అమరావతి రాజధాని నిర్మాణంలో భాగంగా, అటవీ భుమాలైన 5,315 ఎకరాలు కేటాయింపుకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.. ఈ అటవీ భూమికి ప్రత్యామ్నాయంగా అనంతపురం,కర్నూలు, కడప జిల్లాల్లోని ప్రభుత్వ భూములను రాష్ట్ర ప్రభుత్వం సేకరించి అటవీశాఖకు బదలాయింపు చేసింది... రాజధాని ప్రాంతంలోని వెంకటాయపాలెం, తాడేపల్లిలో చిన్నపాటి కొండలు, గుట్టలలో నెలకొన్న అటవీ భూములను అమరావతికి కేంద్ర అప్పగించింది. దీనితో రాజధాని నిర్మాణానికి, అభివృద్ధికి అడ్డంకులు తొలిగాయి.
రాష్ట్ర ప్రభుత్వం అమరావతి నిర్మాణం కోసం తయారు చేసిన మాస్టర్ ప్లాన్ లో ముందస్తుగా అటవీ భూములు ఉన్నందున నిర్మాణానికి ఇబ్బందులు తలెత్తుతాయని ఆనుమానం వ్యక్తమైంది. ప్రస్తుతం అటవీ భూములకు సంబంధించిన 5,315ఎకరాలు రాజధాని నిర్మాణ పరిధిలోనికి రావటం, ఇప్పటికే 30వేల ఎకరాల అటవీ భూములను కూడా సిఆర్డిఏ వినియోగించుకోవటం జరుగుతుంది. ఈ నేపధ్యంలో గడువులోపే రాజధానిలో చేపట్టాల్సిన నిర్మాణాలకు కూడా ప్రణాళికలను సిద్ధం చేసుకొని ప్రపంచ బ్యాంకుకు రుణం కోసం నివేదికలు పంపినట్లు తెలుస్తోంది.
ఈ భూములలో ప్రస్తుతం రైతులనుంచి స్వాధీనం చేసుకున్న పొలాలలో గవర్నర్, ముఖ్యమంత్రి, హైకోర్టు ప్రధానన్యాయమూర్తి, న్యాయమూర్తులకు, మంత్రులకు, ప్రజాప్రతినిధులకు, ఐఏఎస్, ఐపిఎస్.ఐఎఫ్ఎస్ ఆధికారులతోపాటు జనరల్ సర్వీసెస్ అధికారులకు, గజిటెడ్ ఆఫీసరు, నాన్గజిటెడ్ ఆఫీసర్లకు 4,016 నివాస గృహాలను నిర్మించేందుకు ప్రభుత్వం ఇప్పటికే డిజైన్లను సింగపూర్, ఇతర దేశాల ఆర్కిటెక్టర్ల ద్వారా నమూనాలను తయారు చేసిపెట్టారు. ఇది ఇలా ఉండగా రాజధానికి అటవీ భూముల వ్యవహారం కేంద్రంతో రాష్ట్రం గత 3సంవత్సరాలుగా ఉత్తర ప్రశ్నోత్తరాలు జరపటంతో పాటు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్వయంగా ప్రధానమంత్రిని కలిసి విన్నవించటంతో, ఎట్టకేలకు అటవీభూములను రాజధాని నిర్మాణానికి బదిలీ అయ్యాయి.