అధికార పార్టీ అప్పుడే సార్వత్రిక ఎన్నికల సమరాంగణంలోకి దూకేందుకు రంగం సిద్దం చేసుకుంటోంది. ప్రతిపక్ష పార్టీలకు ఇప్పటి నుంచే చెక్ పెట్టే పనిలో నిమగ్నమయ్యారు. నవ్యాంధ్రలోని 13 జిల్లాల్లో అధికార పార్టీ ప్రజాప్రతినిధుల పనితీరు పై స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టి సారించారు. జిల్లాల వారీగా ఆయన చేయించిన సర్వేలను వారి ముందే బయటపెడుతూ వారికి ముచ్చెమటలు పోయిస్తున్నారు. నియోజకవర్గాల వారీగా జిల్లాల సమీక్షలను గ నిర్వహిస్తూ లోటు పాట్లను వారి సమక్షంలోనే సుదీర్ఘంగా చర్చిస్తున్నారు. ప్రజలకు అందుబాటులో లేని నేతలను సైతం చంద్రబాబు స్వయంగా నిలదీస్తున్నారు. మరో పక్క ఈ రోజు, తెలుగుదేశం అధిష్టానం అనూహ్య నిర్ణయం తీసుకుంది.
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, ఈ రోజు కర్నూల్ జిల్లా పర్యటనకు వెళ్లారు. అయితే ఆయన అక్కడ వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్ధులను ప్రకటించి షాక్ ఇచ్చారు. కర్నూల్ ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులను మంత్రి లోకేష్ ప్రకటించారు. 2019 ఎన్నికల్లో ఎంపీగా బుట్టా రేణుక, ఎమ్మెల్యేగా మోహన్‌రెడ్డిలను భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. కర్నూలు పర్యటన సందర్భంగా ఆయన అభ్యర్థులను ప్రకటించి సంచలనం రేపారు. ఎమ్మెల్యే, ఎంపీలుగా మోహన్‌రెడ్డి, బుట్టా రేణుకలను గెలిపించాలని లోకేష్ ప్రకటించడంతో అందరూ అవాక్కయ్యారు. ఎందుకంటే, తెలుగుదేశం పార్టీకి, ఎప్పుడూ చివరి నిమిషం వరకు, అభ్యర్ధులను ప్రకటించే అలవాటు లేదు. అయితే, ఇప్పుడు దాదాపు సంవత్సరం ముందు నుంచే, అభ్యర్ధులను ప్రకటిస్తూ ఉండటంతో, ఎన్నికలకు కొత్త ప్రణాళికతో వెళ్తున్నారు.
మరో పక్క చంద్రబాబు సమీక్షల మీద సమీక్షలు చేస్తున్నారు. కొన్ని రోజులుగా చంద్రబాబు జిల్లాల వారీగా ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల ఇన్ చార్జిలతో సమావేశమవుతున్నారు. సర్వే వివరాలు ముఖ్యమంత్రి మొహమాటం లేకుండా చెబుతున్నారు. కేవలం ఆరోపణలే కాకుండా వారి పనితీరు, ప్రవర్తన తీరులో లోపం ఉన్నా క్యాడర్, ఓటర్లతో సరైన సంబంధాలు ఏర్పరచుకోలేకపోయినా వివరిస్తున్నారు. వారు తమను తాము దిద్దుకోవడానికి ఆయన అవకాశం ఇస్తున్నారు. దిద్దుకుంటే ఇబ్బంది లేదని, ఎన్నికలకు ఇంకా ఏడాది సమయం ఉందని, ఈలోపు వారు సరైన దారిలోకి రావాలన్నది ఆయన ఆలోచన అని, అందుకే ఈ కార్యక్రమం జరుగుతోందని టీడీపీ సీనియర్ నేతలు చెబుతున్నారు.