అనంతపురం జిల్లాలో ప్రారంభించిన కియ కార్ల తయారీ పరిశ్రమ యమ స్పీడుగా రూపుదిద్దుకొంటోంది. 2019లో కార్లను ఉత్పత్తి చేసి, రోడ్డెక్కించడం లక్ష్యంగా పనులు పరుగులు తీస్తున్నాయి. శంకుస్థాపన జరుపుకొన్న ఈ రెండు నెలల్లోనే 30 శాతం నిర్మాణ పనులు పూర్తయ్యాయి. ఇదే ఊపు కొనసాగితే, వచ్చే ఏడాది మార్చి నాటికి పరిశ్రమ సిద్ధం అవుతుంది. రూ.13,500 కోట్లు పెట్టుబడితో ఇక్కడ భారీ కార్ల పరిశ్రమకు ‘కియ’ శ్రీకారం చుట్టింది. దీనికిగాను అవసరమైన యంత్ర సామగ్రిని కొరియా నుంచి దిగుమతి చేసుకొంటోంది. ఆ సామగ్రిని తొలుత కృష్ణపట్నం రేవుకు తీసుకొచ్చి, అక్కడినుంచి రోడ్డు మార్గంలో పరిశ్రమ వద్దకు తరలిస్తున్నారు. ప్రస్తుతం బాడీ బిల్డ్షాపు యూనిట్, ప్రెస్ యూనిట్, అసెంబ్లింగ్ యూనిట్, పెయింటింగ్ షాపు ఏర్పాటు పనులు చురుగ్గా సాగుతున్నాయి.
కియా పరిశ్రమలో ఉద్యోగాల కోసం ఈ నెల 10వ తేదీలోగా జిల్లాలో డిప్లమా చదివిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని మంత్రి కాలవ శ్రీనివాసులు తెలిపారు. సోమవారం రాత్రి మంత్రి పట్టణంలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఇప్పటి వరకు జిల్లాలో 3,500 మంది నిరుద్యోగులు మాత్రమే రిజిష్టర్ చేసుకున్నారని, ఇందులో 1,672 మంది మాత్రమే అర్హులుగా ఎంపికయ్యే అవకాశం ఉందన్నారు. తొలిదశలో 900 మంది దాకా డిప్లమో అభ్యర్థులకు శిక్షణలో చేర్చుకునే అవకాశం ఉందన్నారు. నైపుణ్యాభివృద్ధి సంస్థ అభ్యర్థులను ఎంపిక చేస్తుందన్నారు.
ఎంపిక పారదర్శకత, ప్రతిభ ఆధారంగా జరుగుతుందన్నారు. రాయదుర్గం నియోజకవర్గం నుంచి కేవలం 60 మంది మాత్రమే దరఖాస్తు చేశారన్నారు. ఎక్కువ మంది నిరుద్యోగులు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించేందుకు ఈ నెల 10వ తేదీ వరకు కలెక్టర్ గడువు పెంచారన్నారు. 18 నుంచి 25 ఏళ్లలోపు వయస్సు కలిగిన డిప్లమా పూర్తి చేసిన యువతీ, యువకులు ఉద్యోగాల కోసం ఆన్ లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. శిక్షణ తర్వాత కూడా ప్రతిభగల అభ్య రులకు మాత్రమే ఉద్యోగాలు లభిస్తాయన్నారు. కియా ఉద్యోగాలు కోసం ఇక్కడ అప్లై చేసుకోవచ్చు http://www.kia-motors.in/web/html/india/Careers.jsp