రాజధాని ప్రభుత్వ భవన సముదాయ ఆకృతుల రూపకల్పన తుదిదశకు చేరుకుంది. ముఖ్యంగా హైకోర్టు భవన ఆకృతి దాదాపుగా తుదిరూపానికి వచ్చింది. శాసనసభ భవంతి ఆకృతులలో కొద్దిపాటి మార్పులను సూచించిన ముఖ్యమంత్రి- త్వరలో ఆ నమూనాలను చూపించి సాధ్యమైనంత వేగంగా నిర్మాణ పనులను ప్రారంభించాలని నిర్దేశించారు. లండన్‌లో నార్మన్ ఫోస్టర్ కార్యాలయంలో వరుసగా రెండురోజుల పాటు జరిగిన సుదీర్ఘ సమావేశాలలో ఆర్కిటెక్టులు సమర్పించిన ఆకృతుల నమూనాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంతృప్తి వ్యక్తంచేశారు. బుధవారం మధ్యాహ్నం జరిగిన రెండోరోజు సమావేశంలో వీటిపై కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. హైకోర్టు ఆకృతి ఓకే: హైకోర్టు భవన ఆకృతి దాదాపుగా తుది రూపానికి వచ్చింది. ముఖద్వారం, భవనంలో ఇతర భాగాలలో చిన్న చిన్న మార్పులు చేర్పులు చేస్తే బాగుంటుందని ముఖ్యమంత్రి, ప్రతినిధి బృందంలోని సభ్యులు అభిప్రాయపడ్డారు. ఆ మార్పులు కొన్ని రోజులలోనే పూర్తిచేసి నిర్మాణ పనులు వేగిరం ప్రారంభించాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు.
శాసనసభ ఆకృతిపై చర్చ: శాసనసభకు సంబంధించి నిన్న నార్మన్ ఫోస్టర్ ప్రదర్శించిన ఆకృతులపై వివరంగా చర్చ జరిగింది. నిన్న ఇచ్చిన ఆకృతులతో పాటు తొలిరోజుల్లో ఫోస్టర్ సమర్పించిన పొడవైన స్థంభాకారంలో ఉన్న ఆకృతిని మళ్లీ పరిశీలనకు వచ్చింది. ఈ రెండింటిపై విపులంగా అధ్యయనం చేసి, వాటిల్లో ఉత్తమంగా ఉన్న అంశాలన్నీ క్రోడీకరించి మరింత మెరుగుపరచి నమూనాలను తయారుచేసి చూపించమని ముఖ్యమంత్రి సూచించారు. ఆ నమూనాలు తయారయ్యాక వాటిని పరిశీలించి తుది నిర్ణయం తీసుకోవాలని సీఎం నిర్ణయించారు. ఐదు టవర్లుగా సచివాలయం: సచివాలయానికి సంబంధించి జరిపిన సమాలోచనలో ఒక స్పష్టత వచ్చింది. మొత్తం 5 టవర్లుగా సచివాలయాన్ని నిర్మిస్తారు. ఇందులో రాష్ట్ర మంత్రుల కార్యాలయాలు, ప్రధాన కార్యదర్శులు, ప్రత్యేక కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులు, విభాగాధిపతుల కార్యాలయాల కోసం 4 భారీ టవర్లు ఉంటాయి. వీటికి కొంచెం ఎడంగా ముఖ్యమంత్రి కార్యాలయం, ముఖ్యమంత్రి కార్శదర్శుల కార్యస్థానాలు, సాధారణ పరిపాలన శాఖ కార్యాలయం, వీటిన్నింటితో వేరే టవర్ ఉంటుంది. ఐతే, ఈ 5 టవర్లను ఒకే వరుసలో నిర్మించాలా, లేక రెండు, మూడు వరుసలలో నిర్మించాలా అనే అంశంపై కొంత చర్చ జరిగింది. దీనిపై రెండు, మూడు ఆప్షన్లతో నమూనాలను సిద్ధం చేసి చూపించాలని ముఖ్యమంత్రి ఆర్కిటెక్టులకు సూచించారు.
త్వరలో భవన సముదాయ నిర్మాణ పనులు ప్రారంభం: పరిపాలన నగర నిర్మాణంలో ఇక జాప్యం చేయరాదని ముఖ్యమంత్రి భావిస్తున్నారు. రెండు ముఖ్యమైన భవంతుల ఆకృతుల నమూనాలను జాప్యం చేయకుండా తయారుచేసి, కొద్ది రోజుల్లోనే తనకు చూపించాలని ముఖ్యమంత్రి ఆర్కిటెక్టులకు చెప్పారు. దీనిని నిరంతరం పర్యవేక్షించి త్వరలో అన్నీ పూర్తయ్యేలా చూడాలని సీఆర్‌డీఏ అధికారులను ఆదేశించారు. ఆకృతులు, శిల్పరూపాలపై తాను వ్యక్తంచేసిన అభిప్రాయాలను, రాజధాని కమిటీ సూచనలను, ప్రభుత్వవర్గాలోను, ప్రజలలోనూ వ్యక్తమయ్యే అభిప్రాయాలను నార్మన్ ఫోస్టర్‌కు ఎప్పటికప్పుడు తెలియజేయమని ప్రముఖ సినీ దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళికి చంద్రబాబు నాయుడు సూచించారు. అంతకుముందు ముఖ్యమంత్రి నార్మన్ రాబర్ట్ ఫోస్టర్‌తో మాట్లాడుతూ, ప్రపంచంలోని ఐదు అగ్రశ్రేణి నగరాలలో ఒకటిగా నిలిచే అత్యద్భుతమైన రాజధానిని నిర్మించడం కోసమే ఇంత పెద్దఎత్తున కసరత్తు చేయాల్సివస్తోందని పునరుద్ఘాటించారు. ‘ఐదు కోట్లమంది ప్రజలు మనపై భారీ అంచనాలతో ఉన్నారు. వారు విలక్షణమైన, దిగ్గజ నమూనాల కోసం ఎదురుచూస్తున్నారు’ అని ఈ భేటీలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చెప్పారు. ప్రపంచంలోని తొలి ఐదు నగరాలలో ఒకటిగా నిలిచే నగరమంటే దాని నిర్మాణశైలి, ఆకృతులు అసాధారణ రీతిలో, అపూర్వంగా నిలిచేలా ఉండాలని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. దానికోసమే ఇంతగా కష్టపడుతున్నామని, ఎడతెగని సమాలోచనలు చేస్తున్నామని వివరించారు. అత్యుత్తమ ఆర్కిటెక్టుగా అంతర్జాతీయంగా మంచి పేరున్న ఫోస్టర్ సంస్థ అమరావతి కోసం తలమానికంగా నిలిచే ఆకృతులు అందిస్తుందనే ఉద్దేశంతోనే ఈ సంస్థకు బాధ్యతలు అప్పగించామని గుర్తుచేశారు. ఈ నమ్మకాన్ని నిలిపేలా తుది ఆకృతులు ఉండాలని అన్నారు. ‘మీరిచ్చిన ఆకృతులు, ప్రణాళికలతో మీరు తప్పకుండా చరిత్రలో నిలిచిపోతారు’ అని వ్యాఖ్యానించారు.