త్వరలో రాష్ట్రవ్యాప్తంగా ‘విలేజ్ మాల్’ల ఏర్పాటుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆమోదం తెలిపారు. మొత్తం 29 వేల చౌకధరల దుకాణాలను దశల వారీగా ‘విలేజ్ మాల్’లుగా మార్చాలని అధికారులను ఆదేశించారు. తక్కువ ధరకు, నాణ్యమైన నిత్యావసర వస్తువులను వినియోగదారులకు అందించడమే లక్ష్యం కావాలని సూచించారు. శుక్రవారం సచివాలయంలో జరిగిన పౌరసరఫరాల శాఖ సమీక్ష సమావేశంలో ‘అన్న విలేజ్ మాల్’ పేరుతో తొలివిడతగా 6,500 దుకాణాల ఏర్పాటుకు ముఖ్యమంత్రి పచ్చజెండా ఊపారు. రిలయన్స్, ఫ్యూచర్ గ్రూపుల భాగస్వామ్యంతో ఏర్పాటు చేస్తున్న ఈ దుకాణాలను అత్యంత ఆకర్షణీయంగా తీర్చిదిద్దడంతో పాటు, ప్రత్యేకంగా లోగో రూపొందించాలని చెప్పారు.

కనీసం 200 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటుచేసే ‘అన్న విలేజ్ మాల్’కు మొత్తం వ్యయంలో 25% ప్రభుత్వం భరించమే కాకుండా, మరో 25% ‘ముద్ర’ రుణాన్ని డీలరుకు ఇప్పించనుంది. ఈ మాల్‌లో డ్వాక్రా, మెప్మా, జీసీసీ ఉత్పత్తులతో పాటు ప్రభుత్వం రైతుల నుంచి కొనుగోలు చేసే వివిధ వ్యవసాయ ఉత్పత్తులను అందుబాటులో వుంచనుంది. బందరు లడ్డు, కాకినాడ కాజా, తెలుగింటి పచ్చళ్లు వంటి వాటిని కూడా లభిస్తాయి. ఎవరైనా సరే తమ ఉత్పత్తులను ‘అన్న విలేజ్ మాల్’లో విక్రయించుకునే సౌలభ్యాన్ని ప్రభుత్వం కల్పిస్తుంది.

ఇక ‘రేషన్ బియ్యం’ తమకు వద్దు అనుకునే తెల్లకార్డుదారులకు అంతేవిలువైన నగదును ‘అన్న విలేజ్ మాల్’లో కావాల్సిన ఆహార పదార్ధాలు కొనుగోలు చేసుకునే వెసులుబాటు కల్పించాలని అధికారులకు ముఖ్యమంత్రి చెప్పారు. ఖాళీగా వున్న 4,599 చౌకధరల దుకాణాలకు డీలర్లను వెంటనే నియమించాలని అధికారులకు ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. రేషన్ సరుకుల పంపిణీలో లబ్దిదారులకు సాంకేతిక ఇబ్బందులు తలెత్తితే ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషించాలని అన్నారు.

కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ ఎత్తివేసినా తెల్ల రేషన్‌ కార్డుదారులకు మార్కెట్ ధర కన్నా 50% తక్కువకు నెలకు అర కిలో పంచదార పంపిణీ చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. వచ్చే ఏడాది జనవరి నుంచి అందించే రేషన్‌లో పంచదారను జత చేయాలని చెప్పారు. అలాగే ప్రత్యేక అవసరాలు వున్న కూరాకుల, రజక, మత్స్యకార తదితర సామాజికవర్గాల వారికి వైట్ కిరోసిన్‌ ఇవ్వాలని అన్నారు. కొత్తగా రేషన్ కార్డులు మంజూరు చేసినప్పుడు బోగస్ రేషన్ కార్డులు జారీ కాకుండా జాగ్రత్త పడాలని చెప్పారు. మరోవైపు ధాన్యం సేకరణకు త్వరలో మొబైల్ అప్లికేషన్ తీసుకువస్తున్నట్టు అధికారులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువచ్చారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read