నోబెల్ అవార్డు గ్రహీత కైలాష్ సత్యార్థి భారత యాత్ర కర్నూలు జిల్లాలో జరిగింది. కర్నూలు జిల్లాలోని ఏపీఎస్పీ బెటాలియన్ మైదానంలో మంగళవారం బాలల భద్రతే భారత భద్రత పేరుతో బహిరంగ సభ జరిగింది. ఇందులో సీఎం చంద్రబాబు, నోబెల్ శాంతి పురస్కార గ్రహీత కైలాశ్ సత్యార్థి పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు పై ప్రశంసల వర్షం కురిపించారు కైలాష్ సత్యార్థి. దేశంలోనే కాదు ప్రపంచంలోనే ఒక నేత ఇలా బాలల హక్కుల పరిరక్షణ కోసం రోడ్డు పైకి రావడం ఇదే మొదటిసారి అని అన్నారు.
తాను భారత యాత్రకు సంకల్పించినప్పుడు సామాజిక అనుసంధాన వేదిక ట్విట్టర్‌లో పోస్టు చేశానని, అప్పుడు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడే మొదట స్పందించారని నోబెల్ శాంతి పురస్కార గ్రహీత కైలాశ్ సత్యార్థి అన్నారు.
ఏపీలో పెట్టుబడులు పెట్టడానికి ఎంతో మంది ముందుకు వస్తున్నారని చెప్పారు. పెట్టుబడులను రాబట్టడంతో పాటు బాలల పరిరక్షణకు కృషి చేయాలని కోరుతున్నానని, చంద్రబాబుతో అన్నారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ, బాలబాలికల సంరక్షణ కోసం కైలాష్ సత్యార్థి నిరంతరం కృషిచేస్తున్నారని బాబు కొనియాడారు. ఆయనను స్ఫూర్తిగా తీసుకుని బాలకార్మిక వ్యవస్థ నిర్మూళనకు అందరూ కృషిచేయాలని ముఖ్యమంత్రి పిలుపు ఇచ్చారు.