శరవేగంగా జరుగుతున్న నగరీకరణకు అనుగుణంగా నవ్యాంధ్రప్రదేశ్ నిర్మాణం చేపట్టినట్టు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సింగపూర్‌లో జరిగిన ‘ప్రపంచ నగరాల సదస్సు-మేయర్ల ఫోరం’ కార్యక్రమం వేదికపై స్పష్టం చేశారు. ఫోరంలో ఆదివారం ‘మౌలిక సదుపాయాలు- నవీన ఆవిష్కరణలు’ అనే అంశంపై ప్రసంగించిన ముఖ్యమంత్రి 2050 నాటికి ప్రపంచ జనాభాలో 66 శాతం నగరాల్లోనే నివసిస్తారని, ప్రధానంగా ఆసియా-ఆఫ్రికా ఖండాల్లో ఈ మార్పు కచ్చితంగా ఉంటుందని వివరించారు. నగరీకరణే విజన్‌గా 2050 నాటికి ఆంధ్రప్రదేశ్‌ను ప్రపంచంలో అత్యుత్తమ గమ్యస్థానంగా మారుస్తున్నామని ముఖ్యమంత్రి చెప్పారు. విభజన తర్వాత తలెత్తిన సమస్యలను అధిగమించి రెండంకెల సుస్థిర వృద్ధిని నిలుపుకోవడానికి కృషి చేస్తున్నట్టు తెలిపారు.
‘విద్యుత్, జల, గ్యాస్, రోడ్, ఫైబర్ నెట్‌వర్క్ వంటి 5 గ్రిడ్లను తయారు చేసుకుంటున్నాం. నాణ్యమైన, నమ్మకమైన విద్యుత్‌ను తక్కువ ధరలోనే అందించగలుగుతున్నాం. ‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’లో మేము అగ్రపథాన ఉన్నాం. ఇది రాష్ట్రాన్ని తయారీ పరిశ్రమల హబ్‌గా నిలిపేందుకు తప్పకుండా ఉపకరిస్తుంది.’ అని సదస్సులో ముఖ్యమంత్రి పేర్కొన్నారు. మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయడం కోసం పీపీపీ పద్ధతిలో అనేక సంస్థల భాగస్వామ్యంతో పనిచేస్తున్నామని చెప్పారు. ‘5 నిమిషాల్లో ఎమర్జెన్సీ, 10 నిమిషాల్లో సోషల్ ఇన్‌ఫ్రా, 15 నిమిషాల్లో వాక్ టు వర్క్’ అనే సిద్ధాంతాన్ని అమలు పరుస్తున్నామని వెల్లడించారు.
సింగపూర్ సహకారంతో తమ రాష్ట్రంలో సరికొత్త రాజధాని అమరావతిని నిర్మించుకుంటున్నామని ముఖ్యమంత్రి అన్నారు. నవ నగరాల సమాహారంగా అమరావతి రూపుదిద్దుకుంటోందని, హరిత-జలనగరంగా తీర్చిదిద్దుతున్నామని చెప్పారు. 35 వేల ఎకరాల భూమిని సమీకరణ విధానంలో సేకరించడం ప్రపంచంలోనే ఒక వినూత్న విధానంగా వివరించారు. 30 మిలియన్ల చదరపు అడుగుల మేర నగరం నిర్మాణం పనులు అమరావతిలో కొనసాగుతున్నాయని ముఖ్యమంత్రి అన్నారు. ఉత్తమ సంస్థలు, అత్యుత్తమ రూపకర్తలు తమ నగర నిర్మాణంలో పాలు పంచుకుంటున్నారని చెప్పారు. నవ్యాంధ్రప్రదేశ్ నిర్మాణంతో సహా, అమరావతిని అభివృద్ధి పథాన నిలపడానికి సదస్సుకు హాజరైన అందరి సహకారాన్ని ముఖ్యమంత్రి కోరారు. జల వనరుల నిర్వహణ-స్మార్ట్ టెక్నాలజీ అంశాలపై ఏపీకి సహకరిస్తామని సింగపూర్ మేయర్ల కమిటీ చైర్మన్ లోయెన్ లింగ్ హామీ ఇచ్చారు.
నగరాలను ఎలా మెరుగుపరచుకోవాలో, అభివృద్ధిలో భాగస్వామ్యాలను ఎలా అందిపుచ్చుకోవాలో అర్థం చేసుకునేందుకు సదస్సుకు హాజరైన 140 మంది యువ నగర పాలకులు తమ ఆలోచనలను ముఖ్యమంత్రితో పంచుకున్నారు. ‘పౌరులకు అనుసంధానం కావడమే సుపరిపాలనకు మూలస్తంభం’గా యువ నేతలకు నేతృత్వం వహించిన మెలిస్సా అభిప్రాయపడ్డారు. చక్కని రవాణా వ్యవస్థ, అభ్యాస వ్యవస్థలను నిర్మించాల్సిన అవసరముందని, దీనికి విధివిధానాలు రూపొందించాల్సి వుందని పలువురు యువనేతలు భావించారు.