అమరావతిలోని నవ నగరాలలో ఆర్థిక అభివృద్ధికి తక్షణం దోహదం చేసే జాతీయ, అంతర్జాతీయ స్థాయి విద్యాసంస్థలు, హోటళ్ల ఏర్పాటుపై నిర్ధిష్ట లక్ష్యాలను ముందుపెట్టుకుని తదనుగుణంగా కార్యాచరణ చేపట్టాలని ముఖ్యమంత్రి సూచించారు. బుధవారం ఉదయం సచివాలయంలో జరిగిన సీఆర్డీఏ వారాంతపు సమీక్షా సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పాల్గున్నారు.
అమరావతిలో విద్యాలయాలను ఏర్పాటు చేయడానికి 25 ప్రఖ్యాత సంస్థలు ముందుకొచ్చాయని, అందులో 11 జాతీయ, అంతర్జాతీయ విద్యాసంస్థలు ఇప్పటికే తమ ప్రాతిపాదనలను పంపించాయని సీఆర్డీఏ కమిషనర్ చెప్పారు. వీటిల్లో 8 సంస్థలు తొలి పది ర్యాంకులలో నిలవగా, మిగిలిన 3 విద్యాలయాలు 11 నుంచి 15 మధ్య ర్యాంకులలో ఉన్నాయని తెలిపారు.
ఇవిగాక మరో 13 సంస్థలు తమంతట తాముగా అమరావతి రావడానికి ఆసక్తి వ్యక్తీకరించాయని వివరించారు. ఒక్కొక్కటీ 5 ఎకరాలలో నెలకొల్పే 2 కేంద్రీయ విద్యాలయాలకు ఆమోదం లభించిందని చెప్పారు.
స్కాటిష్ హై ఇంటర్నేషనల్ స్కూల్, చిన్మయ మిషన్, కేండోర్ ఇంటర్నేషనల్ స్కూల్, ది హెరిటేజ్ స్కూల్, సద్భావన వరల్డ్ స్కూల్, ర్యాన్ గ్లోబల్ స్కూల్, పోడార్ స్కూల్, గ్లాండేల్ అకాడమీ, ఢిల్లీ పబ్లిక్ స్కూల్, జీఐఐఎస్, డీఏవీ గ్రూపు ఆప్ స్కూల్స్ ప్రతిపాదనలు పంపాయన్నారు.
ఇవిగాక, జూబ్లీ పబ్లిక్ స్కూల్, సెయింట్ మాథ్యూస్ పబ్లిక్ స్కూల్, శ్రీ సరస్వతి విద్యాపీఠం, లయోలా పబ్లిక్ స్కూల్, విజ్ఞాన విహార విద్యాకేంద్రం, సిద్ధార్థ అకాడమీ ఆఫ్ జనరల్ అండ్ టెక్నికల్ ఎడ్యుకేషన్, శ్రీపతి సేవా సమితి, ఎల్ కేఎస్ స్కూల్, ఆక్స్ఫర్డ్ పబ్లిక్ స్కూల్, అమరావతి ఎడ్యుకేషనల్ అండ్ కల్చరల్ అకాడమీ, శ్రీ గౌరీ గాయత్రి ఎడ్యుకేషనల్ సొసైటీ, సంస్కృతి గ్లోబల్ స్కూల్ మొదలైన 13 పాఠశాలలు అమరావతిలో తమ విద్యా సంస్థలను ప్రారంభించానికి సిద్దమయ్యాయని కమిషనర్ తెలిపారు.
ఆయా విద్యాసంస్థల ప్రమాణాలు, స్థితిగతులు పూర్తిగా తెలుసుకుని స్పష్టమైన అవగాహనతో తుది నిర్ణయానికి రావాలని ముఖ్యమంత్రి చెప్పారు. ప్రమాణాల విషయంలో ఎక్కడా రాజీపడేది లేదని స్పష్టంచేశారు.