రాష్ట్ర విభజన అశాస్త్రీయంగా జరిగింది. దీనివలన ఆంధ్రప్రదేశ్ ప్రజలు తీవ్రంగా నష్టపోయారు. ఈ నష్టాన్ని పూడ్చుతామని భరోసా ఇచ్చిన కేంద్రం, ఇప్పుడు సహకరించడం లేదు. ఏపీ ప్రజల సెంటిమెంట్‌ను గౌరవించాల్సిన సమయం ఆసన్నమైంది. ఆలస్యం చేస్తే ప్రయోజనం ఉండదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. సుమారు 6,688 కోట్ల రూపాయలతో శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట నుంచి అనకాపల్లి వరకూ జాతీయ రహదారి అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ శుక్రవారం శంకుస్థాపన చేశారు. కొన్ని రోడ్లను జాతికి అంకితం చేశారు. ఈ సందర్భంగా జరిగిన సభలో చంద్రబాబు మాట్లాడుతూ విభజిత ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలంటే కేంద్రం చేయూతనివ్వాలన్నారు.
పూర్తిగా అభివృద్ధికి 10 నుంచి 12 సంవత్సరాలు పడుతుంది. ఇప్పటికే నాలుగేళ్లు గడిచిపోయాయి. ఏపీ ప్రజలకు సెంటిమెంటైన ప్రత్యేక హోదా, రైల్వే జోన్, దుగరాజుపట్నం పోర్టు వంటి 18 అంశాలపై కేంద్రం ఇప్పటికీ నిర్ణయం తీసుకోపోవడం వలన ప్రజలు తీవ్ర అసంతృప్తితో, ఆగ్రహంతో ఉన్నారు. మొన్నటి వరకూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేశాయి. కొన్ని కారణాల వలన వేరయ్యాం. విభజన చట్టంలో పొందుపరిచిన అంశాలన్నీ ఇవ్వకపోతే, రాష్ట్రం నష్టపోతుందని అన్నారు. రాష్ట్ర ప్రజల ఆగ్రహాన్ని మీరు చూస్తున్నారని గడ్కరీని ఉద్దేశించి చంద్రబాబు అన్నారు. రాష్ట్రం అభివృద్ధి చెందడానికి మరో ఎనిమిది సంవత్సరాలు పడుతుందని చంద్రబాబు అన్నారు. ఇటువంటి సమయంలో రాష్ట్రాన్ని ఆదుకోవలసిన బాధ్యత కేంద్రానికి లేదా? అని చంద్రబాబు ప్రశ్నించారు.
పోలవరం ప్రాజెక్ట్‌కు సంబంధించిన అన్ని వివరాలు సంబంధిత శాఖకు తెలియచేయడానికి రాష్ట్ర అధికారులు సోమవారం ఢిల్లీ వెళుతున్నారని చంద్రబాబు చెప్పారు. తనను రమ్మన్నా తాను కూడా ఢిల్లీ వస్తానని సీఎం చెప్పారు. పోలవరం భూసేకరణ సమయంలో గిరిజనులకు అన్యాయం చేశామన్న ఆరోపణల్లో వాస్తవం లేదని చంద్రబాబు చెప్పారు. 2013 భూసేకరణ చట్టాన్ని అమలు చేస్తున్నామని అన్నారు. ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీకి ఇచ్చే నిధులు నేరుగా రైతులకు ఇచ్చినా తనకు ఎటువంటి అభ్యంతరం లేదని అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పరస్పర ఆరోపణలు చేసుకోవడం వలన ప్రయోజనం లేదని అన్నారు. కేంద్రం తనకు పూర్తిగా సహకరిస్తే, కావేరీ జల సమస్య లేకుండా వారికి కావల్సిన నీటిని ఏపీ నుంచి ఇవ్వడానికి తాను సిద్ధంగా ఉన్నానని చంద్రబాబు స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం తమిళులంతా ఏకోన్ముఖంగా పోరాడతారు. ఏపీకి కేంద్రం నుంచి రావల్సినవన్నీ వచ్చేలా చూడాలని కేంద్ర పోర్టుల శాఖ సహాయ మంత్రి రాధాకృష్ణన్‌కు సీఎం విజ్ఞప్తి చేశారు. గడ్కరీకి కేంద్ర ప్రభుత్వంలో చాలా పలుకుబడి ఉంది. ఆయన పరపతిని ఉపయోగించి, ఏపీకి న్యాయం చేసేలా మోదీకి నచ్చచెప్పాలని, దీనివలన వచ్చే క్రెడిట్ ఎవ్వరు తీసుకున్నా తనకు అభ్యంతరం లేదని చంద్రబాబు స్పష్టం చేశారు.