ప్రపంచ నగరాల సదస్సులో పాల్గునటానికి, చంద్రబాబు సింగపూర్ వెళ్ళిన సంగతి తెలిసిందే. ప్రపంచ నగరాల సదస్సులో భాగంగా, అక్కడకు వచ్చిన వివిధ దేశాల ప్రతినిధులకు అమరావతి గురించి వివరించారు చంద్రబాబు. వివిధ దేశాల ప్రతినిధులు చెప్పే బెస్ట్ ప్రాక్టీసెస్ తెలుసుకుని, అవి అమరావతిలో ఇంప్లెమెంట్ చెయ్యటానికి వెళ్లారు. అయితే, అక్కడ కూడా చంద్రబాబు పెట్టుబడుల వేట ఆపలేదు.. అక్కడకు వచ్చిన కొంత మంది పారిశ్రామిక వేత్తలతో, మీటింగ్ లు ఏర్పాటు చేసుకుని, పెట్టుబడుల అవకాశాల పై వివరించారు. వెంటనే ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ ‘లోథా గ్రూపు’ ఆసక్తి చూపింది. వెళ్ళిన పని ఒకటి, జరిగింది మరొకటి అనట్టు, మొత్తానికి చంద్రబాబు ఒక కంపెనీని, రాష్ట్రంలో పెట్టుబుడులు పెట్టటానికి ఒప్పించారు.
నవ్యాంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో అడుగుపెట్టేందుకు సిద్ధంగా వుంది ‘లోథా’. మాల్స్, ఓపెన్ స్పేస్ వినోదం వంటి రంగాల్లో భారీఎత్తున పెట్టుబడులు పెట్టాలని నిర్ణయించింది. ఈ విషయాన్ని సింగపూర్ పర్యటనలో వున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ఆ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్, సీఈవో అభిషేక్ లోథా వివరించారు. ఆదివారం ముఖ్యమంత్రితో సమావేశమైన అభిషేక్ లోథా ఆంధ్రప్రదేశ్‌లో వున్న అపార అవకాశాలు, జరుగుతున్న అభివృద్ధి తమని ఎంతగానో ఆకట్టుకుందని, ఏపీతో కలిసి పనిచేస్తామని, ఇందుకు తగ్గ ప్రతిపాదనలు-ప్రణాళికలతో సెప్టెంబరులో రాష్ట్రానికి వస్తామని చెప్పారు.
అత్యంత సుందరమైన ల్యాండ్ స్కేపింగ్‌తో నదీ అభిముఖంగా అమరావతిని గ్రీన్ ఫీల్డ్ రాజధానిగా నిర్మిస్తున్నామని అభిషేక్ లోథాకు ముఖ్యమంత్రి తెలిపారు. మూడు పట్టణ పాలక సంస్థలు, రెండు నగర పాలక సంస్థలు, అనేక గ్రామ పంచాయతీలను కలుపుకుని మహానగరంగా నిర్మిస్తున్నామని చెప్పారు. పరిపాలన కేంద్రంగానే కాకుండా ఆర్థిక కార్యకలాపాల నగరంగా అమరావతిని తీర్చిదిద్దుతున్నట్టు వివరించారు. జాతీయ రహదారులతో అమరావతిని అనుసంధానిస్తున్నామని ముఖ్యమంత్రి తెలిపారు. రాజధాని నగరాన్ని సుస్థిర పర్యావరణ నగరంగా తీర్చిదిద్దాలన్నదే లక్ష్యంతో వున్నామని, ఐదు లక్షల మంది రైతులను భాగస్వాములను చేస్తూ ప్రకృతి సేద్యాన్ని ప్రోత్సహిస్తున్నామని వెల్లడించారు.
‘స్థిరాస్థి అభివృద్దిదారులతో సంప్రదించి రాజధాని అభివృద్ధి కోసం ఒక ప్రత్యేకమైన ప్రభుత్వ విధానాన్ని రూపొందించే పనిలో ఉన్నాం. అభివృద్ధిలో ప్రపంచస్థాయి నిర్మాణదారుల భాగస్వామ్యం తీసుకుంటున్నాం. అమరావతిలో 1700 ఎకరాల విస్తీర్ణం గల ప్రాంతాన్ని సింగపూర్ అభివృద్ధి చేస్తోంది.’ అని అభిషేక్ లోథాతో ముఖ్యమంత్రి అన్నారు. తిరుపతి, అనంతపురము, విశాఖపట్టణం, అమరావతి నగరాలను మేజర్ ఎకనమిక్ హబ్స్‌గా తీర్చిదిద్దేందుకు జరుపుతున్న కృషిని వివరించారు. తిరుపతి ఎలక్ట్రానిక్ మాన్యుఫాక్చరింగ్, హార్డ్ వేర్ పరిశ్రమల కేంద్రంగా నిలుస్తోందని అన్నారు. అనేక పేరొందిన విద్యా సంస్థలతో అమరావతిని నాలెడ్జ్ హబ్‌గా రూపొందిస్తున్నామని, కాలుష్యరహిత పరిశ్రమలతో ఇది కళకళలాడుతుందని చెప్పారు. విశాఖలో ఇప్పటికే అనేక పరిశ్రమలు కొలువుదీరాయని, ఈ నగరాన్ని పారిశ్రామిక-వైజ్ఞానిక నగరంగా తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు. ఎయిరో స్పేస్, డిఫెన్స్, ఆటో సెక్టారుకు ముఖ్య కేంద్రంగా అనంతపురము విరాజిల్లుతుందని అన్నారు. ముంబై సమీపంలో 20 చదరపు కిలోమీటర్ల మేర నిర్మాణాలు జరిపిన లోథా గ్రూపు ఇతర దేశాలలో కూడా లోథా నిర్మాణ కార్యకలాపాలు విస్తృతంగా చేపడుతోంది.