కృష్ణా జిల్లా మాజీ కలెక్టర్ అహ్మద్ బాబు, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఫైబర్‌నెట్ లిమిటెడ్ ఎండీగా ఉన్న విషయం తెలిసిందే... అయితే, ఎప్పటి లాగే అహ్మద్ బాబు, ఈ డిపార్టుమెంటులో కూడా తన ప్రతిభ చూపిస్తూ, రాష్ట్రానికి సేవ చేస్తున్నారు.
తాజాగా, అత్యంత వేగవంతమైన ఇంటర్నెట్ సేవలు అందించటానికి, మెరైన్ కేబుల్ నెట్ వ్యవస్థ ప్రపోజల్ ముఖ్యమంత్రి ముందు ఉంచారు. దీనికి 20 వేల కోట్ల ఖర్చు అవుతుంది అని, కేంద్ర ప్రభుత్వంతో పాటు, టెలికం కంపెనీలు కన్షార్షియంగా ఏర్పడి పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొస్తాయని అహ్మద్ బాబు సీఎంకి వివరించారు.
దీంతో వెంటనే చంద్రబాబు ఆదివారం సాయంత్రం కేంద్ర ఐటీ శాఖ కార్యదర్శి అజయ్ సహానితో ఫోన్ లో మాట్లాడారు. మెరైన్ కేబుల్ నెట్ ప్రతిపాదనను వివరించగా, అజయ్ సహానీ సూత్రప్రాయంగా అంగీకరించారు. తక్షణమే ప్రతిపాదనలు పంపితే పరిశీలించి, ఆమోదిస్తామని సీఎంకి హామీ ఇచ్చారు. దీంతో మెరైన్ కేబుల్ నెట్‌కు సంబంధించిన ప్రతిపాదనలు సిద్ధం చేసి కేంద్రానికి పంపాలని సీఎం ఐటీ శాఖను ఆదేశించారు.
సముద్రంలో వేసే, మెరైన్ కేబుల్ ద్వారా ఇంటర్నట్ వేగంగా వస్తుంది. ప్రస్తుతం భూమిలో ఫైబర్ కేబుళ్లను వేసి ఇంటర్నెట్ సేవలు అందిస్తున్నారు. దీని ద్వారా పరిమిత వేగంతో మాత్రమే ఇంటర్నెట్ సేవలు అందించే వీలుంది. విశాఖపట్నాన్ని కేంద్రంగా చేసుకుని మెరైన్ కేబుల్ నెట్ ద్వారా రాష్ట్రమంతటికీ అత్యంత వేగవంతమైన ఇంటర్నెట్ సేవలు అందుతాయి. అదే సమయంలో విశాఖపట్నం, అమరావతిలో ఏర్పాటయ్యే ఐటీ సంస్థలకు మెరైన్ కేబుల్ నెట్ ఎంతో ప్రయోజనం చేకూర్చనుంది. ప్రస్తుతం దక్షిణాదిన మెరైన్ కేబుల్ నెట్ చెన్నై నగరానికే పరిమితమైంది. ముంబై, కోల్‌కతాలోనూ మెరైన్ కేబుల్ నెట్ ఉంది.