విజయనగరం జిల్లాలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నవ నిర్మాణ దీక్షలో పాల్గున్నారు. జమ్మాదేవిపేటలో రచ్చబండ కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆంధ్రులను ప్రధాని మోదీ నమ్మించి మోసం చేశారని మండిపడ్డారు. వైసీపీ ఎంపీల రాజీనామాల డ్రామాను ప్రజలు అర్ధం చేసుకున్నారని తెలిపారు. పవన్ కల్యాణ్ తనను తిట్టడమే పనిగా పెట్టుకున్నారని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. అంతకు ముందు లక్కవరపుకోట మండలం జమ్మాదేవిపేట గ్రామంలో పర్యటించిన సీఎం చంద్రబాబు వీధుల్లో తిరిగి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
‘పవన్ కల్యాణ్ మొన్నటి వరకు రాష్ట్ర ప్రభుత్వాన్ని పొగిడారు. బీజేపీకి టీడీపీ కటీఫ్ చెప్పిన తర్వాతే ఆయన వైఖరిలో మార్పు వచ్చింది. రాష్ట్రానికి అన్యాయం చేసిన బీజేపీని మేం విమర్శిస్తుంటే... పవన్ మమ్మల్ని విమర్శిస్తున్నారు. దీనికి కారణమేమిటో చెప్పాలి అని అన్నారు. ఆయనకు ఎంతో గౌరవం ఇచ్చాం, ఏ కారణం చేత ఇలా చేస్తున్నారో, కొన్ని కొన్ని సార్లు ఇలాంటివి చుస్తే, బాధ ఆవేదన కలుగుతుంది. ప్రజల కోసం భరించక తప్పదు అని చంద్రబాబు అన్నారు.
‘కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి టీడీపీ ఎంపీల మద్దతు ఉపసంహరించుకున్న తర్వాతే ఆయనలో మార్పు వచ్చింది. రాష్ట్ర ప్రయోజనాల కోసం నిస్వార్థంతో మంత్రి పదవులను తృణప్రాయంగా త్యజించడం.. ఎన్డీఏ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకోవడం తప్పా? రాష్ట్రాన్ని బలహీనపరిచే విధంగా వీరు వ్యవహరిస్తున్నారు అని పవన్ ను ఉద్దేశించి అన్నారు. ‘ప్రజాసేవకే నా జీవితం అంకితం. ప్రతిపక్షాలు.. కొత్త పార్టీలు లేనిపోని విమర్శలు చేసినా వినే పరిస్థితిలో ప్రజలు లేరు. మీ అండదండలుంటే కొండనైనా ఢీ కొడతా. రాష్ట్రాన్ని దేశంలోనే నంబర్‌వన్‌గా తీర్చిదిద్దుతా’ అని చంద్రబాబు ప్రకటించారు.