అన్నదాతల సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ‘చంద్రన్న రైతు బీమా’ పథకంలో పేర్ల నమోదు కార్యక్రమం శనివారం నుంచి ప్రారంభమయ్యింది. చంద్రన్న బీమా పథకం తరహాలో రైతులకు కూడా బీమా సదుపాయం కల్పించాలని ప్రభుత్వం సంకల్పించింది. ఇందులో భాగంగా అధికారులు జిల్లాలోని రైతులకు జీవిత బీమా, వ్యక్తిగత ప్రమాద బీమాను వర్తింప చేసి వారి కుటుంబ సభ్యులకు సామాజిక, ఆర్థిక భద్రత కల్పించేందుకు చర్యలు చేపట్టారు. గత నెల 28వ తేదీన ఏరువాక కార్యక్రమంలో చంద్రన్న రైతు బీమా పథకాన్ని సీఎం చంద్రబాబు ప్రారంభించారు. ఈ పథకం కింద ఎలాంటి రుసుం వసూలు చేయకుండా పేర్ల నమోదు ప్రక్రియను నిర్వహించనున్నారు.
గ్రామ నమోదు కమిటీల ద్వారా ఈ కార్యక్రమం జరగనుంది. ఇందులో డ్వాక్రా సంఘాల సభ్యులు ముగ్గురు ఉంటారు. వీరు ట్యాబ్‌ల ద్వారా రైతుల నమోదు ప్రక్రియను నిర్వహిస్తారు. చంద్రన్న బీమా పథకంలో నమోదు కాని రైతులు ఈ పథకంలో నమోదు చేసుకోవడానికి అవకాశం కల్పించారు. ఇవీ అర్హతలు.. 18 నుంచి 69 ఏళ్లలోపు వయసుండాలి... ఆధార్ కార్డులో నమోదైన వయసును పరిగణలోకి తీసుకుంటారు... పట్టాదారు పాసు పుస్తకం ఉండాలి... కౌలు రైతులకు రుణ అర్హత కార్డులు ఉండాలి.. రైతు వార్షిక ఆదాయం రూ.2.50 లక్షలు లోపు ఉండాలి.. బీమా నమోదు సమయంలో రైతు పూర్తి ఆరోగ్యవంతుడై ఉండాలి.. స్థానికంగా నివసిస్తూ ఉండాలి..
బీమా ప్రయోజనాలు ఇలా.. ఆధార్ కార్డు ప్రకారం వయసును పరిగణనలోకి తీసుకుంటారు... 18 నుంచి 50 ఏళ్లలోపు వారు సహజ మరణం చెందితే రూ.రెండు లక్షలు, 51 నుంచి 59 ఏళ్లలోపు వారు మరణిస్తే రూ.30 వేలు పరిహారంగా అందజేస్తారు... 18 నుంచి 69 ఏళ్లలోపు వారు ప్రమాదంలో మరణిస్తే రూ.అయిదు లక్షలు పరిహారంగా ఇస్తారు.... ప్రమాదంలో పాక్షిక అంగవైకల్యం పొందితే 19 నుంచి 69 ఏళ్లలోపు వారికి రూ.2.50 లక్షలు, పూర్తి అంగవైకల్యం చెందితే 18 నుంచి 69 ఏళ్లలోపు వారికి రూ.అయిదు లక్షలు పరిహారంగా అందజేస్తారు... నమోదు బృందాలకు ఎలాంటి రుసుం చెల్లించాల్సిన అవసరం లేదు. ఆధార్‌తో అనుసంధానమై బ్యాంకు ఖాతా వివరాలు అందజేయాలి. ఈనెల 15వ తేదీలోగా రైతుల నమోదు ప్రక్రియ పూర్తవుతుంది. ప్రత్యేక బృందాల సభ్యులు ఇంటింటికీ వచ్చి వివరాలు సేకరిస్తారు.