ప్రకృతిని పలకరించుకుంటూ ఎత్తై కొండల్లో..జలపాతాలు, అహ్లాదకరమైన వాతావరణం నడుమ ప్రయాణం సాగించాలని ఎవరు కోరుకోరు...! ఆంధ్రాఊటిగా ప్రసిద్ధి గాంచిన అరకు వ్యాలీ ప్రయాణమంటే చాలు ఎవరైనా ఎగరేసి గెంతేస్తారు. బస్సు సౌకర్యమున్నా...84 బ్రిడ్జిలను, 58 సొరంగాలనూ చీల్చుకుంటూ వంపులు తిరిగే రైలులో ప్రకృతి అందాలను చూడాలని ప్రయాణికులు ఎక్కువ మక్కువ చూపిస్తారు.
ఇరుపక్కల నుంచి చూస్తే పచ్చదనం కలబోసిన ప్రకృతి సౌందర్యం.. తల పెకైత్తి చూస్తే నీలాకాశం.. బోగీ లోపల విభిన్న ఆకృతిలో కళ్లు చెదిరేలా రూపొందించిన డిజైన్లు.. అటూ ఇటూ కదిలే కుర్చీలు.. పారదర్శకంగా ఉండే అద్దాలు.. శీతలాన్ని వెదజల్లే బోగీలు.. ఇవన్నీ విశాఖ నుంచి అరకు వెళ్లే అద్దాల రైలుకు సొంతం..! ఎన్నాళ్ల నుంచో ఇదిగో.. అదిగో.. అంటూ ఊరిస్తున్న ఈ అద్దాల (విస్టాడూమ్) రైలు రెడీ అయ్యింది.
దేశ, విదేశాల నుంచి ఎంతో మంది పర్యాటకులు నిత్యం అరకుని సందర్శిస్తారు. చిన్నా,పెద్ద తేడా లేకుండా చిరకాల నేస్తమైన కిరండోల్ పాసింజర్‌ని చటుక్కున ఎక్కేసి ఎంచక్కా...ప్రకృతిని చుట్టేస్తారు. ఇప్పుడా నేస్తం కొత్త హంగులు అద్దుకుని, నగరవాసుల చిరకాల స్వప్నమైన అద్దాలరైలుగా మనముందుకు రాబోతోంది.
అంతర్జాతీయంగా ప్రసిద్ధి చెందిన చెన్నైలోని ఇంటెగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ (ఐసీఎఫ్) ఇప్పుడు కొత్త రికార్డు సాధిస్తోంది. అత్యాధునిక రైలు పెట్టెల తయారీతో ప్రయాణికులను, పర్యాటకులను ఆకర్షించనుంది. ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం జిల్లాలోని ప్రసిద్ధ పర్యాటక కేంద్రం అరకు అందాలను వీక్షించడానికి అద్దాల రైలు పెట్టెలను తయారు చేసి అక్కడి రైల్వే అధికారులకు అందజేస్తోంది.
ఈ పెట్టెలు మంగళవారం చెన్నై నుంచి బయలుదేరి వెళ్లనున్నాయి. రిజర్వేషన్ లేని అంత్యోదయ, దీన్‌దయాళ్ రైలు పెట్టెలను తయారు చేసిన ఐసీఎఫ్, ఎల్‌హెచ్‌బీ స్టెయిన్‌లెస్ స్టీలు కోచ్‌లు తయారు చేసి రికార్టు సృష్టిస్తోంది. ప్రస్తుతం మరో మెట్టు ఎక్కి ఆంధ్రప్రదేశ్, కశ్మీర్ రాష్ట్రాలలోని పర్యాటక ప్రాంతాల సందర్శనకు మొదటిసారిగా పైకప్పు అంతా ప్రత్యేక అద్దాలతో నిండిన రైలు పెట్టెలను రూపొందించింది.
రొటేటింగ్ కుర్చీలతో తయారు చేస్తున్న మొదటి పర్యాటక కోచ్ మంగళవారం చెన్నై నుంచి విశాఖపట్నానికి పయనమవనుంది. ఊటీలో నడుస్తున్న కొండ రైలు మాదిరిగా ఆంధ్రప్రదేశ్ లోని అరకు వ్యాలీలో ఐఆర్‌సీటీసీ పర్యాటక రైలుని నడుపుతోంది. ఈ రైలుకు పూర్తిగా పైకప్పుతో సహా అద్దాలతో నిండిన బోగీని రూపొందించింది. ఈ నేపథ్యంలో కశ్మీర్‌లోని పర్యాటక ప్రాంతాలలో నడపడానికి కూడా అత్యాధునిక కోచ్‌ల తయారీకి ఐసీఎఫ్‌కి ఆర్డర్ వచ్చింది.
వీటి ప్రత్యేకత ఏమిటి?
- దేశంలోనే మొదటిసారిగా ఈ తరహా కోచ్‌లను ఐసీఎఫ్ తయారు చేస్తోంది
- వోల్వో బస్‌లలో అద్దాలు అమర్చే రీతిలో ఈ బోగీలకు అద్దాలు అమర్చబడి ఉంటాయి
- బయటి వాతావరణానికి తగిన రీతిగా పగలు, రాత్రిని ప్రతి ఫలింపజేసే విధంగా ఉండే రైలులో రొటేటింగ్ కుర్చీలు
- రొటేటింగ్ కుర్చీల వల్ల ప్రకృతి సోయగాలను 360 డిగ్రీలలో తిరిగి చూడవచ్చు
- కోచ్ మొత్తం స్టెయిన్‌లెస్ స్టీలుతో తయారు
- టీవీ సౌకర్యం
- ఫస్ట్‌క్లాస్ ఎ.సి సదుపాయం ఉంటుంది
- 108 సీట్లతో చైర్‌కార్ సిట్టింగ్ ఉంటుంది
- టికెట్‌ధర 300 నుంచి రూ. 400 వరకూ ఉండొచ్చు
- సాధారణ కోచ్‌కు రూ.60 నుంచి రూ.70 లక్షల మధ్య వ్యయ అంచనా అయితే..విస్టోడోమ్ కోచ్‌కు..మరో రూ.30 లక్షలు అదనంగా ఖర్చుకానున్నాయి