విజయవాడ చుట్టుపక్కన ఉన్న 45 గ్రామాలను విజయవాడ నగరపాలక సంస్థ (వి.ఎం.సి)లో దశలవారీగా కార్యాచరణ ప్రణాళికతో విలీనం చేస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. శనివారం ఉదయం విజయవాడ నగరం, గన్నవరం నియోజకవర్గ పరిధిలో ఆయన ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. గ్రామాల సర్పంచులను ఆహ్వానించి ఒక సమావేశం నిర్వహించాలని అధికారులను కోరారు. ఆరునెలలలోగా ఈ పనిని పూర్తిచేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. కొండలమీద, కాల్వల పక్కన నివసిస్తున్న 50 వేల కుటుంబాలకు వాంబే కాలనీలో పట్టాలివ్వాలని, 16 వేల మంది లబ్దిదారులకు వాంబే కాలనీలో గృహాలు కేటాయించాలని మునిసిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్యకార్యదర్శి, ఏపీ టిడ్కో హౌసింగ్ అధికారి, విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్‌ను ఆదేశించారు. నిర్మాణాలను పూర్తిచేయడానికి 9 నెలల వ్యవధినిస్తున్నట్లు సీఎం చెప్పారు.

పోలీసు కంట్రోల్ రూమ్ ఎదురుగా పనికిరాని పరికరాలతో గత పుష్కరాల సమయంలో ఏర్పాటు చేసిన పార్కు ప్రాంతాన్ని పరిశీలించారు. అక్కడ వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. బందరు కాల్వ ఇరువైపులా ఒడ్డును సుందరీకరించాలని , రెండు నెలల గడువు ఇస్తున్నట్లు తెలిపారు. ట్రాఫిక్ ఐలెండ్లు, కూడళ్ల అభివృద్ధిని నెలరోజుల్లో చేసి చూపాలని సీఆర్ డీఏ కమిషనర్, నగరపాలక సంస్థ కమిషనర్, నగర పోలీసు కమిషనర్ ను ఆదేశించారు. జలవనరుల శాఖ ఎస్.ఇ కి గవర్నర్‌పేట బస్ డిపోలోకి వెళ్లి పరిశీలించారు. ప్రసాదంపాడు, రామవరప్పాడు ప్రాంతాలలో పర్యటించారు. నగరంలో 4 కాల్వలను అనుసంధానం చేయాలని సీఎం జలవనరుల శాఖ ఇంజనీర్-ఇన్ చీఫ్‌ను ఆదేశించారు. కాల్వలలో వాటర్ స్కూటర్లు లాంటి జలక్రీడలతో నగర పౌరులకు ఆహ్లాదం పంచవచ్చని చెప్పారు. ఆరునెలల్లోగా పూర్తిచేయాలని కోరారు.

తర్వాత క్యాంప్ కార్యాలయంలో మంత్రులు,సీఆర్ డీఏ, విజయవాడ నగరపాలక సంస్థ, అమరావతి నగరాభివృద్ధి సంస్థ అధికారులు, ప్రజా ప్రతినిధులతో ఆయన ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. త్వరలో ఉత్తర్వులు జారీచేస్తామని, వాంబే కాలనీ వాసులకు పట్టాల అందజేత ప్రక్రియ నవంబర్ 30 నాటికి పూర్తిచేయాలని, అందుకు ఏర్పాట్లు చేసుకోవాలని అధికారులను ఆదేశించారు. పాత బస్టాండు దగ్గర ఉన్న సీఎన్జీ డిపోను 45రోజుల్లోగా పండిట్ నెహ్రూ బస్ స్టేషన్‌కు తరలించాలని కోరారు. ఇందుకోసం గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా (గెయిల్ ) ఎండీ ఏపీ దాస్‌తో మాట్లాడాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. గ్యాస్ పైప్ లైన్ వేయడం 30 రోజుల్లో పూర్తికావాలన్నారు. సమీప భవిష్యత్తులో ఇప్పుడున్న సీఎన్జీబస్సులతో పాటు ఎలక్ట్రిక్ బస్సులు వస్తాయని, 45 రోజుల్లో డ్రైవర్ రహిత బస్సులు వస్తాయని అన్నారు. బస్టాండు నుంచి రైల్వేస్టేషన్ దాకా ముందుగా సుందరీకరించాలని కోరారు.
విజయవాడ నగరంలో భాగమై నగర సౌందర్యాన్ని ఇనుమడించే కొండలు మరింత ఆకర్షణీయంగా కనపడాలంటే పర్వత ప్రాంతాలను సుందరీకరించాలని ముఖ్యమంత్రి కోరారు.

కనకదుర్గమ్మవారికి పూజలు చేయడానికి ఉపయోగించే ఎరుపు, పసుపురంగు పుష్ప వనాలను ఇంద్రకీలాద్రిపై పెంచాలని సూచించారు. ఇందుకు నలభై రోజుల వ్యవధినిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ అర్బన్ గ్రీనరీ ప్రాజెక్టు ఎం.డి చంద్రమోహనరెడ్డికి చెప్పారు. గన్నవరం దాకా రహదారి వెడల్పు పనులను 2 నెలల వ్యవధిలో పూర్తిచేయాలని, గన్నవరం శాసనసభ్యుడు వల్లభనేని వంశీ, కృష్ణా జిల్లా కలెక్టర్ లక్ష్మీకాంతం, విజయవాడ పోలీసుకమిషనర్, విజయవాడ, నూజివీడు ఆర్డీఓ, జిల్లా పంచాయతీ ఆఫీసరు ఈ పనులను సమన్వయం చేసుకోవాలని చంద్రబాబు కోరారు. నగరంలో ఎక్కడా చెత్త కనపడకూడదని, కాల్వల పక్క సుందరీకరణ చేయడమే కాకుండా నిర్వహణ కూడా చేపట్టాలని సూచించారు. సింగపూర్ నగరం తరహాలో మన రహదారులు కన్పించాలని, తాను మళ్లీ ఆకస్మిక తనిఖీ చేపడతానని, ఎక్కడా గుంతలు ఉండకూడదని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. జపనీస్ పగోడా రకం చెట్లను (గోపురాన్ని పోలివుండే చెట్లు) పెంచాలన్నారు.

దుర్గగుడి ఫ్లై ఓవర్ నిర్మాణ పనులు వేగవంతం చేయడం కోసం ట్రాఫిక్ ను నిలిపివేశామని, ఇందువల్ల సామాన్య ప్రజలు పడుతున్న ఇబ్బందులను కూడా నిర్మాణ సంస్థ పరిగణనలోకి తీసుకోవాలన ముఖ్యమంత్రి చంద్రబాబు కోరారు. నిర్మాణానికి అవసరమైన పనివారు, యంత్ర సామాగ్రిని పూర్తిస్థాయిలో వినియోగించడంలేదని ఫిర్యాదులు అందుతున్నాయని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్దేశించిన సమయానికి పనులు వేగవంతం చేయకపోతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కృష్ణాజిల్లా కలెక్టర్ దుర్గగుడి పనులను ప్రతిరోజూ సమీక్షించాలని, సోమవారం నాడు నిర్మాణ సంస్థ యజమానులు తనను కలవాలని ఆదేశించారు.

వచ్చే ఏడాది జూన్ మాసానికి జక్కంపూడి గృహనిర్మాణాలు పూర్తి:
జక్కంపూడిలో 234 ఎకరాల పరిధిలో నిర్మిస్తున్న 10వేల గృహాలను వచ్చే ఏడాది జూన్ నాటికి పూర్తిచేయాలని, అసంపూర్తిగా నిలిచిన 4 వేల జే.ఎన్.యూ.ఆర్.ఎం గృహనిర్మాణాలను వెంటనే చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
నగర సుందరీకరణలో కాల్వల పక్కన ఉన్న గృహాలకు ప్రాధాన్యతనిస్తామని, నాలుగు కాల్వలను, నిర్మాణాలను, ఏటవాలుగా ఉన్న ప్రాంతాలకు అమరావతి అభివృద్ధి సంస్థ శుద్ధి ప్రక్రియ చేపడుతుందని ముఖ్యమంత్రి వివరించారు.
కాల్వ ఒడ్డున పెద్ద స్థలాల్లో సీమ్ లెస్ కనెక్టివిటీ ఇవ్వాలని, షాపింగ్ మాల్స్ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. గుంటూరు వైపు విజయవాడకు ముఖద్వారం దగ్గర సుందరీకరణ చేపట్టాలని కోరారు. ఒక కేంద్రం నుంచి మరో కేంద్రానికి (point to point &end to end) రహదారుల నిర్మాణానికి ప్రాధాన్యాన్నివాలని, అపసవ్యంగా వున్న భూగర్భ మురుగునీటి పారుదల వ్యవస్థ మ్యాన్ హోల్స్‌ను సరిచేయాలని నగరపాలక సంస్థ ముఖ్యమంత్రి సూచించారు. ఇందుకోసం 15 రోజుల సమయం ఇస్తున్నట్లు నగరపాలక సంస్థ కమిషనర్ కు స్పష్టం చేశారు. నగరమంతా అందమైన, ఆహ్లాదమైన వాతావరణం నెలకొల్పాలని, ఇందుకు తక్షణ ప్రాధాన్యంతో వెంటనే పనులకు ఉపక్రమించాలని చంద్రబాబు నాయుడు ఆదేశించారు. బిందుసేద్యం తరహాలో రహదారుల పక్కన హరిత వాతావరణం సృష్టించాలన్నారు. నెలరోజులలో ఈ పనులు పూర్తిచేయాలని అన్నారు.

నగరంలో, పిచ్చికుక్కల బెడదపై ప్రజల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయని ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి దృష్టికి తేగా, కుక్కలకు స్టెరిలైజేషన్ చేయించాలని పురపాలక శాఖ డైరెక్టర్‌ను ముఖ్యమంత్రి కోరారు. కోతుల బెడద నివారించే బాధ్యతను గుంటూరు జిల్లా అగతవరప్పాడు ఫారెస్టు చీఫ్ కన్సర్వేటర్ కు అప్పగించారు. నెలరోజుల్లో పని పూర్తికావాలన్నారు. విజయవాడలో గోశాల (క్యాటిల్ హాస్టల్) పనులను వెంటనే చేపట్టి నెలరోజులలో పూర్తి చేయాలన్నారు. గుణదల ఆర్వోబీ, బ్రడ్జిలు, టన్నెల్స్ పూర్తిచేయాలని కోరారు. ఏడాదిలోగా పూర్తిచేయాలని ఎల్ అండ్ టీ కి ఆదేశాలిస్తామన్నారు. రామవరప్పాడు ట్రాఫిక్ ఐలెండ్ నిర్వహణ బాధ్యత పురపాలక శాఖ, పోలీసు శాఖ, ఆర్ అండ్ బి తీసుకోవాలని ఆదేశించారు. పది, పదిహేను కిలోమీటర్ల మేర బుడమేరు కట్ట నిర్మాణం చేపట్టడానికి పక్కనే ఉన్న 18000 గృహాల వారికి నూతన గృహాలు నిర్మించి తరలించాల్సి ఉందన్నారు. ఇందుకు భూమి సమీకరిస్తామన్నారు.

9 నెలల్లో రామవరప్పాడు బ్రిడ్జి
నిడమానూరు బ్రిడ్రి, రామవరప్పాడు కాల్వ అవతల పక్క బ్రిడ్జి నిర్మాణాలు చేప్టటాల్సి ఉందని ముఖ్యమంత్రి ఎమ్మెల్యేలు గద్దె రామమోహన్, వల్లభనేని వంశీల సూచనలకు స్పందిస్తూ అన్నారు. రామవరప్పాడు బ్రిడ్జి నిర్మాణం పూర్తికి 9 నెలల వ్యవధిని నిర్దేశించారు

మంచి నీటి చెరువులను శుద్ధిచేసి, త్రాగునీటికి ఇబ్బందులు లేకుండా అందుబాటులోకి తేవాలని వంశీ ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు. వెంటనే పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి చెప్పారు. జిల్లా పరిషత్ రహదార్లను కూడా అభివృద్ధి చేయాలని సమావేశంలో పాల్గొన్న జడ్పీ చైర్ పర్సన్ గద్దె అనురాధ ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read