సీఎం కుమారుడిగా రాజకీయ ఆరంగేట్రం చేశారు. ఎమ్మెల్సీగా శాసనమండలిలో అడుగుపెట్టారు. అనంతరం మంత్రి పదవిని చేపట్టి మంచి మార్కులే పొందారు. ఇప్పుడు ప్రత్యక్ష ఎన్నికల కదన రంగంలోకి దూకబోతున్నట్లు ప్రకటించి ఏపీ పాలిటిక్స్‌లో హాట్ టాపిక్‌గా మారారు. ఆయనెవరో కాదు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు తనయుడు నారా లోకేష్. ఏపీ మంత్రిగా కొనసాగుతున్న నారా లోకేష్ 2019 ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు ప్రకటించారు. లోకేష్ తొలిసారి ఎదుర్కోబోతున్న ఎన్నికలు కావడంతో రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ మొదలైంది. దానికి కారణం లేకపోలేదు. ఎన్నికల్లో పోటీ చేస్తానని ప్రకటించిన ఆయన ఎక్కడ నుంచి అనేది మాత్రం పార్టీ నిర్ణయమేనని సస్పెన్స్‌కు తెరలేపారు. దీంతో లోకేష్ ఎక్కడ నుంచి పోటీ చేస్తారనే అంశం ఏపీ పాలిటిక్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది.
రానున్న సాధారణ ఎన్నికల్లో లోకేష్‌ను ఎక్కడ నుండి పోటీకి దింపాలనే అంశం పై అధిష్టానం తీవ్రస్థాయిలో చర్చిస్తున్నట్లు తెలిసింది. ఎన్నికల వాతావరణం రావడంతో లోకేశ్ పోటీ వ్యవహారమూ తెరమీదకొచ్చింది. ప్రత్యక్ష ఎన్నికల్లో మొదటిసారి పోటీచేస్తుండటంతో నియోజకవర్గ ఎంపిక కీలకంగా మారనుంది. లోకేశ్‌ను చంద్రగిరి నుంచి పోటీ చేయిస్తే ఎలా ఉంటుందని ఇటీవల పార్టీ సర్వే చేయించినట్లు తెలిసింది. దీనిలో భాగంగానే అక్కడ ఇన్ఛార్జిగా ఉన్న గల్లా అరుణకుమారిని పొలిట్‌బ్యూరోలోకి తీసుకున్నట్లు సమాచారం. త్వరలోనే ఆయనకు చంద్రగిరి బాధ్యతలు అప్పగించే అవకాశం ఉన్నట్లు తెలిసింది.
ఒకవేళ చంద్రగిరి కాకపోతే కృష్ణాజిల్లా గుడివాడ నుండి బరిలోకి దింపే ఆలోచనా చేస్తోంది. పెనమలూరు నియోజకవర్గాన్ని పరిశీలనలో పెట్టుకున్నారు. అక్కడ ఇప్పటికే బోడే ప్రసాద్ భారీ మెజార్టీలో గెలిచి ఎమ్మెల్యేగా ఉన్నారు. అక్కడ నుండి ప్రసాద్‌ను తప్పించడం అంతమంచిది కాదనే అభిప్రాయమూ వచ్చినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో వెనుకబడిన నియోజకవర్గాలు రాష్ట్రంలో ఎక్కడెక్కడ ఉన్నాయనే అంశంపైనా పార్టీ ఇటీవల సర్వే చేయించించినట్లు తెలిసింది. దీనిలో ఎమ్మెల్యేలు ఉన్న 22 నియోజకవర్గాల్లో పార్టీ ఎమ్మెల్యేలపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైనట్లు తెలిసింది.