చెడు పై మంచి విజయం సాధించిన రోజు విజయదశమి అని, సత్‌సంకల్పాలకు దేవతల ఆశ్వీర్వచనాలు లభించే శుభసమయం ఇదేనని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. రాష్ట్ర ప్రజలకు, దేశ,విదేశాల్లో తెలుగువారికి విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రాభివృద్ధికి కష్టపడుతూనే మరోవైపు అమ్మవార్ల ఆశీస్సులు కోరుకుంటున్నట్లు తెలిపారు.

నవరాత్రులలో విజయపరంపరకు నిదర్శనంగా దశమిరోజు విజయదశమి పండుగ నిర్వహించటం అనాదిగా సంప్రదాయంగా వస్తోందన్నారు. అభివృద్ధిలో ఆంధ్రప్రదేశ్‌ను దేశంలో అమేయశక్తిగా తీర్చిదిద్దటమే తమ ధ్యేయమని చంద్రబాబు చెప్పారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం, రాజధాని అమరావతి నిర్మాణానికి దుష్టశక్తులు ఎక్కడికక్కడ అడ్డుకోవాలని కుతంత్రాలు పన్నుతున్నాయని చంద్రబాబు అన్నారు. రాష్ట్ర అభివద్ధిని అడ్డుకోవటం కూడా రాక్షసత్వమేనని, అభివృద్ధి నిరోధక శక్తులపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు హెచ్చరించారు. ఇటు కనకదుర్గమ్మ ఆశీస్సులు అటు శ్రీశైలం బ్రమరాంబిక, ద్రాక్షారామ మాణిక్యాంబ, పిఠాపురం పురుహూతిక దేవి ఆశీస్సులతో రాజధాని అమరావతి, పోలవరం ప్రాజెక్టు నిర్మాణాలు ఎలాంటి ఆటంకాలు లేకుండా సాగిపోవాలని కోరుకుంటున్నట్లు ముఖ్యమంత్రి చెప్పారు.

మూడేళ్లుగా ఎగువ నుంచి నీళ్లురాక తడారిన కృష్ణా డెల్టా ఎడారిలా మారకుండా పట్టిసీమ ద్వారా గోదావరి నీరు తెచ్చి పంటలు కాపాడుతున్న విషయాన్ని ముఖ్యమంత్రి గుర్తు చేశారు. ఇటు గోదావరి జలాలు తెచ్చి, కృష్ణా డెల్టాకు వచ్చే కృష్ణా జలాలను రాయలసీమకు ఇస్తున్న విషయాన్ని ముఖ్యమంత్రి ప్రస్తావించారు.

కృష్ణానదీజలాలు రాష్ట్రం ఆర్ధిక సంక్షోభ స్థితిలో ఉన్నప్పటికీ అధికారం చేపట్టిన తర్వాత సంక్షేమాన్ని విడిచిపెట్టలేదని, పెన్షన్లు, రైతు రుణ ఉపశమన పథకాలను విజయవంతంగా అమలుచేస్తున్నట్లు చంద్రబాబు చెప్పారు.
విజయదశమి జానపద కళారూపాలను కళ్లముందుంచే పండుగ అని కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు గుర్తు చేశారు. చిన్నారులు, విద్యార్ధులు విజయదశమి వేళ బొమ్మల కొలువు పెడతారని, బొమ్మలకొలువులు వారి సృజనాత్మకతను ప్రతిబింబిస్తాయని అన్నారు. చదువుతో వచ్చే ఒత్తిళ్ల నుంచి విముక్తమై బొమ్మలకొలువు ద్వారా ఉపశమనం పొందుతారని ముఖ్యమంత్రి వివరించారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read