సింగపూరులో జరుగుతున్న ప్రపంచ నగరాల సదస్సు రెండవ రోజు సమావేశంలో ప్లీనరీ సెషన్లో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుప్రసంగించారు. భారతీయ చరిత్రలో అమరావతికి గొప్ప చరిత్ర ఉందని చెప్పారు. రాజధాని నిర్మాణం చాలా కష్టసాధ్యమైన పనని, సంస్కృతిని పరిరక్షిస్తూ రాజధాని నిర్మాణం జరుగుతోందని అన్నారు. నూతన సాంకేతికత ఉపయోగిస్తూ రాజధాని నిర్మాణం చేపదుతున్నామని, ప్రపంచంలోని 5 అగ్రశ్రేణి నగరాల్లో అమరావతిని నిలపాలన్నదే మా ధ్యేయం అని చెప్పారు. నివాసయోగ్యమైన నగరాల రూపకల్పనలో నీరు, పర్యావరణ లక్ష్యాలను చేరుకోవడానికి సాంకేతికత, మౌలిక సదుపాయల కల్పన అత్యంత అవసరం అని చెప్పారు.
వనరుల నిర్వహణలో వైజ్ఞానిక, సమాచార సాంకేతికత మనకు ఎంతగానో దోహదపడుతుందని, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐవోటీ) సాధనాల ద్వారా భూగర్భ, ఉపరితల నీటి వనరులు, ఉష్ణోగ్రతలు, గాలి నాణ్యత తదితర సమాచారాన్నికచ్చితంగా తెలుసుకోవచ్చని అన్నారు. వనరులను సమర్ధంగా వినియోగించి ప్రజలకు మెరుగైన జీవనం అందించడానికి ఈ సమాచారం దోహదపడుతుందని అన్నారు. సమర్థ నిర్వహణ పద్ధతుల ద్వారా మా రాష్ట్రంలో భూగర్భజలాలను పెంచగలిగామని చెప్పారు. నదుల అనుసంధానం, భూగర్భ జలాల పునర్ వినియోగం, వ్యర్థ నీటి నిర్వహణ తదితర చర్యలతో మెరుగైన ఫలితాలను సాధించామని చెప్పారు.
తాగునీటికే కాకుండా వ్యవసాయ, పారిశ్రామిక అవసరాలకు కూడా తగినంత నీటిని ఇవ్వగలుగుతున్నామని, మా నగరాలు, పట్టణ ప్రాంతాలు, గ్రామాలలో ద్రవ, ఘన వ్యర్ధాల నిర్వహణను సమర్థమైన పద్ధతులలో చేపడుతున్నామని అన్నారు. పునరుత్పాదక ఇంథనం పై ప్రధానంగా దృష్టి పెట్టామని, హరిత రాజధాని అమరావతిలో అన్ని ఆధునిక సాంకేతిక పద్దతులను వినియోగించుకుంటున్నామని అన్నారు. రాజధానిలో 5-10-15 అభివృద్ధి విధానాన్ని అనుసరిస్తూ నిర్మాణం చేపడుతున్నామని, అత్యవసర గమ్యాలను చేరుకోవడానికి 5 నిమిషాలు, సామాజిక అవసరాలకు 10 నిమిషాలు, కార్యక్షేత్రానికి చేరుకోవడానికి 15 నిమిషాలు అనే కాన్సెప్టును అమలు చేస్తామని అన్నారు. 5 లక్షల మంది రైతుల భాగస్వామ్యంతో ZBNF(జీరో బేస్డ్ నాచురల్ ఫార్మింగ్) వైపు వెళుతున్నారని, సమర్థ నాయకత్వం ద్వారానే ఇది ప్రభావవంతంగా ముందుకు సాగుతోందని అన్నారు. ఇవే పద్దతులను అనుసరిస్తూ సవ్య దిశలో పయనించడం ద్వారా ప్రపంచంలో నివాసయోగ్యమైన నగరాలను తీర్చిదిద్దుకోవచ్చునని ఇక్కడున్న నగర పాలకులకు సూచిస్తున్నాని చంద్రబాబు అన్నారు.