రాజధాని ప్రాంతంలో కీలకమైన విజయవాడ పోలీస్ కమిషనర్ నియామకానికి సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు కసరత్తు చేస్తున్నారు. దీనికి సంబంధించి సీనియర్ ఐపిఎస్ అధికారులు ద్వారకాతిరుమలరావు, నళినీ ప్రభాత్, అమిత్‌గార్గ్‌లతో ఉండవల్లిలోని నివాసంలో ఆదివారం భేటీ అయ్యారు. సిఎం వారితో పలు అంశాలపై చర్చించారు. గౌతమ్ సవాంగ్ విజిలెన్స్ డిజిగా వెళ్లిన తరువాత విజయవాడ పోలీస్ కమిషనర్ పదవీ ఇప్పటి వరకు ఖాళీగానే ఉంది. రాజధాని ప్రాంతంలో ఎంతో కీలకమైన ఈ పదవి కోసం పలువురు సీనియర్ ఐపిఎస్‌లు పోటీ పడుతున్నారు.
సిఐడి చీఫ్ ద్వారకాతిరుమలరావు, ఆపరేషన్స్ ఎడిజి నళినీ ప్రభాత్‌తో పాటు గతంలో విజయవాడ కమిషనర్‌గా చేసిన సీనియర్ సిఐడి అధికారి అమిత్‌గార్గ్ కూడా రేసులో ముందున్నట్లు తెలుస్తోంది. ఈ ముగ్గురు అధికారులతో సిఎం సమావేశమయ్యింది ప్రస్తుతానికి ఖాళీగా ఉన్న విజయవాడ పోలీస్ కమిషనర్ పదవి భర్తీ కోసమే అని కొందరు అధికారులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఐపిఎస్‌లతో ముఖ్యమంత్రి భేటీ అనంతరం అతి త్వరలోనే విజయవాడ పోలీస్ కమిషనర్ ఎంపిక ఉంటుందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే చంద్రబాబు మాత్రం ద్వారకాతిరుమల రావు వైపు మొగ్గు చూపుతున్నట్టు సమాచారం.
విజయవాడ పోలీసు కమిషనరేట్‌కు కొత్త బాస్ గా, సీహెచ్ ద్వారకాతిరుమల రావు కొత్త సీపీగా వచ్చే అవకాశం ఉంది. ఈయన ప్రస్తుతం సీఐడీ అదనపు డీజీపీగా విధులు నిర్వహిస్తున్నారు. సమర్థుడైన అధికారిగా ద్వారకా తిరుమలరావుకు పేరు ఉంది. 1989 బ్యాచ్ ఐపీఎస్ అధికారి అయిన ఈయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో సైబరాబాద్ కమిషనర్‌గా పనిచేశారు. అంతకు ముందు అనంతపురం, మెదక్, కడప ఎస్పీగా, అనంతపురం రేంజి డీఐజీగా అక్టోపస్, కౌంటర్ ఇంటెలిజెన్స్ సెల్ ఐజీగా కూడా బాధ్యతలు నిర్వహించారు. సీఐడీ అదనపు డీజీగా క్లిష్టమైన కేసులను కొలిక్కి తేవడంలో ఈయన సమర్థంగా పనిచేశారన్న పేరు ఉంది. ఈ నేపథ్యంలో ద్వారకా తిరుమలరావును విజయవాడ పోలీసు కమిషనర్‌గా నియమించేందుకు ఇంటెలిజెన్స్ చీఫ్‌తోపాటు కొత్త డీజీపీ కూడా సుముఖంగా ఉన్నట్లు సమాచారం.