2017-18 లో వ్యవసాయ రుణాల లక్ష్యం రూ.87,471 కోట్లు కాగా ఖరీఫ్ వ్యవసాయ రుణాల లక్ష్యం రూ.50,919 కోట్లు అని, రూ.47,156 కోట్ల మేర లక్ష్యం సాధించామని (93%) ముఖ్యమంత్రి చెప్పారు. 2016-17 ఖరీఫ్ లో కౌలు రైతులకు ఇచ్చిన రుణాలు రూ.1141.60 కోట్లు అని, 4,98, 529 మంది కౌలు రైతులు లబ్ది పొందారన్నారు. ఖరీఫ్ సీజన్ లో వృద్ధిరేటును 12% వస్తుందన్న అంచనాలున్నాయని చెప్పారు. పంటల బీమాపై రైతాంగంలో మరింత చైతన్యం నింపాలని కోరారు.
2016లో పంటల బీమా కింద రైతులు రూ.656.52 కోట్లు పొందారని, క్లెయిముల కింద విడుదల చేసిన మొత్తం రూ.633.82 కోట్లు అని వివరించారు. ఇవ్వాల్సిన బకాయిలు రూ. 18.74 కోట్లు ఉన్నట్లు గుర్తించామని వివరించారు. పంటల బీమా కింద 19.77 లక్షల రైతులు నమోదు చేసుకున్నారన్నారు. రైతుల్లో ‘ప్లాంటిక్స్ యాప్’పై అవగాహన కలిగించాలని, పంటలకు వచ్చే చీడపీడలను ఆకుల ద్వారా గుర్తించ వచ్చని ముఖ్యమంత్రి చెప్పారు.
విశాఖలో వచ్చే నవంబరు 15 నుంచి 17 వ తేదీవరకు జరిగే సదస్సుకు బిల్ గేట్స్ రానున్నారని, ఆ సదస్సుకు అధికారులు పెట్టిన ‘స్మార్ట్ ఫార్మింగ్, సంపన్నరైతు సమ్మిట్’ అనే పేరుకు ముఖ్యమంత్రి మార్పులను సూచించారు. ప్రోగ్రెస్ ఆఫ్ ఫార్మర్, స్మార్ట్ ఫార్మర్, స్మార్ట్ ఫామింగ్ సంపన్న రైతు సమ్మిట్ కు ప్రోగ్రెస్ ఆఫ్ ఫార్మింగ్ ప్లాట్ ఫామ్ అనే పేర్లను పరిశీలించాలన్నారు.
కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సీఎండీ పి. అల్లీరాణి మాట్లాడుతూ రైతాంగం కష్టాలను గుర్తించి వారిని బాధల నుంచి విముక్తం చేయడంలో దేశంలో అనేక రాష్ట్రాలకంటే ఆంధ్రప్రదేశ్ ముందుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును ప్రశంసించారు.
ఇదిలా ఉంటే ముఖ్యమంత్రి విడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రాజెక్టులలో తాజాగా వచ్చి చేరుతున్న జలాలు, నీటికొలతల వివరాలను అడిగి తెలుసుకున్నారు. రాష్ట్రంలో జలాశయాల పరిస్థితిని సమీక్షించారు. వ్యవసాయం ద్వారా 25% ఆదాయం రావాలన్నారు. భారత ప్రభుత్వ ప్రాయోజిత పథకాలతో పశుగ్రాస క్షేత్రాలను అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు దిశానిర్దేశం చేశారు.