ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో రాష్ట్రంలోని రైతు రుణ మాఫీ లబ్దిదారులు ముఖాముఖి కార్యక్రమం 'రైతునేస్తం' పథకాన్ని మరో నెలరోజుల్లో ప్రారంభించాలని ముఖ్యమంత్రి కార్యాలయ ఉన్నతాధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. వేసవికాలం పూర్తయిన వెంటనే రాష్ట్రంలోకి వచ్చే నెల 1వ తేదీ నుండి రుతుపవనాలు ప్రవేశిస్తాయని శాస్త్రవేత్తలు స్పష్టం చేయడంతో రైతు నేస్తం పథకాన్ని అమలు చేయాలని నిర్ణయించారు. మరో రెండు మూడు రోజుల్లో రాష్ట్ర వ్యవసాయశాఖా మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి నేతృత్వంలో ఆ శాఖ ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సమావేశం అయ్యే అవకాశాలున్నట్లు తెలిసింది. వ్యవసాయశాఖ ఉన్నతాధికారుల అభిప్రాయాను కూడా తీసుకొని వాటిని కూడా రైతు నేస్తం పథకంలో చేర్చాలని ముఖ్యమంత్రి తన కార్యాలయంలోని ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. రాష్ట్రంలోని రైతు రుణమాఫీ ద్వారా లబ్దిపొందిన రైతులతో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నేరుగా మాట్లాడేందుకు ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. దీనిని ఆరు నెలల క్రితమే ప్రారంభించాలని ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులు ప్రణాళికలు సిద్దం చేసినప్పటికీ కార్యక్రమాన్ని ఎక్కడ నిర్వహించాలన్న సందేహం రావడంతో తాత్కాలికంగా వాయిదా వేశారు.

farmers 21052018 2

మరోవైపు ఎన్నికల హడావిడి నెమ్మదిగా ప్రారంభమవుతున్న తరుణంలో ఇటువంటి కార్యక్రామాన్ని ఇప్పుడైనా ప్రారంభిస్తే.. రైతు రుణ మాఫీలోని లోపాలు సవరించేందుకు వీలుంటుందని సిఎంఓ కార్యాలయ ఉన్నతాధికారులు దస్త్రాన్ని ముందుకు నడిపిస్తున్నారు. అయితే గతంలో రైతు నేస్తం కార్యక్రమం పై సూత్రప్రాయంగా ముఖ్యమంత్రి అంగీకరించిన నేపథ్యంలో వర్షా కాలం ప్రారంభానికి ముందే 'రైతు నేస్తం' పథకాన్ని ప్రారంభించడం సముచితంగా ఉంటుందని సీఎం కార్యాలయ ఉన్నతాధికారుల నిర్ణయించుకున్నారు. దీంతో అందుకు సంబంధించిన ఏర్పాట్లను ఉన్నతాధికారులు శరవేగంతో పూర్తి చేస్తున్నారు. రాష్ట్రప్రభుత్వం బడుగు, బలహీన వర్గాలకు అమలు చేస్తున్న సంక్షేమ పథకాల తీరులోనే రైతునేస్తం ను కూడా పెద్ద ఎత్తున నిర్వ హించాలని నిర్ణయించారు. ఎన్నికల సమయంలో రైతులకు ఇచ్చిన హామీ ప్రకారం రైతు రుణమాఫీ పథకాన్ని అమలు చేస్తున్న విషయం తెలిసిందే.

farmers 21052018 3

ఈ పథకంలోని లబ్దిదారులతో ముఖ్యమంత్రి ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహించి రైతులు సమస్యలు, ప్రభుత్వం చేపట్టిన రుణమాఫీ, ఎరువుల పంపిణీ, విత్తన పంపిణీ, సేద్యపు అలవాట్లు, పద్ధతులు, వ్యవసాయ రంగంలో అత్యాధునిక పద్ధతులను ప్రవేశపెట్టడం వల్ల కలిగే ప్రయోజనాలు, దిగుబడులు పెంపు, వ్యవసాయ మార్కెట్లలో రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, రాష్ట్రంలో బ్యాంకులు రైతులకు అందిస్తున్న రుణాల వివరాలు, వడ్డీరేట్లు, ప్రైవేటు వ్యక్తులు ఇచ్చే రుణాల వివరాలు, అనధికార రుణదాతలపై ఎలాంటి చర్యలు తీసుకోవాలని, వ్యవసాయశాఖ అధికారుల వ్యవహార శైలి, ఎరువుల కంపెనీల పనితీరు, మార్కెట్లో నకిలీ విత్తనాలు, నాణ్యత లేని ఎరువుల పంపిణీ విషయంలో రైతుల అభిప్రాయాలు, ఫిర్యాదులు, సలహాలు, సూచను, పంట పోలాకు విద్యుత్ సరఫరా, విద్యుత్ శాఖ అధికారుల పనితీరు, ట్రాన్స్ఫామ్స్ ఏర్పాటు, పంపు సెట్ల మరమ్మత్తులు వంటి సమస్యల పరిష్కారానికి సంబంధించిన అర్జీలను ముఖ్యమంత్రి చంద్రబాబు నేరుగా స్వీకరించనున్నారు.

వారంలో ప్రతీ శనివారం ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని ఉన్నతాధికారులు భావిస్తున్నారు. అయితే సోమవారం నిర్వహించడానికి ఆదే రోజు రాష్ట్రవ్యాప్తంగా ‘ఫిర్యాదుల స్వీకరణ' కార్యక్రమాన్ని ఎప్పటి నుండో నిర్వహిస్తున్న నేపథ్యంలో శనివారం నిర్వహిస్తేనే బాగుంటుందని ముఖ్యమంత్రి కార్యాలయ ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. కార్యక్రమం పై ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు విధివిధానాలు రూపొందించి, పలు సూచనలు చేసినట్లు తెలిసింది. ప్రతీ శనివారం ఉదయం 10 గంటల నుండి మద్యాహ్నం 12 గంటల వరకూ రైతునేస్తం కార్యక్రమాన్ని నిర్వహించాలని ప్రణాళికలో పొందుపరిచారు. రాష్ట్రంలోని 13 జిల్లాలకు చెందిన రైతులను ఒక్కొక్క వారం ఒక్కొక్క మండలం, లేదా జిల్లాకు చెందిన 150నుండి 200మంది రైతులు రైతు నేస్తంలో పాల్గొనేలా ఏర్పాట్లు చేస్తారు. రాష్ట్ర వ్యవసాయశాఖ నుండి రైతు రుణమాఫీ లబ్దిదారుల వివరాలను సేకరించి, రైతుల ఆధార్, మొబైల్ ఫోన్ నెంబరు ఆధారంగా ముఖ్యమంత్రితో నిర్వహించే ముఖాముఖి కార్యక్రమానికి రైతులను ఎంపిక చేస్తారు. శనివారం రైతునేస్తం కార్యక్రమంలో పాల్గొ నేందుకు ఎంపిక చేయబడిన రైతుల వివరాలను ఆయా జిల్లా వ్యవసా యశాఖ, రెవెన్యూశాఖ ఉన్నతాధికారులకు తెలియజేస్తారు.

ఈ కార్యక్రమంలో పాల్గొనే రైతులను రాజకీయాలకు అతీతంగా ఎంపిక చేస్తారని ముఖ్యమంత్రి కార్యాలయాధికారి వెల్లడించారు. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించాలని భావిస్తున్నారు. అలాగే రైతునేస్తం కార్యక్రమంలో సిఎం చంద్రబాబునాయుడుతో పాటు వ్యవసాయశాఖమంత్రి, ఆశాఖ ఉన్నతాధికారులు కూడా సమావేశంలో ఉండేలా దస్త్రంలో మార్పులు చేస్తున్నారు. రైతులు క్షేత్రస్థాయిలో ఎదుర్కొంటున్న సమస్యలను తక్షణమే పరిష్కరించేందుకు వీలుగా అవసరమైన చర్యలు తీసుకునే విధానాన్ని రైతునేస్తం కార్యక్రమంలో ముఖ్యమంత్రి ప్రకటించే అవకాశాలున్నాయి. అలాగే భవిష్యత్తులో రైతుల సంక్షేమానికి ప్రభుత్వం చేపట్టబోయే మరిన్ని నూతన విధివిధానాలను కూడా ఇదే వేదిక పై నుండి ప్రకటించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలోని ఎస్సీ ఎసీబీసీ వర్గాలకు చెందిన రైతులకు ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీపై వారి అభిప్రాయాలు ఎదురవుతున్న ఇబ్బందులు, సమస్యలపై ప్రత్యేక అధికారిని కూడా నియమించే వీలున్నట్లు తెలుస్తోంది. రైతు సమస్యల పరిష్కారానికి ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసి రైతులకు ప్రభుత్వం మరింత దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తోంది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read