రానున్న కాలంలో విద్యార్ధుల ప్రతిభ ఆధారంగా పూర్తిగా చదివించే బాధ్యత తీసుకుంటామని, ఇప్పుడు ఇస్తున్న 6,500 ప్రతిభా పురస్కారాలను మరో 1000కి పెంచుతామని, ఇందుకోసం మరో 30 కోట్లు అదనంగా వ్యయం చేస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టంచేశారు. విద్యార్ధులలో ఆత్మవిశ్వాసం పెంచాల్సి ఉందని, తల్లి దండ్రుల డబ్బులతో కాకుండా, విద్యార్ధులు తమ ప్రతిభా పురస్కారాలతో చదివే పరిస్థితి రావాలని ముఖ్యమంత్రి అన్నారు.

అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా ఆదివారం విజయవాడ ఇందిరాప్రియదర్శిని స్టేడియంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన ప్రతిభా పురస్కారాల ప్రదాన వేడుకలో ఆయన ముఖ్య అతిథిగా హాజరై పురస్కారాలను బహూకరించారు. విద్యార్ధుల భవిష్యత్తుకు తపించిన వైజ్ఞానికుడు, మేధావి, భారత రాష్ట్రపతిగా పనిచేసి స్ఫూర్తిదాతగా నిలిచిన అబ్దుల్ కలాం జయంతినాడు ఈ పురస్కారాలను ప్రదానం చేయండ సముచితంగా ఉంటుందని భావించి ఈ కార్యక్రమానికి ముహూర్తంగా ఎంచుకున్నట్లు ముఖ్యమంత్రి వివరించారు. ఏ మంచిపని అయినా సంకల్పం తీసుకుంటే తప్పక నెరవేరుతుందని ఆయన అన్నారు. గతంలో గోదావరి, కృష్ణా పుష్కరాల సందర్భంలో తీసుకున్న సంకల్పాలు ఎలా ఫలప్రదమవుతున్న వైనాన్ని ముఖ్యమంత్రి వివరించారు.

తాము విద్యార్ధుల్లో ప్రతిభను మరింతగా ప్రోత్సహించేందుకు ప్రతిభా పురస్కారాలను మరో 1000 పెంచనున్నట్లు తెలిపారు. పదో తరగతిలో మెరిట్ స్కాలర్ షిప్ వచ్చిన వారిని ఇంటర్మీడీయట్ చదివిస్తామని ప్రకటించారు. ఇంటర్ లో మెరిట్ స్కాలర్ షిప్ వస్తే వాళ్లు తర్వాత ఏ కోర్సులో చేరాలన్నా సహకరిస్తామని, బిట్స్ పిలానీ, ఐఐటీ, ఐఐఎం ఎక్కడైనా చదివించడానికి సిద్ధమేనని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. డిగ్రీ నుంచి పీజీకి వెళ్లినా, విదేశాల్లో అయినా చదివిస్తామని సీఎం స్పష్టం చేశారు. ధనికులైనా, పేదలైనా పిల్లల్లో విజ్ఞానాన్ని పెంచాలని కోరారు. రాబోయే రోజుల్లో నాలెడ్జి ఎకానమీకి ప్రాధాన్యం వస్తుందని అన్నారు. తాను పాతికేళ్ల క్రితమే ఈ విషయం చెప్పానన్నారు. పిల్లలకు ఇవ్వాల్సింది ఆస్తులు కావని, చదువు-సంస్కారం అని అన్నారు. ఆచార వ్యవహారాలు, కుటుంబ వ్యవస్థను కాపాడాలి. పిల్లల కంటే తల్లిదండ్రులే ఎక్కువగా కష్టపడుతున్నారు.

1995 తాను సీఎం అయినప్పుడు చదువుకు ప్రాధాన్యతనిచ్చినట్లు, ఆనాడు ప్రతి కిలోమీటర్ కు ఒక ప్రాథమిక పాఠశాల, ప్రతి 3 కి.మీకు ఒక మాధ్యమిక పాఠశాలు, 5 .కి.మీ దూరంలో ఉన్నత పాఠశాల ఉండాలన్న నిర్ణయం తీసుకుని పనిచేశామని గుర్తు చేశారు. మండలానికి జూనియర్ కాలేజీ, రెవెన్యూ డివిజన్ కు ఒక ఇంజనీరింగ్ కాలేజీ, జిల్లాకు ఒక వైద్య కళాశాల ఉండాలని భావించి ప్రయత్నించామన్నారు. 30 ఇంజనీరింగ్ కాలేజీలు వచ్చాయన్నారు. తర్వాత 9 ఏళ్లలో 300పైగా ఇంజనీరింగ్ కాలేజీలు వచ్చినట్లు తెలిపారు చదువు తెలివిని ఇస్తుందని, చదువు ద్వారా ప్రపంచంలో ఏదైనా సాధించవచ్చన్నారు. కాలేజీలు పెడితేనే లాభం లేదు, అందరికీ ఉపాధి, ఉద్యోగావకాశాలు రావాలన్న ఉద్దేశంలో ఐటీ కంపెనీలను తీసుకొచ్చామని, ఫలితంగా ఇక్కడ ఐటీలో లక్షల ఉద్యోగావకాశాలు వచ్చాయని, వేలాదిగా విదేశాలకు వెళ్లారని గుర్తుచేశారు.

మన విద్యార్ధుల ప్రతిభతో అనేక అవకాశాలు:
ప్రపంచంలో ఐటీలో ఉన్న నిపుణులు ప్రతి నలుగురులో ఒకరు భారతీయుడని, దేశంలో ప్రతి నలుగురు ఐటీ ఇంజనీర్లలో ఒకరు ఆంధ్రప్రదేశ్ కు చెందిన వారేనన్నారు. ఆనాడు ముఖ్యమంత్రిగా తాను ఐటీకి ఇచ్చిన ప్రాధాన్యత వల్ల లక్షలాదిమందికి లబ్దిచేకూరిందన్నారు. ప్రపంచంలో ఐటీ ఇంజనీర్లలో 25% మనవాళ్లున్నారని, ఇందుకు తాను వేసిన బీజమే కారణమని, తన చొరవతో ఇది సాధ్యమైందని చంద్రబాబు చెప్పారు. ఉద్యోగాలతో సంతృప్తిచెందక పారిశ్రామిక వేత్తలుగా మారి, ఉపాధి అవకాశాలు సృష్టించాలని పిలుపునిస్తే మంచి స్పందన లభించిందని ముఖ్యమంత్రి గుర్తుచేశారు. ఐఐటీలకు 18% మన విద్యార్ధులే ఎంపికవుతున్నారని, ఇదెంతో గర్వకారణమని చెప్పారు. మన జనాభా 4.5% ఉంటే 18% సీట్ల మన విద్యార్ధులకే వస్తున్నాయని పోటీ ఉన్నప్పటికీ ఇది సాధిస్తున్నారంటే మన పిల్లలు ఎంతో ప్రతిభావంతులన్నారు. అయితే తాను ఇంతటితో సంతృప్తిచెందనని, 25% సీట్ల మనకే రావాలని చంద్రబాబు అన్నారు. ఒకప్పుడు బిట్స్ పిలానీకి అందరూ మన విద్యార్ధులే వెళ్లేవారని, వాళ్లకు అసూయవచ్చి బిట్స్ పిలానీలో విధివిధానాల్లో మార్పు చేశారని చంద్రబాబు అన్నారు. వాళ్లు ఎన్ని పరీక్షలు పెట్టినా, ఎన్ని నిబంధనలు విధించినా ప్రతిభతో మనమే ముందున్నామని నిరూపించామని వివరించారు. విద్యార్ధుల భవిష్యత్తుకు తాను అన్ని అవకాశాలు సృష్టిస్తానని సీఎం చెప్పారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read