అమరావతిని అడ్డుకోవటమే ధ్యేయంగా రాష్ట్రంలో ఉన్న కొంత మంది, రాజధాని నిర్మాణం కోసం లోన్ ఇస్తున్న ప్రపంచ బ్యాంకుకి, లోన్ ఇవ్వద్దు అంటూ, లేఖలు రాసిన సంగతి తెలిసిందే..
ఈ ఫిర్యాదులు అందిన నేపద్యంలో ప్రపంచ బ్యాంకు బృందం అమరావతి రాజధాని ప్రాంతంలో బుధవారం పర్యటించింది. రాజధాని నిర్మాణానికి రైతుల నుండి వచ్చిన వినతులపై సుదీర్ఘ సమావేశం నిర్వహించింది.
రాజదాని నిర్మాణానికి ప్రభుత్వ రుణం నిమిత్తం ప్రపంచ బ్యాంకుకు విజ్ఞప్తి చేసిన సమయంలో ఈ పర్యటన జరగడం సర్వత్రా ఆసక్తికరంగా వూరింది. ముందుగా నేలపాడు గ్రామంలో ప్రపంచ బ్యాంకు బృందం పర్యటించింది. తుళ్లూరు మండలం నేలపాడులోని పంట భూములలో ఏర్పాటు చేసిన వేదిక వద్ద రైతుల అభిప్రాయాలు విన్నారు. బహిరంగ సభ మాదిరిగా ఏర్పాటు చేసిన ఆ ప్రాంతంలో మాట్లాడిన రైతులంతా రాజధాని నిర్మాణానికి తాము ఇష్టపూర్వకంగా భూములు ఇచ్చామని స్పష్టంచేశారు.
రైతులంతా ముక్తకంఠంతో చంద్రబాబు సర్కారుకు తమ మద్దతు తెలియజేశారు. ప్రపంచ స్థాయి రాజధానిలో తామంతా భాగస్వాములు కావడం ఆనందంగా ఉందన్నారు. ముఖ్యమంత్రి చేపట్టిన భూ సమీకరణకు తామంతా ఇష్టంగానే భూములిచ్చామని స్పష్టం చేశారు. కొందరు రాజధానికి వ్యతిరేకంగా పనిచేస్తూ, ఇటువంటి తప్పడు ఫిర్యాదులు చేస్తున్నారని తెలిపారు. రాజధాని వ్యతిరేకులు అతి కొద్ది మంది ఫిర్యాదులు చేయటంతో 95 శాతం మంది రైతులు నష్టపోయే ప్రమాదం ఉందని, అపోహలు నమ్మవద్దని బృందానికి సూచించారు. పంట భూములు ఇచ్చిన తమను సీఎం అన్ని విధాలుగా ఆదుకున్నారని ప్రపంచ బ్యాంకు ప్రతినిధులకు రైతులు తెలిపారు.
అన్నీ విన్న తరువాత స్థానిక రైతులు, ప్రజలను ఉద్దేశించి ప్రపంచ బ్యాంకు బృదం ప్రసంగించింది. అందరి అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని ప్రపంచ బ్యాంకు ఉన్నత స్థాయి అధికారులకు తెలియజేస్తామని చెప్పారు.