మంగళగిరి ఎయిమ్స్ లో జరుగుతున్న నిర్మాణ పనులని, కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా పర్యవేక్షించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎయిమ్స్, మోడీ ఇచ్చిన ఓ విశిష్టమైన బహుమతిగా మిగులుతుందని చెప్పారు. భవనాల పరిశీలనకు ముందు మంత్రి.. ఎయిమ్స్, రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఆ తర్వాత ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ ఎయిమ్స్ పెద్ద ప్రాజెక్ట్ అని.. అందుకోసం రూ.1600 కోట్లకు పైగా ఖర్చు చేయనున్నామని చెప్పారు. ఎయిమ్స్ మొదటి దశ పూర్తి కావడానికి వచ్చే మార్చి వరకు గడువున్నా.. ప్రధాని సూచనలతో జనవరికే సిద్ధం చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. ఇది మోడీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇస్తున్న గిఫ్ట్ అంటూ, మంత్రి చెప్పుకొచ్చారు.
అయితే, ఇదే సమావేశంలో, రాష్ట్ర ప్రభుత్వం తరపున మంత్రి నక్కా ఆనందబాబు, వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి పూనం మాలకొండయ్య హాజరయ్యారు. మంగళగిరిలో ఎయిమ్స్ ఆసుపత్రి నిర్మా ణానికి గాను రాష్ట్ర ప్రభుత్వం అన్నీ విధాలుగా సంపూర్ణ సహాయ సహకారాలను అందిస్తుందని రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి నక్కా ఆనందబాబు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని పనులు చేసింది, ఎంత విలువైన భూములు, పనులు చేసింది వరుసగా చెప్పి, కేంద్ర మంత్రి అవాక్కయేలా చేసారు. రూ.వెయ్యి కోట్ల విలువైన 183 ఎకరాల భూమిని ప్రభుత్వం ఎయిమ్స్ కోసమై ఇచ్చిందన్నారు. అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలను యుద్ధప్రాతిపదికన కల్పిస్తున్నట్టు చెప్పారు. రూ.15 కోట్ల వ్యయంతో తాగునీటి పధకం, రూ.36 కోట్ల వ్యయంతో 132కేవీ విద్యుత్ సబ్ స్టేషన్, రూ.40 కోట్ల వ్యయంతో అటవీశాఖ అనుమతులు, రూ.పది కోట్ల వ్యయంతో హైవే నుంచి రహదారి నిర్మాణం వంటి ఎన్నో పనులను రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిందన్నారు.
కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ ఎయిమ్స్ విషయంలో చిత్తశుద్దితో వ్యవహరించబట్టే పనులు ఇంత వేగంతో జరుగుతున్నాయన్నారు. బీజేపీ నేతలు అన్నీ మేమే చేస్తున్నాం అంటే కుదరదు అన్నారు. విభజన హామీల్లో ఇచ్చిన హక్కు అనే విషయం మర్చిపోకూడదు అని అన్నారు. ఏపీలో తెలుగుదేశం పార్టీని ఇరుకున పెట్టేందుకు బీజేపీ, కేంద్ర మంత్రుల్ని పంపిస్తుంది. కేంద్రం సాయంతో నడుస్తున్న పథకాలు వివిధ అభివృద్ధి కార్యక్రమాలను టీడీపీ తమ పథకాలుగా ప్రచారం చేస్తోందని ఆరోపిస్తున్న బీజేపీ అవి కేంద్ర పథకాలని ప్రకటించి ప్రచారం చేసేందుకు తాపత్రయపడుతోంది. ఇందులో భాగంగానే ఆయా శాఖల మంత్రులను రాష్ట్రంలో పర్యటించేలా చేసి తద్వారా పధకాలపై బీజేపీ ముద్ర ఉంటుందని ఆపార్టీ నేతలు భావిస్తున్నారు. అందుకే వరుస పెట్టి, కేంద్ర మంత్రులు రాష్ట్రానికి వస్తున్నారు. దీనికి, తెలుగుదేశం కూడా ఎప్పటికప్పుడు కౌంటర్ లు ఇస్తూ, రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న పనులు కూడా చెప్తుంది.