు. స్వామివారి నగలకు సంబంధించి 1952 నుంచి పక్కా లెక్కలు ఉన్నాయని.. ఎలాంటి అవినీతి జరగలేదన్నారు. శ్రీవారి ఆభరణాల్లో ఏది ఎవరిచ్చారన్న సమాచారం సమగ్రంగా లేకపోయినా.. 1952 రికార్టుల్లో ఉన్ననగలన్నీ భద్రంగా ఉన్నాయన్నారు. తితిదే ఛైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్ మాట్లడుతూ..ఇటీవల జెనీవాలో వేలం వేసిన గులాజీ రంగు వజ్రం శ్రీవారిదేనంటూ రమణ దీక్షితులు అనుమానం వ్యక్తం చేయడంపై స్పందించారు. అసలు అలాంటి వజ్రమే స్వామివారికి ఉన్నట్లు లెక్కల్లో లేదని.. లేని వజ్రాన్ని ఎక్కడి నుంచి తీసుకురావాలని ప్రశ్నించారు.