పోలవరం పనులను లక్ష్యం మేరకు 2019లోగా పూర్తి చేయాలంటే 60-సీ నిబంధనను అమలు చేయాలని నిర్ణయించినట్టు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చెప్పారు. దీనిపై ఒకటో తేదీన జరిగే మంత్రిమండలి సమావేశంలో మరింత వివరంగా చర్చించి తుది నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. సోమవారం మధ్యాహ్నం తన కార్యాలయంలో ముఖ్యమంత్రి జల వనరుల శాఖ అధికారులు, నిర్మాణ సంస్థలతో పోలవరం, ఇతర ప్రాధాన్య ప్రాజెక్టుల పనులలో పురోగతిని సమీక్షించారు.

cbn polavaram 30102017 2

పోలవరం ప్రధాన పనులు పూర్తి చేయడంలో తలెత్తిన ఇబ్బందులను అధిగమించేందుకు చట్ట ప్రకారం ముందుకు వెళ్లాలని నిర్ణయించామని, ప్రధాన కాంట్రాక్టు సంస్థ విషయంలో ఎలా వ్యవహరించాలనే అంశంపై పలు మార్గాలను పరిశీలించామని ముఖ్యమంత్రి ఈ సమావేశంలో చెప్పారు. ఎర్త్ కమ్ రాక్‌ఫిల్ డ్యామ్ (ఈసీఆర్‌ఎఫ్‌), కాఫర్‌ డ్యామ్‌ పనులు ఈ సీజన్‌లోనే చేపట్టాల్సి ఉన్నందున ప్రధాన నిర్మాణ సంస్థను కొనసాగిస్తూనే, కొన్ని పనులకు 60-సీ నిబంధన వర్తింపజేసి ముందుకు వెళ్లాలని జల వనరుల నిపుణులు సూచించడంతో ఆ ప్రకారం నడుచుకోవాలని ప్రాధమికంగా నిర్ణయించామని ముఖ్యమంత్రి వివరించారు.

cbn polavaram 30102017 3

డయాఫ్రమ్ వాల్ సకాలానికి పూర్తిచేస్తున్నారని ముఖ్యమంత్రి సంతృప్తి వ్యక్తంచేశారు. నిర్ధేశించిన లక్ష్యాలకు అనుగుణంగా అప్పగించిన పనులను సకాలంలో పూర్తిచేస్తున్నారని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ఎల్ అండ్ టీ, బావర్ సంస్థలను అభినందించారు. గడచిన 14 రోజులలో 55 వేల క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పనులు జరిగాయని సమావేశంలో అధికారులు వివరించగా, లక్ష్యానికంటే ఇది 10 శాతం తక్కువేనని, ఇంకా పనులలో వేగం పెంచాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఎర్త్‌వర్క్, కాంక్రీట్ పనులలో ఇక జాప్యం జరగడానికి వీల్లేదని స్పష్టంచేసిన ముఖ్యమంత్రి-60సీ నిబంధన ప్రకారం ఇప్పుడు తీసుకునే చర్యలతో ఈ పనులలో వేగం పుంజుకోవాలని చెప్పారు. సీడబ్లూసీ నుంచి ఈ వారంలో అవసరమైన క్లియరెన్సు వచ్చేవిధంగా తగు చర్యలు చేపట్టి గేట్ల నిర్మాణపు పనులను వేగంగా పూర్తిచేయాలని ముఖ్యమంత్రి నిర్దేశించారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read