‘నిర్మాణాత్మక సలహాలు ఎవరు అందించినా వాటిని స్వీకరించాలి. వాటిపై అర్థవంతమైన చర్చ జరగాలి. మేధోమధనం చేసి సరైన నిర్ణయాలు తీసుకోవాలి’-అని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నిర్దేశించారు. అనేక తరాలు గర్వంగా చెప్పుకునే గొప్ప ప్రజారాజధానిని నిర్మిస్తున్నామన్న భావన ఈ ప్రాజెక్టులో పాలు పంచుకునే ప్రతి ఒక్కరిలో ఉండాలని, దానికి తగ్గట్టుగానే నిర్ధిష్ట కార్యప్రణాళికతో పనిచేయాలని ఆయన అన్నారు. రోజురోజుకీ పెరుగుతున్న ప్రజల అంచనాలకు అనుగుణంగా ఒక్క నిమిషం కూడా వృధాచేయకుండా పనులు జరగాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు.

రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్‌డీఏ) సమావేశం బుధవారం సాయంత్రం వెలగపూడిలో ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగింది. రాజధాని ప్రాంతంలో అత్యంత కీలకమైన ల్యాండ్ పూలింగ్ స్కీమ్ (ఎల్‌పీఎస్) ప్రాంత మౌలిక వసతుల ఏర్పాటుపై సమావేశంలో చర్చించారు. హైబ్రీడ్ యాన్యుటీ మోడల్‌లో పనులు చేపట్టేందుకు గల సానుకూలతలు, ప్రతికూలాంశాలపై సమావేశంలో ప్రస్తావించి తుది నిర్ణయం తీసుకున్నారు..

ఈ నిర్ణయం ప్రకారం రాజధానిలోని మొత్తం 13 జోన్లలలో 5 జోన్లను హైబ్రీడ్ యాన్యుటీ మోడల్‌లో అభివృద్ధి చేస్తారు. రూ.10 వేల కోట్ల అంచనా వ్యయంతో ఈ అభివృద్ధి పనులను చేపడతారు.

ఇంతవరకు దేశంలో ఎన్‌హెచ్ఏఐ మాత్రమే ఈ హైబ్రీడ్ యాన్యుటీ మోడల్‌ను అనుసరించి జాతీయ రహదారులను నిర్మిస్తోంది. ఇప్పుడు తొలిసారిగా ఒక నగరాన్ని అభివృద్ధి చేసేందుకు చేపట్టిన ప్రాజెక్టు కోసం హైబ్రీడ్ యాన్యుటీ మోడల్‌కు వెళుతున్నారు.

ఇందులో భాగంగా మొత్తం 5 జోన్లలో రహదారులు, మురుగునీటి పారుదల వ్యవస్థ, విద్యుత్, నీటి సదుపాయాల కల్పన వంటి వివిధ రకాల పనులను చేపడతారు. రూ.2383 కోట్ల అంచనా వ్యయంతో 5,174 ఎకరాల మేర జోన్ 5లో అభివృద్ధి పనులను చేపడతారు. రూ.817 కోట్లతో 1360 ఎకరాల మేర జోన్ 4ను అభివృద్ధి చేస్తారు. రూ.3,714 కోట్ల వ్యయంతో 6902 ఎకరాల మేర జోన్ 9ని అభివృద్ధి చేయనున్నారు. రూ.2102 కోట్ల వ్యయంతో 7838 ఎకరాల మేర జోన్ 12 అభివృద్ధి పనులు చేపడతారు. రూ.1498 కోట్ల వ్యయంతో 3860 ఎకరాల మేర 12ఏ జోన్‌ పరిధిలో పనులు ఆరంభిస్తారు. ప్రతి జోన్‌లోనూ రహదారులు, వారధులు, విద్యుత్, నీరు, మురుగునీటి పారుదల వ్యవస్థ, ఐసీటీ వంటి మౌలిక వసతుల ఏర్పాటుచేస్తారు.

నిర్మాణమైన రాష్ట్ర శాసనసభ, హైకోర్టు భవంతుల తుది ఆకృతులు, నిర్మాణ ప్రణాళికలపై ఫోస్టర్ అండ్ పార్టనర్స్‌తో చర్చించడానికి ఏపీ సీఆర్‌డీఏ బృందం ఈనెల 11 నుంచి 13 వరకు లండన్‌లో పర్యటించనున్నది. సచివాలయం, శాఖాధిపతుల కార్యాలయ భవంతుల భావనాత్మక ప్రణాళికలను ఈనెల 12న ఫోస్టర్ అండ్ పార్టనర్స్ ఏపీ సీఆర్‌డీఏ బృందానికి సమర్పిస్తారు. అమరావతిలో చేపట్టనున్న వీఐపీ గృహనిర్మాణ ప్రాజెక్టుకు సంబంధించి ఈనెల 9న ప్రొక్యూర్‌మెంట్ ప్రక్రియ ప్రారంభం కానున్నట్టు సీఆర్‌డీఏ కమిషనర్ డాక్టర్ చెరుకూరి శ్రీధర్ ముఖ్యమంత్రికి తెలిపారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read