ఉత్తరాంధ్రలో పర్యటిస్తోన్న జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేస్తోన్న వ్యాఖ్యలపై టీడీపీ ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ మూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన విశాఖపట్నంలో మీడియాతో మాట్లాడుతూ.. పవన్ ఉత్తరాంధ్రలో భావోద్వేగాలను రెచ్చగొడుతున్నారని అన్నారు. ప్రాంతీయ వాదాన్ని రెచ్చగొడుతూ అశాంతిని సృష్టించకూడదని, ఆ ప్రాంతంలో ఏపీ సర్కారు చేసిన అభివృద్ధి కనబడట్లేదా? అని ప్రశ్నించారు. పవన్ కల్యాణ్ నటుడిగా కాకుండా ఓ రాజకీయ నాయకుడిలా ఆలోచించి మాట్లాడాలని బండారు సత్యనారాయణ సూచించారు. ఆయన కేంద్ర సర్కారుని ఎందుకు నిలదీయట్లేదని ప్రశ్నించారు. అభివృద్ధిపరంగా తగిన సలహాలు, సూచనలు ఇస్తే అమలుచేసే తత్వం తెదేపా ప్రభుత్వానికి ఉందన్నారు. ఓడరేవు ప్రాంతంలో కాలుష్య సమస్యకు రాష్ట్రప్రభుత్వమే బాధ్యత వహించాలనడం ఎంతవరకూ సబబని ప్రశ్నించారు.
పవన్ రాజకీయాల్లోకి కొత్తగా రాలేదని.. ఆయన అన్న పార్టీలో పని చేసిన వైనాన్ని గుర్తు చేశారు. ప్రజారాజ్యం పార్టీని మీరు కాంగ్రెస్ పార్టీకి ఎంతకు అమ్మేశారో అందరికీ తెలుసంటూ సంచలన ఆరోపణలు చేసారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాల్ని చూసిన తర్వాత కూడా బీజేపీని కానీ ప్రధాని మోడీని కానీ పల్లెత్తు మాట ఎందుకు అనటం లేదన్న ఆయన.. పవన్ తీరు చూస్తుంటే బీజేపీ స్క్రిప్ట్ ను ఫాలో అవుతున్నట్లుగా ఉందని ఎద్దేవా చేయటం గమనార్హం. విశాఖలో మూడు నెలలుగా ఉంటున్న పవన్.. విశాఖ రైల్వే జోన్ గురించి ఎందుకు పోరాటం చేయటం లేదని ప్రశ్నించారు. భూ కుంభకోణంపై ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా సిట్‌ను ఏర్పాటు చేశారని, ఆ నివేదిక ప్రభుత్వ స్థాయిలో పరిశీలనలో ఉందని ఎమ్మెల్యే బండారు తెలిపారు. త్వరలోనే సిట్ నివేదిక వెలుగుచూస్తుందని, అక్రమార్కులకు శిక్ష తప్పదని స్పష్టం చేశారు.
తెదేపా ఏర్పాటుతోనే ఉత్తరాంధ్ర రాజకీయంగా బలోపేతమైందని, ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు చేపట్టిన తర్వాత సాగునీరు, ఐటీ రంగాల్లో గణనీయ పురోగతి సాధించిందన్నారు. భోగాపురం విమానాశ్రయం, భావనపాడు ఓడరేవు, ఉత్తరాంధ్ర జిల్లాల్లో పలు నీటి పారుదల ప్రాజెక్టులు వచ్చాయన్నారు. విశాఖ నగరం జాతీయ స్థాయి అత్యుత్తమ నగరాల్లో 7వ స్థానంలో నిలిచిందన్నారు. ఇదంతా తెదేపా పాలనలో సాగించిన అభివృద్ధి ఫలితమేనని, ఇవేవీ పవన్ కల్యాణ్‌కు కనబడడం లేదా? అని నిలదీశారు. కేంద్రంతో ముడిపడి ఉన్న ప్రాజెక్టులు సైతం రాకపోవడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు కారణమని ఏరకంగా పవన్ విమర్శిస్తారని ఆయన ప్రశ్నించారు.