సొంతింటి కలను సాకారం చేసుకున్న తరుణాన ఇంతులు ఆనందంతో ఉక్కిరిబిక్కిరయ్యారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేతులమీదుగా ఇంటి స్వాధీన పత్రాలను తీసుకుంటున్నపుడు భావోద్వేగం చెందారు. ఒకేరోజు మూడులక్షల మంది నూతన గృహస్థులు కావడంతో, ఇల్లిల్లూ హరివిల్లును తలపించింది. అయితే, దీని పై కూడా ప్రతిపక్షాలు పస లేని ఆరోపణలు చేసి దొరికిపోయాయి. ఈ 3 లక్షల ఇళ్ళు కేంద్రం కట్టిందని రోజా లాంటి నేతలు అంటే, మా సొమ్ముతో చంద్రబాబు సోకు చేసుకుంటున్నారని బీజేపీ అంటుంది. అయితే, ఈ ఆరోపణల పై చంద్రబాబు ట్విట్టర్ ద్వారా వేసిన ఒక్క పోస్ట్ తో సమాధానం చెప్పారు. విమర్శలు చేసే వారికి అర్ధమయ్యేలా తెలుగులో, ఇంగ్లీష్ లో కూడా ట్వీట్ చేసారు..
గ్రామీణ ప్రాంతాల్లో 2,71,083 ఇళ్ళు కట్టగా, పట్టణాల్లో 24,145 ఇళ్ళు, హూద్ హూద్ తుఫాను బాధితులకు 5,1118 కట్టామని, చంద్రబాబు చెప్పారు. ఇందులో రాష్ట్ర ప్రభుత్వ సొంత నిధులతో నిర్మించింది 2,56,132 ఇళ్ళు కట్టామని, కేంద్ర నిధులతో కలిసి రాష్ట్ర భాగస్వామ్యంతో కట్టిన ఇల్లు, 44,214 ఇళ్ళు కట్టినట్టు చంద్రబాబు చెప్పారు. 2014లో తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన నాటినుంచి ఇప్పటివరకూ గృహ నిర్మాణ సంస్థ ఆధ్వర్యంలో మొత్తం 5.85లక్షల ఇళ్లు నిర్మించినట్లు తెలిపారు. అందులో గతేడాది అక్టోబరు 2న లక్ష ఇళ్లకు తొలివిడత గృహప్రవేశాలు చేశామని, ఇప్పుడు 3లక్షల ఇళ్లకు చేస్తున్నామని చెప్పారు. ఈ మూడు లక్షల్లో ఎస్సీలకు 57,296, ఎస్టీలకు 24,332, బీసీలకు 1,43,005, ఇతరులకు 75,713 ఇళ్లు కట్టామని వివరించారు.
మళ్లీ అక్టోబరులో 3 లక్షలు, జనవరిలో మరో 3 లక్షల ఇళ్లకు.. మొత్తం 6 లక్షల గృహప్రవేశాలు చేసేలా ఆదేశాలు జారీచేసినట్లు తెలిపారు. ఇవి కాకుండా అదనంగా ఐదు లక్షల ఇళ్ల నిర్మాణాలకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు ప్రకటించారు. పట్టణాల్లో కూడా కలిపి 2019 నాటికి 19లక్షల ఇళ్లు కడతామని, ఇందుకోసం రూ.50వేల కోట్లు ఖర్చు చేస్తున్నామని చెప్పారు. ‘పూర్తిచేసిన ఇళ్లకు రాష్ట్రప్రభుత్వం రూ.6,200 కోట్లు ఖర్చుచేస్తే.. కేంద్రం రూ.1296 కోట్లు మాత్రమే ఇచ్చింది. ఇళ్ల విషయంలో అరకొర నిధులు మాత్రమే ఇచ్చింది. పీఎంఏవై ఇళ్లలో ఇంటికి కేంద్రం ఇచ్చేది రూ.75 వేలు మాత్రమే. కానీ రాష్ట్రప్రభుత్వ పథకంలో ఒక్కోఇంటికి రూ.లక్షన్నర ఇస్తున్నాం’ అని గుర్తుచేశారు.