తమ సొమ్ము కోసం చాలాకాలంగా ఎదురు చూస్తోన్న అగ్రిగోల్డ్ బాధితులకు సీఐడీ న్యాయం చేయనుంది. నవంబరు ఆఖరు నాటికి మొత్తం సమస్యను పరిష్కరించి బాధితులైన ప్రతి ఒక్కరికీ వారి సొమ్ము ఇప్పించే ప్రయత్నాలకు శ్రీకారం చుట్టింది. అగ్రిగోల్డ్ సంస్థలో డబ్బులు దాచుకున్న వారి జాబితా మొత్తం సిద్ధం చేసిన సీఐడీ అధికారులు సోమవారం వెబ్‌సైట్‌లో పెట్టబోతున్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సుమారు 19 లక్షల మంది అగ్రి గోల్డ్ బాధితుల గుర్తింపు ప్రక్రియ ఈ నెల 19 నుంచి ప్రారంభం కానుంది. ఇందు కోసం రాష్ట్రంలోని అన్ని పోలీస్ స్టేషన్లక్లు ప్రభుత్వం రూపొందించిన ఫార్మాట్లను పంపించారు. వీటి ప్రకారం బాధితులు వివరాల్ని పోలీస్ స్టేషన్ లో నమోదు చేస్తారు. రాష్ట్రంలోని అన్ని పోలీస్ స్టేషన్లలోనూ ఈ ప్రక్రియ సాగుతుంది. అయితే పని ఒత్తిడికనుగుణంగా రోజుకు కనీసం వంద మంది వరకు బాధితుల వివరాల్ని ఒక్కోస్టేషన్లో నమోదు చేయనున్నారు.
దేశ వ్యాప్తంగా 32 లక్షల మంది అగ్రి గోల్డ్ బాధితులుంటే వీరిలో 19 లక్షల మంది ఒక్క ఆంధ్రప్రదేశ్ లోనే ఉన్నారు. మిగిలిన ఖాతాదార్లు, తెలంగాణా, తమిళనాడు, చత్తీస్ఘడ్, ఒడిషా రాష్ట్రాలకు చెందినవారున్నారు.
గతంలో సిఐడి సేకరించిన వివరాల్లో 9 లక్షల మంది మాత్రమే తమ పేర్లు నమోదు చేయించుకున్నారు. ఇంకా పది లక్షల మంది వివరాలు అందాల్సి ఉంది. ఈ సారి ప్రతి డిపాజిట్ దారుడికి న్యాయం జరిగేలా వారి వద్దనున్న ఒరిజనల్ రశీదులు, అగ్రిగోల్డ్ జారీ చేసిన బాండ్లు, బ్యాంక్ అకౌంట్లు, బాధితుడి ఆధార్ కార్డు, బ్యాంక్ ఖాతా వివరాల్ని పోలీసులు సేకరిస్తారు.
సుమారు 30 రోజుల పాటు ఈ ప్రక్రియ జరుగుతుంది. అనంతరం వీటన్నింటిని ప్రభుత్వానికి అందిస్తారు. ఇప్పటికే అగ్రిగోల్డ్ ఆస్తుల విక్రయ వ్యవహారం కోర్టులో ఉంది. దీనిపై స్పష్టత వచ్చి అమ్మకం జరిగిన అనంతరం సమకూరే నిధులు నుంచి బాధితులకు చెల్లించాల్సిన మొత్తాన్ని నేరుగా వారి బ్యాంక్ ఖాతాల్లో ప్రభుత్వం జమ చేస్తుంది.
నెలరోజుల వరకు పోలీస్ స్టేషన్లలో సేకరించిన వివరాలన్నింటిని ఆ తర్వాత ఆయా స్టేషన్లతో పాటు పంచాయతీలు, మున్సిపల్ కార్యాలయాల్లో ప్రదర్శనకు పెడతారు.
మొత్తం 32లక్షల మంది ఖాతాదార్లకు చెందిన 6,380 కోట్ల మొత్తాన్ని అగ్రిగోల్డ్ పక్కదారి పట్టించింది. ఈ కేసు హైకోర్టులో విచారణకొచ్చింది. అగ్రి గోల్డుకు ఉన్న ఆస్తుల్ని విక్రయించి బాధితులకు న్యాయం చేయాలని హైకోర్టు ఆదేశించింది. ఈ కేసు విచారణను సిఐడికి అప్పగించారు. నిర్ణీత గడువిచ్చి బాధితుల్నుంచి ఫిర్యాదులు స్వీకరించింది. ఇటీవల కొన్ని కార్పొరేట్ సంస్థలు అగ్రిగోల్డ్ ఆస్తుల కొనుగోలుకు ముందుకొచ్చాయి. నిర్ణీత మొత్తాన్ని చెల్లిస్తామంటూ కోర్టుకు రాతపూర్వకంగా రాసిచ్చాయి.