మహర్నవమిని స్త్రీశక్తి విజయం సాధించిన రోజుగా గుర్తించి స్ఫూర్తిపొందాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారాచంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. స్త్రీలలో అమ్మవారి చైతన్యాన్ని గుర్తించడమే ఈ పండుగ పరమార్ధమని చెప్పారు. రాష్ట్ర ప్రజలకు, దేశవిదేశాల్లోని తెలుగువారికి ఆయన మహర్నవమి శుభాకాంక్షలు తెలిపారు. తెలుగులోగిళ్లు పండుగ వాతావరణంతో కళకళలాడాలని, ప్రజల ఆకాంక్షలు నెరవేరాలని అభిలషిస్తున్నట్లు తెలిపారు.
దేవీ నవరాత్రుల ఉత్సవాల్లో మహర్నవమి నాడు అమ్మవారు లోకకంటకుడైన మహిషాసురుణ్ణి వధించి మహిషాసురమర్దనిగా, జగజ్జననిగా అవతరించారని చెప్పారు. దుష్టశిక్షణ, శిష్టరక్షణతో దుర్గాదేవి ఆదిపరాశక్తి అయ్యారని చంద్రబాబు వివరించారు. మహర్నవమినాడు సకల దేవతల అంశగా అమ్మవారు మహాశక్తి రూపంలో దర్శనమిస్తారని, స్త్రీలు అబలలు కారు అని చాటిచెప్పే అలంకారం మహిషాసుర మర్దని అలంకారం అన్నారు.
మహిళలను గౌరవించడంతోనే సరిపెట్టకుండా వారికి సాధికారత కల్పించిన ఘనత తమదేనని ముఖ్యమంత్రి చంద్రబాబు గుర్తు చేశారు. మహానాయకుడు ఎన్టీరామారావు దేశంలో తొలిసారిగా మహిళలకు ఆస్తిహక్కు కల్పించారని, ప్రత్యేక మహిళా విశ్వవిద్యాలయం స్థాపించారన్నారు. తమ హయాంలో స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు, ఉద్యోగాల్లో ప్రత్యేక కోటా ప్రవేశపెట్టామని గుర్తు చేశారు.
తల్లిని పూజించినట్లే ప్రతి మహిళను గౌరవించాలంటూ ఉద్బోధించారు. డ్వాక్రా మహిళలను వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దుతూ సాధికారత కల్పిస్తున్నామన్నారు. స్వయం సహాయక మహిళల నుంచి స్వయం వ్యాపార మహిళలుగా తీర్చిదిద్దాలని సంకల్పించామని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో మహిళా పార్లమెంటు సదస్సు మహిళాలోకానికి స్ఫూర్తినిచ్చిందని చెప్పారు.