‘చేయూతనిచ్చే బాధ్యత నాది. అందిపుచ్చుకునే అవకాశం మీది’. అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు భరోసా ఇఛ్చారు. సోమవారం అమరావతి సచివాలయ ప్రాంగణంలో ఆయన సింగపూర్ వెళుతున్న 34 మంది రైతుల వాహనాన్ని జెండా ఊపి వీడ్కోలు పలికారు. ఐకమత్యంతో ముందడుగు వేస్తే అభివృద్ధి సాధిస్తారు, అడ్డదారిలో వెళితే జైలుకు వెళ్ళాలి, సక్రమ మార్గంలో వెళితే అభివృద్ధి సాధ్యమని, అడ్డుపడేవారిని నమ్ముకుంటే పతనం తప్పదని చంద్రబాబు ఈ సందర్భంగా అన్నారు. అతి త్వరలో డిజైన్ల ఖరారు పూర్తిచేసుకుని నిర్మంచనున్న రాజధాని అమరావతి సింగపూర్ తరహాలో ఉంటుందని తాను ఎన్నికలకు ముందే చెప్పానని ముఖ్యమంత్రి గుర్తు చేశారు. అడవిలో రాజధాని కట్టుకోవాలని శివరామన్ కమిటీ సిఫారసులు చేసి గందరగోళంలో పడవేస్తే, ఆ కమిటీ నివేదిక ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా లేదని పట్టించుకోలేదని అన్నారు.
రాష్ట్రానికి నడిబొడ్డున రాజధాని ఉండాలని, ఉంటుందనీ తాను ప్రకటించానని చంద్రబాబు తెలిపారు. నాడు కాంగ్రెస్ సారథ్యంలోని యూపీఏ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌ను అన్యాయంగా, అశాస్త్రీయంగా విభజించిందని విమర్శించారు.
రాజధాని లేక, గమ్యం లేని సంక్షోభ కాలంలో తాను ఇఛ్చిన పిలుపునకు రాజధాని ప్రాంత రైతాంగం స్వచ్ఛందంగా ముందుకు వచ్చి భూసమీకరణ విధానంలో విలువైన భూములచ్చారని, వారిని జీవితాంతం గుర్తుంచుకుంటానని చంద్రబాబు కృతజ్ఞతలు తెలిపారు. రాజధానికి భూములిచ్చిన ప్రతి ఒక్క రైతు పారిశ్రమికవేత్తగా ఎదగలన్నదే తన ధ్యేయమని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. రాజధాని రైతుల సర్వతోముఖాభివృద్ధికి అన్ని విధాలా కృషి చేస్తామని, వారికి అండగా ఉంటామని చంద్రబాబు ప్రకటించారు. అచంచల విశ్వాసంతో ఫ్రెంచి ఓపెన్ సింగిల్స్ ఫైనల్స్ లో విజేతగా నిలిచిన కిడాంబి శ్రీకాంత్ ఈ ప్రాంతం వారేనని చంద్రబాబు అభినందించారు.
సింగపూర్ 55 ఏళ్లకు ముందు చేపలు పట్టుకునే చిన్న పల్లె, మలేసియా వెళ్లగొడితే వేరై పట్టుదలతో ఎదిగి అభివృద్ది సాధించారని, ఎడారినే స్వర్గంగా మార్చుకున్నారని ముఖ్యమంత్రి వివరించారు. రాజధాని పరిపాలన నగరం ఆకృతులు తుదిదశకు వచ్చాయని, సచివాలయంలో, ఇతర కార్యాలయాలకు 7 టవర్స్ నిర్మిస్తామని చంద్రబాబు తెలిపారు. ఇక్కడికి ఎంతోమంది వస్తారని, వారితో పోటీపడే స్థాయికి రాజధాని రైతులు ఎదగాలన్నదే తన ఆకాంక్ష అని అన్నారు. ఎదగడానికి సంపద అవసరం లేదు, సంకల్పం ఉండాలని ముఖ్యమంత్రి చెప్పారు. ‘వ్యాపారాలలో మీరు ఎదగాలి, మీకు అన్నివిధాలుగా అవకాశాలు కల్పిస్తాం’ అని అన్నారు.ఆనాడు హైదరాబాద్ లో 163 కిలోమీటర్ల ఔటర్ రింగ్ రోడ్ నిర్మిస్తే అందరూ ఆశ్చర్యపోయారు. ఆలోచన, సంకల్పం ఉంటే అద్భుతాలు చేయవచ్చన్నారు. మెకన్జీ సూచనలతో రాజధాని ప్రాంత రైతుల అభివృద్ధికి చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి భరోసా ఇచ్చారు.