అమెరికా పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి, అలాగే మన రాష్ట్రానికి చికాగో ఎన్నారైలు దీపావళి గిఫ్ట్ ఇచ్చారు. ఐటీ పరిశ్రమలు ఆంధ్రావనికి వెల్లువెత్తనున్నాయి. అమెరికా నుంచి రానున్న ఏడాది కాలంలో ఆంధ్రప్రదేశ్ కు 500 సంస్థలు కార్యకలాపాలు ప్రారంభించాలని లక్ష్యాన్ని నిర్దేశించారు. చంద్రబాబు పర్యటనలో భాగంగా, ముందుగా అమెరికాకు చెందిన జిటన్ సహా 80 ఐటీ కంపెనీల ప్రతినిధులతో సమావేశమయ్యారు. వీరిలో అత్యధికులు తెలుగువారు. ఐటి సిటీ పై ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఐటీ టాస్కుఫోర్స్ చైర్మన్ గారపాటి ప్రసాద్ ప్రెజెంటేషన్ ఇచ్చారు.
విశాఖ నగరాన్ని మెగా ఐటీ సిటీగా, అమరావతి నగరాన్ని మేజర్ ఐటీ హబ్‌గా మార్చేందుకు ప్రతిపాదించారు. ఇదిలా ఉంటే ఆంధ్రప్రదేశ్ లో ఐటి పరిశ్రమల స్థాపనకు 450 నుంచి 500 మంది ప్రవాస భారతీయులు ఆసక్తిచూపుతున్నారు. ఆంధ్రప్రదేశ్ ఆర్థికాభివృద్ధి మండలితో (ఇడిబి) తో 100 అవగాహన ఒప్పందాలకు సంసిద్ధత తెలిపారు. రాష్ట్రంలో 6 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో తమ సంస్థలను నెలకొల్పడానికి 60 కంపెనీలు వెనువెంటనే విశాఖలో కార్యాలయాలు తెరిచేందుకు ముందుకొచ్చాయి. ఈ ఐటి కంపెనీల ద్వారా 8వేల మందికి ప్రత్యక్షంగా ఉద్యోగాలు, 20 వేల మందికి పరోక్షంగా ఉపాధి అవకాశాలు లభిస్తాయి.
వచ్చే 12 మాసాలలో విజయవాడ, విశాఖపట్నం నగరాలలో ఐటీ సంస్థలు కొలువు తీరనున్నాయి. ఏడాదిలోగా ఈ ఐటీ సంస్థలకు అవసరమైన కార్యాలయ వసతిని ఏర్పాటు చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సన్నద్ధత వ్యక్తం చేసింది. ఒకనాడు ముఖ్యమంత్రి చంద్రబాబు ఉమ్మడి రాష్ట్రంలో ఐటీ పరిశ్రమలకోసం న్యూయార్కులో ఫైలు పట్టుకుని సీఈఓలా తిరిగిన రోజులు అక్కడి తెలుగువారి స్మృతి పథంలో మెదిలాయి. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు బృందంలో ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు, ప్రభుత్వ సలహాదారు డా. పరకాల ప్రభాకర్, ముఖ్యమంత్రి ముఖ్య కార్యదర్శి జి సాయి ప్రసాద్, ఈడీబీ సీఈవో జాస్తి కృష్ణ కిషోర్, ముఖ్యమంత్రి వ్యక్తిగత కార్యదర్శ తదితరులున్నారు.