ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు ముందస్తుగానే జరుగుతాయనే సంకేతాలు మధ్య, పొత్తుల విషయం పై, రాష్ట్రంలో పెద్ద చర్చ జరుగుతుంది. రెండు నెలల క్రితం పవన్ కళ్యాణ్, వైసీపీ వ్యతిరేక ఓట్లు చీల్చం అన్న దగ్గర నుంచి, ఈ చర్చ రోజు రోజుకీ ఎక్కువ అవుతుంది. ఈ రోజు పవన్ కళ్యాణ్, అలాగే సోము వీర్రాజు, మొన్న చంద్రబాబు చెప్పిన పొత్తుల విషయం పై మాట్లాడారు. అయితే ఇద్దరూ విభాన్నంగా స్పందించారు. సోము వీర్రాజు త్యాగాలు గురించి చంద్రబాబు మాట్లాడుతున్నారు అంటూ, పరోక్షంగా చెప్తూ, మీ త్యాగాలు ఎలాంటివో తమకు తెలుసు అంటూ, మేము త్యాగాలకు సిద్ధంగా లేదని, మేము అధికారంలోకి వస్తున్నాం అని సోము వీర్రాజు చెప్పారు. అయితే దానికి పూర్తి విభిన్నంగా, పొత్తులో ఉన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ రోజు కర్నూల్ లో మాట్లాడారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ, 2024 ఎన్నికల్లో వైసీపీ వ్యతిరేక ఓటు చీలకూడదు అంటూ ఆయన వ్యాఖ్యానించారు. వైసీపీ వ్యతిరేక ఓటు చీలితే, రాష్ట్రం మళ్ళీ అతి గతీ లేకుండా పోతుందని, ఆయన వ్యాఖ్యానించారు. బీజేపీతో ఇప్పటి వరకు తమకు పొత్తు ఉందని పవన్ కళ్యాణ్ అన్నారు. అయితే రాష్ట్ర భవిష్యత్తు, ప్రజలు భవిష్యత్తు కోసం, పొత్తుల పైన విస్తృత చర్చ జరగాల్సిన అవసరం ఉందని అన్నారు.
పొత్తుల పై ప్రజలు అభిప్రాయం తీసుకోవాలని, ప్రజల అభిప్రాయానికి తగ్గట్టు పొత్తులు ఉండాలని, ఈ పొత్తులు ఎవరితో ఉండాలి, ఎలా ఉండాలి అనేది ఇంకా ఎన్నికలకు రెండేళ్ళు ఉంది కాబట్టి, అప్పుడు ఆలోచిద్దాం అని అన్నారు. అలాగే నిన్న చంద్రబాబు వ్యాఖ్యల పై మీడియా స్పందించమని కోరగా, చంద్రబాబు నేరుగా పొత్తులు గురించి మాట్లాడితే, అప్పుడు దాని గురించి మాట్లాడతానని, అయితే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదనేది తమ అభిప్రాయం అని అన్నారు. అయితే చంద్రబాబుతో పొత్తు లేకుండా ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా ఉండటం కుదరదు కదా అని అడిగితే, త్వరలోనే ఒక అద్భుతం జరగబోతుందని, అది మీరే చూస్తారని, పవన్ కళ్యాణ్ అన్నారు. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలతో మాత్రం, పవన్, టిడిపితో పొత్తుకు రెడీగా ఉన్నాం అనే సంకేతాలు ఇచ్చినట్టు, ఆయన మాటలు వింటే అర్ధం అవుతుంది. ఒక వైపు ఏపి బీజేపీ సోము వీర్రాజు పొత్తు లేదు ఏమి లేదు, మేమే అధికారంలోకి వస్తున్నాం అని అంటుంటే, పవన్ కళ్యాణ్ మాత్రం, చాలా స్పష్టంగా ఉన్నారు.