కేంద్రం ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ విభజన హామీలు గురించి పట్టించుకోకుండా, అన్నీ ఇచ్చేసాం అంటూ హడావిడి చేస్తున్న సంగతి తెలిసిందే... ఈ నేపధ్యంలో, గత నాలుగు నెలల నుంచి, రాష్ట్రంలో ఆందోళనలు జరుగుతున్నాయి. అయినా కేంద్రం మాత్రం, పట్టించుకోవటం లేదు. ఈ నేపధ్యంలో, చంద్రబాబు ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు చేస్తున్న పోరాటాలు చేస్తూనే, రాష్ట్ర ప్రభుత్వం తరుపున, కేంద్రం పై సుప్రీం కోర్ట్ కు వెళ్లనుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఈ సందర్భంగా విభజన హామీలపై ఇటీవల సుప్రీం కోర్టులో కేంద్రం దాఖలు చేసిన అఫిడవిట్‌పై సుదీర్ఘంగా చర్చించారు.
ప్రత్యేక హోదా, విభజన హామీలపై న్యాయపోరాటం చేసేందుకు మంత్రివర్గం నిర్ణయించారు. విభజన హామీల అమలుపై సుప్రీంను ఆశ్రయించాలని, ఇందుకోసం సొంతంగా ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసేందుకు మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. ఇది ఇలా ఉండగా, తెలుగు రాష్ట్రాలకు విభజన హామీల అమలులో జాప్యం జరుగుతోందని పేర్కొంటూ, కాంగ్రెస్ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ పై, ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం అన్నీ ఇచ్చేసాం అని ఆఫిడవిట్ ఇచ్చింది. అయితే, ఈ పిటిషన్ లో ఇంప్లీడ్ అవ్వకుండా, సొంతగా మరో కేసు వెయ్యాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ పొంగులేటి సుధాకర్ రెడ్డి వేసిన పిటిషన్ లో తెలంగాణా అంశాలు కూడా ఉంటాయి కాబట్టి, మన సమస్యలు మాత్రమే ప్రస్తావిస్తూ, పిటిషన్ వెయ్యనున్నారు.
మొత్తం 19 అంశాల పై, కేంద్రం మనకు అన్యాయం చేస్తుంది. రాష్ట్రానికి ప్రత్యేక హోదాతో పాటు వనరుల ప్రాధాన్యత కల్పించడం, పోలవరం ప్రాజెక్టు నిర్మాణం, రైల్వే జోన్ ఏర్పాటు, గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్, క్రూడ్ ఆయిల్ రిఫైనరీ, విశాఖ, విజయవాడ మెట్రో రైల్, పేట్రో కెమికల్ కాంపెక్స్ ఏర్పాటు, జాతీయ ప్రాధాన్యత కలిగిన సంస్థల ఏర్పాటు, నెల్లూరులో దుగ్గిరాజపట్నం పోర్టుతో పాటు, అమరావతికి ఆర్థిక సహాయం, పన్నుల సవరణ, కడప జిల్లాలో ఉక్కు ఫ్యాక్టరీ, వైజాగ్, చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు, అమరావతికి సమగ్ర రవాణా కనెక్టివిటీ, వెనుకబడిన జిల్లాల అభివృద్ధి, డిస్కంల ద్వారా విద్యుత్ బకాయిల చెల్లింపులు, 9వ షెడ్యూల్, 10వషెడ్యూల్ సంసలు, గ్రేహౌండ్స్ శిక్షణ కేంద్రం ఏర్పాటు వంటి అంశాల గురించి, ఇప్పటికీ క్లారిటీ లేదు.