రాష్ట్ర శాసన పరిషత్ (శాసనసభ, శాసనమండలి) సముదాయ నిర్మాణానికి వజ్రాకృతిలో ఉన్న డిజైన్‌ను ఎంపికచేస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తుది నిర్ణయం తీసుకున్నారు. నవ్యాంధ్ర రాజధానిలో నిర్మించనున్న హైకోర్టు భవనానికి స్థూపాకృతిని ఎంపికచేశారు. దీనిని వెంటనే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి చూపించి రెండురోజులలో మొత్తం తుది ఆకృతులను సిద్ధం చేయాలని చెప్పారు.
అమరావతిలోని పరిపాలన నగరానికి తుది ఆకృతులను సిద్ధం చేస్తున్న ఫోస్టర్ అండ్ పార్టనర్స్ బుధవారం ఉదయం విజయవాడ క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు శాసనపరిషత్ హైకోర్టు భవనాలకు సంబంధించిన సవివర ఆకృతులను ప్రదర్శించారు. తొలుత హైకోర్టు కోసం నార్మన్ ఫోస్టర్స్ సిద్ధం చేసిన వజ్రాకార భవన ఆకృతిని నిశితంగా పరిశీలించిన ముఖ్యమంత్రి దీనిని శాసనపరిషత్ సముదాయం కోసం సిద్ధం చేయాలని సూచించారు. శాసనసభ కోసం రూపొందించిన బుద్ధ స్థూపం ఆకృతిని హైకోర్టు కోసం వినియోగించుకుందామని చెప్పారు.
‘ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎంతో విలువైన వజ్రాన్ని పోగొట్టుకున్నారు. ఇప్పుడు దాన్ని తమ అసెంబ్లీ భవన రూపంలో చూసుకుని సంతోషపడతారు’ అని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. ‘స్థూపం సంతోషానికి చిహ్నం. న్యాయం జరిగినప్పుడే ఎవరికైనా సంతోషం కలుగుతుంది. కోర్టు గుమ్మం తొక్కిన ప్రతి వ్యక్తి స్థూపాకారంలో వున్న ఈ భవనాన్ని చూసి తనకు ఇక్కడ నిజమైన న్యాయం దక్కుతుందని భావించాలి’ అని అన్నారు. ఆ భావనతో ఆలోచిస్తే ఈ ఆకృతి హైకోర్టుకు సరిగ్గా అమరుతుందని దాన్ని ఎంపిక చేస్తున్నట్టు చెప్పారు. అమరావతిలోని నవ నగరాల్లో భాగంగా నిర్మిస్తున్న న్యాయనగరం రానున్న కాలంలో హాంకాంగ్, లండన్ నగరాల్లా భాసిల్లాలన్నదే తన అభిలాష అని తెలిపారు. దీనికోసం నల్సర్ విశ్వవిద్యాలయం వంటి ప్రఖ్యాత సంస్థలు, ప్రపంచ ప్రసిద్ధి పొందిన లా ఏజెన్సీలను ఆహ్వానిస్తామని చెప్పారు. ప్రపంచంలో అత్యుత్తమ న్యాయవిద్య, న్యాయ సలహా అమరావతిలో తప్పక దొరుకుతుందనే భావన కలగాలన్నారు.
పరిపాలన నగరానికి కొనభాగాన, కృష్ణానదికి అభిముఖంగా నిర్మించనున్న ‘సిటీ స్క్వేర్’ అమరావతి నగరానికి ప్రధాన ఆకర్షణగా ఉండాలని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. ఆ మేరకు సిటీ స్క్వేర్ ఆకృతులను రూపొందించాలని ఫోస్టర్స్ బృందానికి చెప్పారు. ముఖ్యమంత్రి, గవర్నర్ అధికారిక నివాసాలను సిటీ స్క్వేర్‌లో భాగంగా చెరోవైపు ఉండేలా ఫోస్టర్స్ బృందం డిజైన్ చేయగా, వాటిని అక్కడి నుంచి మార్చాలని ముఖ్యమంత్రి సూచించారు. సిటీ స్క్వేర్ ఆర్థిక కార్యకలాపాలకు ఆలంబనగా అతి పెద్ద వాణిజ్య కేంద్రంగా నిలవాలన్నదే తన ఉద్దేశమని స్పష్టంచేశారు. ఇందులోనే రెస్టరెంట్స్, హోటల్స్, కెఫెటేరియా, షాపింగ్ మాల్స్, మూవీ ధియెటర్స్, స్పోర్ట్స్, రిక్రియేషన్ సెంటర్స్, కన్వెన్షన్ సెంటర్స్ కొలువుదీరాలని చెప్పారు. సిటీ స్క్వేర్‌కు వెళితే అక్కడ సమస్తం ఉంటాయన్న భావన రాజధాని ప్రజలకు కలగాలన్నారు.
దీన్ని ఎంత విశాలంగా ఏర్పాటుచేస్తే అంత మంచిదని అంటూ, సీయం, గవర్నర్ నివాసాలను అక్కడ తీసివేసి నదీతీరానికి మార్చాలని సూచించారు. రాజధానిలో నిర్మించే ప్రతి కట్టడం అత్యుత్తమంగా ఉండాలని, ఆ విషయంలో ఎక్కడా రాజీపడబోమని చెప్పారు. ప్రజలలో ఇప్పటికే రాజధానిపై అంచనాలు పెరిగిపోయాయని, ఏదో ఒక రాజధాని నిర్మించాలని అనుకుంటే ఇంతగా పరితపించనవసరం లేదని, ప్రపంచంలోని 5 అత్యుత్తమ నగరాలలో అమరావతిని ఒకటిగా నిలపాలన్నదే తమ అంతిమ లక్ష్యమని అన్నారు. సమావేశంలో పురపాలక మంత్రి నారాయణ ఇటీవల తాము నయారాయపూర్, గాంధీనగర్, చండీగఢ్ నగరాలలో పర్యటించి తెలుసుకున్న విశేషాలను ముఖ్యమంత్రికి వివరించారు.
తొలుత ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు ఫోస్టర్స్ బృందంతో చర్చించారు. రానున్న కాలంలో జరగబోయే శాసనసభ నియోజకవర్గాల పెంపును దృష్టిలో ఉంచుకుని అసెంబ్లీ భవంతి నిర్మాణం జరగాల్సివున్నదని చెప్పారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేష్ కుమార్, సీయంవో ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సతీశ్ చంద్ర, ముఖ్య కార్యదర్శి సాయిప్రసాద్, అదనపు కార్యదర్శి రాజమౌళి, సీఆర్డీఏ ముఖ్యకార్యదర్శి అజయ్ జైన్, సీఆర్డీఏ కమిషనర్ చెరుకూరి శ్రీధర్, ఏడీసీ సీఎండీ లక్ష్మీ పార్ధసారధి పాల్గొన్నారు.