శ్రీసిటీలో మరో భారీ పరిశ్రమ యూఎస్జీ బోరల్ బిల్డింగ్ ప్రాడెక్ట్స్ఇండియా లిమిటెడ్ నిర్మాణానికి గురువారం ఉదయం భూమిపూజ జరిగింది. అమెరికాకు చెందిన యూఎస్జీ, ఆస్ట్రేలియాకు చెందిన బోరల్ కంపెనీల సంయుక్త భాగస్వామ్యంతో నెలకొల్పబడనున్న ఈ పరిశ్రమ అధునాతన భవన నిర్మాణ రంగంలో ఉపయోగించే ప్లాస్టర్ బోర్డులను ఉత్పత్తి చేస్తుంది. యూఎస్జీ బోరల్ గ్రూప్ సీఈఓ ఫ్రెడరిక్ డీ రోగేమోంట్, ఆసియా, మిడిల్ ఈస్ట్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ డాన్ కాసే, ఇండియా ఆపరేషన్స్ సీఈఓ సుమిత్ బిడాని, ఇతర ప్రతినిధుల చేతుల మీదుగా ఉదయం 11 గంటల సమయంలో లాంఛనంగా భూమిపూజ కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఫ్రెడరిక్ డీ రోగేమోంట్మాట్లాడుతూ, తమ శ్రీసిటీ ప్లాంట్ లో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో తయారయ్యే ఉత్పత్తులు దేశీయ, దక్షిణాసియా దేశాల మార్కెట్ అవసరాలకు అనుగుణంగా ఉంటాయన్నారు. అమెరికాలో పర్యటనలో వున్న శ్రీసిటీ మేనేజింగ్ డైరెక్టర్ తన సందేశంలో, భవన నిర్మాణ రంగంలో అగ్రగామి సంస్థ అయిన యూఎస్జీ బోరల్ శ్రీసిటీకి రావడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. నాణ్యమైన ప్లాస్టర్ బోర్డుల తయారీ ద్వారా ఈ సంస్థ భారత్ మరియు ఇతర దేశాలలో తమ వ్యాపారాన్ని విస్తరింపచేయగలదన్న ఆశాభావాన్ని వెలిబుచ్చారు.
ఇండియా ఆపరేషన్స్ సీఈఓ సుమిత్ బిడాని మాట్లాడుతూ, వివిధ వ్యాపార అనుకూలతల వలనే శ్రీసిటీలో తమ ప్లాంటు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. భారత్ లో తమ వ్యాపార విస్తరణకు ఈ ప్లాంటు బాగా ఉపయోగపడుతుందని అన్నారు. శ్రీసిటీలో 24 ఎకరాల్లో తలపెట్టిన యూఎస్జీ బోరల్ కంపెనీ నిర్మాణం 2019 సంవత్సరాంతానికి పూర్తికానుంది. సుమారు 300 కోట్ల పెట్టుబడితో ఏర్పాటవుతున్న ఈ పరిశ్రమలో ఏడాదికి 30 మిలియన్ చదరపు మీటర్ల ప్లాస్టర్ బోర్డులు తయారవుతాయి. ప్రత్యక్షంగా 100 మందికి ఉపాధి దొరుకుతుంది. ఆసియా, ఐరోపా, ఆస్ట్రేలియా ఖండాలలోని వివిధ దేశాలలో ఉత్పత్తి కేంద్రాలున్న యూఎస్జీ బోరల్ సంస్థకు భారతదేశంలో రాజస్థాన్, తమిళనాడులలో మరో రెండు ఉత్పత్తి కేంద్రాలు ఉన్నాయి.