అమరావతిలో మరో 3 యూనివర్సిటీలు, తమ క్యాంపస్ నెలకొల్పటానికి త్వరలోనే నిర్మాణ కార్యకలాపాలను ప్రారంభించనున్నాయి. అమృత యూనివర్సిటీ, ఇండో- యూకే హెల్త్ ఇన్స్టిట్యూట్, బి.ఆర్.షెట్టి గ్రూపు అమరావతిలో తమకు కేటాయించిన స్థలాల్లో నిర్మాణ పనులను మొదలుపెట్టనున్నాయి.
అమృత యూనివర్సిటీకు 200 ఎకరాలు, ఇండో- యూకే హెల్త్ ఇన్స్టిట్యూట్కు 150 ఎకరాలు, బి.ఆర్.షెట్టి గ్రూపునకు 100 ఎకరాల చొప్పున రాష్ట్ర ప్రభుత్వం ఇదివరకే కేటాయించింది. అమృత యూనివర్సిటీ , వచ్చే విద్యా సంవత్సరం నుంచి తన అమరావతి క్యాంపస్‌ను ప్రారంభించాలని నిర్ణయించింది.
ఇప్పటికే విట్, ఎస్.ఆర్.ఎం. తొలి విడతగా తమకు కేటాయించిన 100 ఎకరాల్లో భవనాలను నిర్మిస్తూ, వరుసగా ఈ నెల, వచ్చే నెలలో తరగతులను ప్రారంభించబోతున్న సంగతి తెలిసిందే. 25 ఎకరాలను పొందిన కేంద్ర విద్యా సంస్థ అయిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ (ఎన్.ఐ.డి.) సైతం తన క్యాంపస్‌ను చురుగ్గా నిర్మిస్తోంది.