చంద్రబాబు ఏమి చేసిన అది టాక్ అఫ్ ది కంట్రీ అవుతుంది. 10 సంవత్సరాలు ముందు ఆలోచించే చంద్రబాబు, ఇప్పుడు తాజాగా జీరో బడ్జెట్ ఫార్మింగ్ విధానం పై రాష్ట్రంలో కసరత్తు ప్రారంభించారు. ఇప్పటికే ఇది న్యూయార్క్ టైమ్స్ లో కూడా వచ్చింది. ఇప్పుడు దేశంలో వివిధ రాష్ట్రాలు కూడా, ఈ విషయం పై, మన వైపు చూస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో అమలుచేస్తున్న పెట్టుబడిలేని ప్రకృతి వ్యవసాయం/జీరో బడ్జెట్ ఫార్మింగ్ విధానం పై కర్ణాటక ప్రభుత్వం ఆసక్తి కనబరుస్తోంది. ఈ విధానాన్ని అందిపుచ్చుకుని స్థానికంగా రసాయనరహిత ఉత్పత్తులు తీసే దిశగా చర్యలు ప్రారంభించింది. ఈ విషయమై గత వారం బెంగళూరులో నిర్వహించిన సమావేశానికి ఏపీ వ్యవసాయ సలహాదారు, జడ్బీఎన్‌ఎఫ్ అమల్లో కీలకపాత్ర పోషిస్తున్న విజయకుమార్‌ను ఆహ్వానించారు. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కుమారస్వామితోపాటు కేబినెట్ మంత్రులు, వ్యవసాయశాఖ అధికారులు, శాస్త్రవేత్తలు హాజరయ్యారు.
ఆంధ్రప్రదేశ్‌లో జడ్బీఎన్‌ఎఫ్ అమలును ఈ సందర్భంగా విజయకుమార్ వారికి వివరించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్దేశించిన లక్ష్యాలను ఆయన తెలియజేశారు. రైతులు కూడా ఉత్సాహంతో ముందుకు వస్తున్నారన్నారు. సీఎం కుమారస్వామి ఆహ్వానం మేరకే కర్ణాటకకు వెళ్లి వచ్చినట్లు విజయకుమార్ చెప్పారు. సుమారు రెండు గంటల పాటు సమావేశంలో ఉన్న కుమారస్వామి ఈ విధానంపై ఎంతో ఆసక్తి కనబరచారన్నారు. ఏపీకి వచ్చి సాగు విధానాలు పరిశీలించడంతో పాటు రైతులతో మాట్లాడాలని ఆహ్వానించగా అందుకు సుముఖత వ్యక్తం చేశారన్నారు. త్వరలోనే తాను ఆంధ్రప్రదేశ్ వచ్చి ముఖ్యమంత్రి చంద్రబాబును కలుస్తానని చెప్పారన్నారు.
పెట్టుబడిలేని ప్రకృతి వ్యవసాయ విధానాన్ని దేశవ్యాప్తంగా పరిచయం చేయాలని నీతిఅయోగ్ యోచిస్తోంది. దీనిపై జులై 9న దిల్లీలో అన్నిరాష్ట్రాల వ్యవసాయశాఖ కార్యదర్శులతో సమావేశం నిర్వహిస్తోంది. దీనికి సుభాష్ పాలేకర్‌తోపాటు మధ్యప్రదేశ్ గవర్నర్ ఆనందిబెన్, ఏపీ వ్యవసాయ సలహాదారు విజయకుమార్ హజరవుతున్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి అయిదుగురు రైతులకూ ఆహ్వానం అందింది. ప్రకృతి సాగులో వారు తమ అనుభవాలను నీతి అయోగ్ వేదికపై వివరించనున్నారు.