సమాచార హక్కు(ఆర్‌టీఐ) చట్టం కమిషనర్లుగా రాష్ట్ర ప్రభుత్వం ముగ్గురు వ్యక్తులను ఎంపిక చేసింది. ఈ పోస్టుల కోసం దరఖాస్తులు చేసుకున్న వారి వివరాలన్నింటినీ పరిశీలించి... విశ్రాంత ఐపీఎస్ అధికారి బీవీ రమణకుమార్, విశ్రాంత ఐఎఫ్‌ఎస్ అధికారి మాతంగి రవికుమార్, హైకోర్టు సీనియర్ న్యాయవాది కట్టా జనార్దన్‌రావులను ఎంపిక చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన గురువారం ఉండవల్లిలోని నివాసంలో జరిగిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వం ఎంపిక చేసిన వారి వివరాలను గవర్నర్‌కు పంపించనున్నారు. ఆయన ఆమోదముద్ర వేస్తే ఆ ముగ్గురు పేర్లు అధికారికంగా ఖరారవుతాయి. ప్రధాన కమిషనర్ ఎంపికకు సంబంధించి మరోమారు సమావేశమవ్వాలని నిర్ణయించారు. ఈ పోస్టుకు ఏకే జైన్ పేరు పరిశీలిస్తున్నట్లు సమాచారం.
కమిషనర్ల ఎంపిక కోసం గురువారం సమావేశం జరగనున్నట్లు ప్రతిపక్ష నేత జగన్ కార్యాలయ సిబ్బందికి సమాచారమందించగా... తాము పాదయాత్రలో ఉన్నామని వారు సమాధానమిచ్చినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. దీంతో చంద్రబాబు, ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు సమావేశమై పైన పేర్కొన్న వారి పేర్లను ఎంపిక చేశారు. అయితే మూడుసార్లు ఆహ్వానించినా ఈ సమావేశానికి ప్రతిపక్ష నేత జగన్ గైర్హాజరయ్యారు. సమాచార కమిషనర్ల ఎంపిక త్రిసభ్య కమిటీ చేయ్యనుంది. కమిటీలో సభ్యులుగా సీఎం చంద్రబాబునాయుడు, ప్రతిపక్ష నేత వైఎస్‌జగన్, మంత్రి యనమల రామకృష్ణుడు ఉన్నారు. ఈ సమావేశానికి హాజరుకాలేనని రెండు సార్లు, వైఎస్ జగన్ ప్రభుత్వానికి సమాచారమిచ్చి, తన తరఫున ప్రతినిధి వస్తారని తెలిపారు. ఇందుకు నిబంధనల ప్రకారం వేరే వ్యక్తులకు అవకాశం లేదని ప్రభుత్వం వెల్లడించింది.
అయితే ఈ విషయంలో, ఇప్పటికే కోర్ట్ నోటీసు పంపించింది. సమాచార కమిషనర్లను ఎందుకు నియమించలేదో చెప్పాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేశ్‌కుమార్‌ను హైకోర్టు ఆదేశించింది. ఈ వ్యవహారంపై పూర్తి వివరాలతో అఫిడవిట్ దాఖలు చేయాలంటూ విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. సమాచార హక్కు చట్టం కమిషనర్ల నియామకంలో జరుగుతున్న జాప్యాన్ని సవాలు చేస్తూ ‘ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్’ స్వచ్ఛంద సంస్థ కార్యదర్శి ఎం.పద్మనాభరెడ్డి గతేడాది హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం దాఖలు చేశారు. జగన్ ఎన్ని సార్లు పిలిచినా రాకపోవటం, కోర్ట్ నోటీసులు పంపించటంతో, ప్రభుత్వం ఈ సారి నిర్ణయం తీసుకుంది.