పారిశ్రామికంగా కొత్త పుంతలు తొక్కుతున్న చిత్తూరు జిల్లా శ్రీ సిటీ కీర్తి కిరీటంలో మరో కలికితురాయి చేరబోతున్నది. సామాన్యులకు సైతం కనీసావసరంగా మారిపోయిన మొబైల్ ఫోన్లు ఇప్పటికే మేడిన్ ఆంధ్రా బ్రాండ్‌తో తయారవుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటిదాకా మొబైల్ ఫోన్ల తయారీ కేంద్రాలు ఇతర దేశాల్లోనే ఉన్నాయి. కానీ.. భారతదేశంలో మొట్టమొదటి మొబైల్ మాన్యుఫాక్చరింగ్ హబ్‌ను శ్రీ సిటీలో ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే..
ప్రపంచంలో అతి పెద్ద ఎలక్ట్రానిక్స్ కంపెనీ "సోనీ ఇండియా" భారతదేశంలోనే ఫోన్లు తయారు చేసి మార్కెట్ లోకి ప్రవేశించడానికి ప్రయత్నిస్తుంది. సోనీ ఇండియా రెండు మోడల్స్ లో, Xperia R1 Plus and R1, రూ. 12,000 నుంచి రూ. 15,000 రేంజ్ లో, మన దేశ మార్కెట్ లో ప్రవేశించనుంది. ఈ ఫోన్స్ తయారు చెయ్యటానికి మన రాష్ట్రంలో, శ్రీ సిటీలో ని ఫాక్స్‌కాన్ కంపెనీ సహాయం తీసుకోనుంది... నవంబర్ నుండి "సోనీ ఇండియా" మేడ్ ఇన్ ఆంధ్రా ఫోన్లు మార్కెట్ లోకి రానున్నాయి...
ఫాక్స్‌కాన్, మైక్రోమాక్స్, లావా, సెల్కాన్, కార్బన్ మొబైల్ కంపెనీలు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్నాయి. ఇటీవలి కాలంలో శ్రీసిటీ సెజ్‌లో సెల్కాన్, ఫాక్స్‌కాన్ ప్లాంట్ కార్యకలాపాలు ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఫాక్స్‌కాన్ ప్లాంట్ లో తయారైన షామీకి చెందిన రెడ్మీ స్మార్ట్‌ఫోన్ ఇప్పటికే విస్తృతంగా మార్కెట్ లో ఉన్నాయి. ఫాక్స్‌కాన్ ఆధారంగా భవిష్యత్తులో సెల్ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాల తయారీలో నిమగ్నమైన ఇతర కంపెనీలు ఇక్కడకు వస్తాయనే అభిప్రాయంతో ప్రభుత్వం ఉంది. మరోపక్క అనంతపురం- హిందూపురం మధ్య గల ప్రదేశంలో ఎలక్ట్రానిక్ పరిశ్రమను ఆకర్షించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. బెంగుళూరుకు దగ్గరగా ఉండటం, స్థలం లభ్యత తదితర సానుకూలతలు అక్కడ ఉన్నాయి. జపాన్, కొరియా, సింగపూర్ కంపెనీలను ఈమేరకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కోరినట్లు అధికార వర్గాలు వివరిస్తున్నాయి.