అమరావతి వాసులకి, ఓపెన్ ఎయిర్ ధియేటర్ అనుభూతిని ఇవ్వబోతుంది భవానీ ఐలాండ్. సాయంత్రం వేళ, కృష్ణమ్మా ఒడిలో, చల్లని గాలుల మధ్య ఓపెన్ ఎయిర్ ధియేటర్ లో సినిమా చుస్తే ఎలా ఉంటుంది ? ఆ థ్రిల్లే వేరు... ఇప్పుడు ఇలాంటి అవకాసం మనకు రాబోతుంది.
భవానీ ఐలాండ్ వచ్చే వారికి ప్రకృతి అందాలను ఆస్వాదించడంతో పాటు సరదాగా సాయం వేళ సినిమా చూసే అవకాశం రాబోతోంది. గతంలోనే ద్వీపంలో ఓపెన్ ఎయిర్ థియేటర్ ఉండేది. అయితే గత కొనేళ్లుగా మూతపడింది. విజయవాడ రాజధానిగా మారిన నేపథ్యంలో భవానీ ద్వీపానికి పర్యాటకుల తాకిడి ఎక్కువవుతోంది. దీంతో తిరిగి ఓపెన్ ఎయిర్ థియేటర్ ను ఆదివారం నుంచి తిరిగి ప్రారంభించనున్నారు.
ఓపెన్ ఎయిర్ థియేటర్లో ఆరువందల మంది ఒకేసారి చూసే అవకాశం ఉంది. ప్రతి శనివారం, ఆదివారం సాయంత్రం 5 నుంచి 7:30 గంటల వరకు సినిమా ప్రదర్శిస్తారు. బోటింగ్ చార్టీతో సహా సినిమాకు రూ.80 చార్టీ వసూలు చేస్తున్నారు. సినిమా చార్టీ రూ.50 గాను, రాను పోను, బోటింగ్ చార్టీ రూ.30 గాను నిర్ణయించారు. మొత్తంగా రూ.80 తో, బోటు లో, కృష్ణమ్మని తాకుతూ, భవాని ఐలాండ్ వెళ్లి, ఓపెన్ ఎయిర్ ధియేటర్ లో సినిమా చూసి రావచ్చు.
తొలి సినిమాగా బాహుబలిని ప్రదర్శిస్తున్నారు. పక్కనే రెస్టారెంట్ ఉండటంతో అక్కడే తినుబండారాలు కొనుగోలు చేసి తింటూ సినిమా చూసే అవకాశం ఉంటుంది.
సినిమా స్క్రీన్ కూడా, LED స్క్రీన్ కావటంతో, సినిమా ధియేటర్ లో కంటే, ఎక్కువ క్వాలిటీ తో బొమ్మ కనిపిస్తుంది. అలాగే డిజిటల్ క్వాలిటీ సౌండ్ సిస్టం ను కూడా అమర్చారు. ఒక వీకెండ్ వెళ్లి ఈ థ్రిల్ ఎంజాయ్ చేసి రండి.