కరువుతో అల్లాడుతున్న అనంతపురం జిల్లాలో యువతకు ఉపాధి కల్పించే కియా కార్ల పరిశ్రమ నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. రూ.13,500 కోట్ల పెట్టుబడితో ప్రారంభిస్తున్న ఈ పరిశ్రమ వల్ల 20 వేల మందికిపైగా ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి కలుగనుంది.
పెనుకొండ మండలంలో పరిశ్రమకు అవసరమైన భూమిని అధికారులు కేటాయించారు. అమ్మవారిపల్లి, ఎర్రమంచి, పరిసర భూముల్లో 599 ఎకరాలను ప్రభుత్వం ఏపీఐఐసీ ద్వారా సేకరించింది. ఇందులో 535 ఎకరాలు కియా పరిశ్రమకు అప్పగించగా.. మిగిలిన భూమిని రోడ్డు, ఇతర మౌలిక వసతులకు ఉపయోగించేలా ప్రణాళిక తయారు చేశారు. పరిశ్రమకు కేటాయించిన భూముల్లో చదును, విద్యుత్ కోసం 220కేవీ సబ్స్టేషన్, వ్యర్థ జలాలను శుద్ధి చేసే ప్లాంటు నిర్మాణం చేపట్టారు.
జూలై నెలాఖరుకు భూమి చదును పనులు పూర్తి చేసి ఆగస్టు నుంచి పరిశ్రమ నిర్మాణ పనులు ప్రారంభిస్తామని కియా ప్రతినిధులు తెలిపారు. 2018 మార్చి నాటికి ట్రయల్ రన్, 2019 సెప్టెంబరుకల్లా ఉత్పత్తిని ప్రారంభించడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. ఏడాదికి మూడు లక్షల కార్ల ఉత్పత్తి సామర్థ్యంతో దీనిని నిర్మిస్తున్నారు. అంటే... రోజుకు దాదాపు 820 కార్లు! అంటే... గంటకు సుమారు 30 కార్లు బయటికి వస్తాయి. వీటిని ఇక్కడి నుంచి దేశ విదేశాలకు ఎగుమతి చేస్తారు.
పనుల వేగంపై ముఖ్యమంత్రి చంద్రబాబు కియా ప్రతినిధులతో, జిల్లా అధికారులతో ఎప్పటికప్పుడు సమీక్షలు జరుపుతున్నారు. వచ్చే నెలలో ప్రధాని కియా కంపెనీ భూమి పూజకు వచ్చే అవకాశాలు ఉన్నాయని ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి..
ఈ పరిశ్రమలో 4 వేల మంది రెగ్యులర్ ఉద్యోగులు, 7 వేల మంది కాంట్రాక్టు సిబ్బంది పనిచేస్తారు. పరోక్షంగా మరో 11 వేల మందికి ఉపాధి లభించనున్నట్లు సమాచారం.
దక్షిణకొరియాకు చెందిన కార్ల తయారీ దిగ్గజం కియా పరిశ్రమ 15వ ప్లాంటు కోసం దేశంలోని పలు రాష్ర్టాలు తీవ్ర ప్రయత్నాలు చేశాయి. ముఖ్యంగా కర్ణాటక, తమిళనాడు గట్టిగా పోటీపడ్డాయి. ఈ పరిస్థితిలో సీఎం చంద్రబాబు ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని ఆ పరిశ్రమను అనంతపురం జిల్లాకు వచ్చేలా చేశారు.