వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి పై, ఏపీసీసీ చీఫ్ రఘువీరా రెడ్డి ధ్వజమెత్తారు. అసెంబ్లీ సమావేశాలకు హాజరుకాకూడదని జగన్ తీసుకున్న నిర్ణయాన్ని ఆయన తప్పుబట్టారు. ప్రజా సమస్యలను చర్చించాల్సిన అసెంబ్లీ సమావేశాలకు వెళ్లకుండా, పాదయాత్రకు వెళతానని జగన్ అంటున్నారని... ఇది ముమ్మాటికీ యుద్ధభూమి నుంచి పారిపోవడమేనని ఎద్దేవా చేశారు.
ఏదైనా సమస్య కోసం వెళ్తే, నన్ను సీఎంను చేయండి.. అప్పుడే చేస్తానని చెప్పే నాయకుడు దేశం మొత్తం మీద ఈయనొక్కరే అంటూ ఎద్దేవా చేసారు... శాసనసభ అంటే ప్రభుత్వాన్ని నిలదీయడానికి చేసే వేదిక. ప్రజలు ప్రతిపక్ష పాత్ర అప్పగించినందుకు అక్కడ వారి సమస్యలను ప్రస్తావించి.. పరిష్కరించాలి గానీ, ఇదేంటి అంటూ మండిపడ్డారు.
తమ సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావించి, పరిష్కరించడానికే జగన్‌కు ప్రతిపక్ష నేత పదవిని ప్రజలు కట్టబెట్టారని, మంగళవారం తూర్పుగోదావరి జిల్లా అన్నవరంలో ఆయన విలేకరులతో అన్నారు. ప్రజల సమస్యల పరిష్కారం కోసం పాటు పడాల్సిన ప్రతి పక్ష నాయకుడు, అసెంబ్లీకి వెళ్లనంటున్నారని ఇలాంటి వారికి ప్రజలు ఓటు ఎందుకు వేయాలని రఘువీరా ప్రశ్నించారు. జగన్ పాదయాత్రకు ప్రజలు రావచ్చేమో కానీ ఆ పాదయాత్రకు ప్రజామోదం ఉండదని ఆయన అన్నారు. ఆయన పార్టీని వచ్చే ఎన్నికల్లో ప్రజలు తిరస్కరిస్తారన్నారు.