కడుపు నొప్పి, కాలునొప్పి, జ్వరం... ఇలా చిన్నా చితకా సమస్యలతో మందుల షాపల దగ్గరకు నిత్యం ఎందరో వస్తుంటారు. అక్కడ కౌంటర్లో ఉన్నవారు తమకు తెలిసిన మందులు ఇవ్వడంతో పాటు అది ఎంత డోస్, ఎన్ని రోజులు వాడాలో కూడా చెప్పేస్తుంటారు. ఇలా సొంత వైద్యం చేసుకోవడం ద్వారా ఎన్నో దుష్ఫలితాలు వస్తాయని డాక్టర్లు ఎంత మొత్తుకున్నా పట్టించుకొనేవారే లేరు. డాక్టర్ దగ్గరకు వెళ్లే ఫీజ్ ఇవ్వాల్సివస్తుందని, చిన్న సమస్యలకు కూడా అంతంత ఇవ్వడం ఎందుకని భావించే వారే ఎక్కువ.
అయితే దీనివల్ల కలిగే ప్రమాదాలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం యదేచ్చగా మందులు అమ్మే విధానానికి చెక్ పెట్టాలని నిర్ణయించింది. దీని కోసం కాంప్రహెన్సివ్ డ్రగ్ మానిటరింగ్ సిస్టమ్ (సీడీఎంఎస్) అనే నూతన విధానాన్ని అమలులోకి తెస్తున్నారు. రాష్ట్రంలో రిజిస్టరయిన వైద్యులందరూ ఈ విధానంలోనే రోగులకు మందులను సూచించాల్సి ఉంటుంది. దేశంలోనే మొదటిసారిగా డిజిటల్ ప్రిస్క్రిపన్ను రాష్ట్రంలో త్వరలోనే అమలు చేయబోతున్నారు.
ఇది ఎలా పని చేస్తుంది అంటే... ఇష్టానుసారంగా మందులు ఇవ్వటం నివారించేందుకు రూ.1.2కోట్లు వెచ్చించి సీడీఎంఎస్ విధానాన్ని తీసుకువచ్చారు. ఈ సాఫ్ట్ వేర్ కు 64వేల మంది వైద్యులు, దాదాపుగా అంతే సంఖ్యలో ఉన్న కెమిస్ట్‌లు అనుసందానం అవుతారు. వైద్యుడు తన వద్దకు వచ్చిన రోగిని పరీక్షించిన తరువాత సీడీఎంఎస్ యాప్ ఆన్ చేస్తారు. సూచించిన మందుల వివరాలకు సంబంధించి యాప్‌లో కంపెనీల పేరు వస్తాయి. వాటి నుంచి ఏ కంపెనీ బ్రాండ్ మందు కావాలో ఎంపిక చేసుకుంటారు. వైద్యుడి డిజిటల్ సిగ్నేచర్ తో ఉన్న మందుల జాబితానే ఫార్మసీల్లో పరిగణనలోకి తీసుకుని రోగికి మందులు ఇవ్వాల్సి ఉంటుంది. ఈ సందర్భంలో రోగి మొబైల్ ఫోనుకు వన్‌టైం పాస్వర్డ్ పంపుతారు. దీని సాయంతో రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడైనా మందులు కొనుగోలు చేయవచ్చు. ఫోన్ సదుపాయం లేని పక్షంలో ఆదార్ నంబరుతో రోగులను కెమిస్ట్ గుర్తించాల్సి ఉంటుంది. రాష్ట్రంలో నిర్వహించిన స్మార్ పల్స్ సర్వే డేటాబేస్ కు సీడీఎంఎస్ అనుసంధానం చేస్తారు. ఇప్ప టికే 4.8 కోట్ల మంది వివరాలు మొబైల్ నంబర్లతో సహా ఉన్నాయి.