ఐదు కోట్ల ప్రజల కోసమే నవనిర్మాణ దీక్ష చేపట్టామని మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అన్నారు. విజయనగరం జిల్లా శృంగవరపుకోటలో చేపట్టిన నవనిర్మాణ దీక్షలో చంద్రబాబు పాల్గొన్నారు. వ్యవసాయ, అనుబంధ రంగాలు, పథకాల అమలు తీరుపై రైతులతో ముఖాముఖీ నిర్వహించారు. అనంతరం ప్రసంగించారు. రాష్ట్ర ప్రజానీకం కోసమే భాజపాతో పొత్తు పెట్టుకున్నామని.. తిరుపతి వెంకన్న సాక్షిగా ఆనాడు ప్రధాని మోదీ అన్ని అంశాలపై హామీ ఇచ్చారని చంద్రబాబు గుర్తుచేశారు. ఆ తర్వాత మోదీ మాట మార్చారని.. రాష్ట్రానికి అన్యాయం చేశారని మండిపడ్డారు. అయితే కేంద్రం న్యాయం చేస్తుందని ఎంతో సహనంతో వేచి చూశామని.. హామీల సాధనకు పోరాటమే మార్గమని ఎన్డీయే కూటమి నుంచి బయటకి వచ్చినట్లు పేర్కొన్నారు.
‘ప్రస్తుతం రాష్ట్రంలో వైకాపా రాజీనామా డ్రామాలు ఆడుతోంది. ఎన్నికలు రాని సమయం చూసి రాజీనామాల నాటకాలు ఆడుతున్నారు. వైకాపా నేతలకు ధైర్యం ఉంటే మోదీ, భాజపాపై పోరాడాలి. మోదీ ప్రభుత్వం ఏపీపై కుట్ర పన్నింది. ఈ కుట్రలో భాగంగానే వైకాపా నేతలు, పవన్ కల్యాణ్ నాపై ఆరోపణలు చేస్తున్నారు. రాష్ట్రాన్ని బలహీన పరిచే విధంగా వీరు వ్యవహరిస్తున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానాన్ని కూడా అపవిత్రం చేసే విధంగా కుట్ర పన్నుతున్నారు. అయితే ఈ కుట్రలు వేరే రాష్ట్రాల్లో చెల్లుబాటు అవుతాయేమో కానీ.. ఏపీలో సాగవు. వచ్చే ఎన్నికల్లో భాజపాతో పొత్తుపెట్టుకునే పార్టీలను చిత్తుచిత్తుగా ఓడించాలి.’ అని చంద్రబాబు ప్రజలకు పిలుపునిచ్చారు.
‘కేంద్రంతో రాజీ లేదు.. ధర్మపోరాటం చేస్తాం. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా సంక్షేమ కార్యక్రమాలను వదిలిపెట్టలేదు. కేంద్రం, ఆర్‌బీఐ ఒప్పుకోకపోయినా రుణమాఫీ అమలు చేశాం. మహిళా సంఘాల రుణాలు రద్దు చేశాం. సాగునీటి పథకాలకు ప్రాధాన్యత ఇచ్చాం. వ్యవసాయంలో ఖర్చులు తగ్గించేందుకు శ్రీకారం చుట్టాం. పండించే పంటకు గిట్టుబాటు ధర ఇచ్చే బాధ్యత తీసుకున్నాం ’ అని చంద్రబాబు అన్నారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీతో పొత్తు పెట్టుకునే పార్టీలను, అవకాశవాద రాజకీయాలకు పాల్పడే పార్టీలను రాష్ట్రంలో చిత్తుగా ఓడించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపునిచ్చారు.