అమరావతికి బ్రాండ్ ఇమేజ్ కోసం, పెట్టుబడులు కోసం, ప్రపంచంలో బెస్ట్ సిటీస్ లో ఒకటిగా చెయ్యటం కోసం, చంద్రబాబు ఏ అవకాశాన్ని వదులుకోవటం లేదు. ముఖ్యమంత్రి చంద్రబాబు జులై 8, 9 తేదీల్లో సింగపూర్‌లో పర్యటించనున్నారు. అక్కడ జరిగే ప్రపంచ నగరాల సదస్సు (డబ్ల్యూసీఎస్)లో ఆయన పాల్గొంటారు. ముఖ్యమంత్రి వెంట మంత్రులు, సీఆర్‌డీఏ, ఏడీసీ, ఈడీబీకి చెందిన అధికారుల బృందం వెళ్లనుంది. సదస్సులో రాజధాని అమరావతి గురించి ప్రసంగించనున్నారు. అమరావతికి సంబంధించి సీఆర్‌డీఏ ప్రత్యేక పెవిలియన్‌ను ఏర్పాటు చేస్తోంది. డబ్ల్యూసీఎస్ సింగపూర్‌లో ప్రతి రెండేళ్లకు ఒకసారి జరిగే ప్రపంచస్థాయి సదస్సు. ఈసారి జులై 8-12 వరకు జరగనుంది. సింగపూర్ మంత్రి ఈశ్వరన్ ఇటీవల రాష్ట్రానికి వచ్చినప్పుడు...సదస్సులో పాల్గొనాలని చంద్రబాబుని ఆహ్వానించారు.
ఈ నెల 8న ఉదయం డబ్ల్యూసీఎస్‌లో జరిగే ప్రపంచ మేయర్ల ఫోరంలో చంద్రబాబు ప్రత్యేక ప్రసంగం చేస్తారు. ఆధునిక నగరాలలో సమీకృతాభివృద్ధి, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాల్ని అందిపుచ్చుకోవడం వంటి అంశాల్లో రాష్ట్ర, స్థానిక ప్రభుత్వాల మధ్య ఉండాల్సిన సమన్వయం, మౌలిక వసతుల అభివృద్ధికి అవసరమైన ఆర్థిక వనరుల్ని సమకూర్చుకోవడంలో అనుసరించాల్సిన వ్యూహాలు వంటి అంశాల్ని ప్రసంగంలో ప్రస్తావిస్తారు. అదే రోజు సాయంత్రం వివిధ దేశాల మేయర్లు, ప్రతినిధులతో జరిగే విందులో పాల్గొంటారు. ఆ మధ్యలో వివిధ కంపెనీలు, సంస్థల ప్రతినిధులతో ద్వైపాక్షిక సమావేశాల్లో పాల్గొంటారు.
జులై 9న ఉదయం జరిగే ‘జాయింట్ ఓపెనింగ్ ప్లీనరీ సదస్సు’లో సీఎం ప్రసంగిస్తారు. ముఖ్యమంత్రి వెంట ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు, పురపాలక మంత్రి పి.నారాయణ, సీఆర్‌డీఏ ముఖ్య కార్యదర్శి అజయ్‌జైన్, కమిషనర్ చెరుకూరి శ్రీధర్ తదితరులు సింగపూర్ వెళుతున్నారు. ప్రపంచ నగరాల సదస్సులో సీఆర్‌డీఏ ఏర్పాటు చేసే పెవిలియన్ ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. రాజధానిలో పెట్టుబడులకు అవకాశమున్న వివిధ ప్రాజెక్టులు, అమరావతిని ఆకర్షణీయ నగరంగా తీర్చిదిద్దే క్రమంలో ఏర్పాటు చేసే వసతుల కల్పనలో ఆయా సంస్థల భాగస్వామ్యానికి ఉన్న అవకాశాల్ని ఇందులో ప్రదర్శిస్తారు.