మరో 100 రోజుల్లో 28 ప్రాజెక్టులు పూర్తిచేయడం రాష్ట్ర చరిత్రలోనే కాదు, జాతీయస్థాయిలో ఒక మైలురాయి వంటిదని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. సోమవారం తన నివాసం నుంచి నీరు-ప్రగతి, వ్యవసాయం వారంవారం పురోగతిపై నిర్వహించే టెలికాన్ఫరెన్స్ లో మాట్లాడారు.

గోదావరిలో ఇన్ ఫ్లో తగ్గిందని, అదే సమయంలో కృష్ణా, తుంగభద్రలో ఇన్ ఫ్లో పెరగడం సంతోషంగా ఉందని ముఖ్యమంత్రి అన్నారు. శ్రీశైలం రిజర్వాయర్ లో నీటినిల్వ 3రోజుల్లో 10 టిఎంసిలు పెరిగిందని, నీటిమట్టం 13 అడుగులు పెరిగిందని రాష్ట్ర రైతాంగానికి ఇది శుభసూచకంగా పేర్కొన్నారు.

‘‘ఈవారం వర్షాలు బాగా పడ్డాయి, రాబోయే వారం కూడా మంచి వర్షాలు పడే అవకాశం ఉంది. వర్షం పడింది కాబట్టి వదిలేస్తే సమస్యలు పెరుగుతాయి,అన్ని చెరువులు నింపాలి,ఎక్కడికక్కడ భూగర్భజలం పెంపొందేలా చూడాలి. 11 వేల చెక్ డ్యాముల నిర్మాణం వెంటనే పూర్తిచేయాలి’’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు దిశానిర్దేశం చేశారు.

పోలవరం ప్రాజెక్టు పనుల్లో 2.35 లక్షల క్యూ.మీ. మట్టి ఇప్పటివరకు తొలగించామన్నారు. ఈ వారం 15వేల క్యూ.మీ.కాంక్రీట్ పని జరిగిందంటూ చేయాల్సినదానితో పోల్చుకుంటే ఇది చాలా స్వల్పంగా పేర్కొన్నారు. సిమెంట్ కాంక్రీట్ పనులను యుద్దప్రాతిపదికన వేగవంతం చేయాలన్నారు.2018 కల్లా ప్రాజెక్టును పూర్తిచేసి గ్రావిటి ప్రాతిపదికన నీళ్లివ్వాలన్నదే ప్రభుత్వ సంకల్పంగా గుర్తుచేశారు.

‘‘వర్షాలు పడటంతో వ్యవసాయ పనులు ఊపందుకున్నాయి. రైతులకు కావాల్సిన ఇన్ పుట్స్ అన్నింటినీ సకాలంలో అందించాలి. ఈ ఏడాది వ్యవసాయం, అనుబంధ రంగాలలో వృద్ది మరింత పెరగాలి’’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. ఈ ఏడాది మొదటి త్రైమాసికంలో 27% వృద్ది వ్యవసాయం, అనుబంధ రంగాలలో సాధించాము కాబట్టే మన రాష్ట్ర వృద్దిరేటు 11.72% వచ్చిందని అన్నారు. ఉద్యాన రంగంలో వృద్ది 30%కు చేరాలని ఆకాంక్షించారు. కాలుష్య బెడదలేని ఉద్యానరంగాన్ని మరింతగా ప్రోత్సహించాలన్నారు. డెయిరీ, ఫిషరీస్ లో వృద్దిని ఈవిధంగానే కొనసాగించాలని సూచించారు. మిర్చి, ఉల్లి రైతులకు మార్కెట్ ఇంటర్వెన్షన్ ద్వారా గిట్టుబాటు ధరలు వచ్చేలా చూసిన విషయం ప్రస్తావించారు. విత్తనాలు,ఎరువులు,పంటరుణాల పంపిణీలో ఏయే జిల్లాలు ఏ స్థాయిలో ఉందో అడిగి తెలుసుకున్నారు. చిత్తూరు,కృష్ణా జిల్లాలలో పురోగతి బాగా ఉందంటూ వాటి స్థాయికి మిగిలిన జిల్లాలు కూడా చేరుకోవాలన్నారు.

వారంవారం గ్రేడింగ్ ద్వారా జిల్లాలలో ఆయా శాఖల్లో పురోగతిని బేరీజు వేస్తున్న విషయం ప్రస్తావించారు. ఒక పోటీతత్వంతో పనిచేయాలని,స్ఫూర్తిదాయకంగా నిలవాలని అధికారులతో అన్నారు. ఒక బృంద స్ఫూర్తితో వ్యవహరించాలని, వివిధ శాఖల మధ్య సమన్వయం సాధించాలని,నరేగా అనుసంథానం ద్వారా నిధుల సమస్యలు అధిగమించాలని సూచించారు.

నరేగా లక్ష్యం 100% చేరుకున్నందుకు అభినందనలు తెలిపారు. ఏడాదిలో చేయాల్సిన పనులు 5నెలల్లోనే చేసినందుకు అభినందించారు. నరేగాలో తూర్పు గోదావరి, పశ్చిమగోదావరి జిల్లాలు ఈవారంలో ఏ గ్రేడ్ సాధించాయంటూ, మిగిలిన జిల్లాలు కూడా ఇదే స్ఫూర్తితో పనిచేసి గ్రేడింగ్ పెంచుకోవాలన్నారు. పంట కుంటలు,అవెన్యూ ప్లాంటేషన్,అంగన్ వాడి భవనాల నిర్మాణం, ఘనవ్యర్ధాల నిర్వహణ పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు.

సెప్టెంబర్ 15నుంచి 30వరకు రాష్ట్రవ్యాప్తంగా స్వచ్ఛాంధ్రప్రదేశ్ కార్యక్రమాలు ఉత్సాహంగా నిర్వహించాలన్నారు. స్వచ్ఛాంధ్రలో 11కేటగిరీలు, 40 సబ్ కేటగిరీలలో బాగా పనిచేసినవారికి అక్టోబర్ 2న అవార్డులు ఇచ్చి గౌరవించాలన్నారు. విద్యార్ధులకు పోటీలు నిర్వహించాలని,ఫొటో ప్రదర్శనలు జరపాలని, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. చల్లపల్లిలో జరుగుతున్న స్వచ్ఛాంధ్ర కార్యక్రమాలను ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రశంసించారు. అదే స్ఫూర్తితో మిగిలిన గ్రామాలు, పట్టణాలలో కూడా స్వచ్ఛాంధ్రప్రదేశ్ కార్యక్రమాలు ఉత్సాహంగా,స్ఫూర్తిదాయకంగా జరపాలన్నారు. ‘‘స్వచ్ఛభారత్ లో మనరాష్ట్రం ముందుండాలి,జాతీయ స్థాయిలో మన గౌరవం ఇనుమడించాలి’’అని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు.

ఈ టెలికాన్ఫరెన్స్ లో వ్యవసాయ శాఖ,జలవనరుల శాఖ,గ్రామీణాభివృద్ది శాఖ, స్వచ్ఛాంధ్ర కార్పోరేషన్, రియల్ టైమ్ గవర్నెన్స్ అధికారులు రాజశేఖర్, హరి జవహర్ లాల్, శశిభూషణ్, రామాంజనేయులు, జవహర్ రెడ్డి, మురళీధర్ రెడ్డి, డా.సిఎల్ వెంకట్రావు,అహ్మద్ బాబు,రమణమూర్తి, జిల్లాల కలెక్టర్లు, ఇతర అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read