రాష్ట్ర వ్యాప్తంగా మొక్కలు నాటే మహా యజ్ఞానికి రాష్ట్ర ప్రభుత్వం ముహూర్తం ఖరారు చేసింది. జూలై 14న రాష్ట్రవ్యాప్తంగా కోటి మొక్కలు నాటేందుకు ‘వనం-మనం’ కార్యక్రమాన్ని విస్తృత స్థాయిలో చేపట్టాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. జూలై 14న కృష్ణా జిల్లా నూజివీడు నుంచి ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి స్వయంగా శ్రీకారం చుట్టనున్న ఈ కార్యక్రమం కార్తీక మాసంలో నిర్వహించే ‘వనమహోత్సవం’ వరకూ 127 రోజులపాటు నిరాటంకంగా కొనసాగనుంది. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు భాగస్వాములయ్యేలా చూడాలని, ఇందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి అన్నారు. జిల్లాలవారీగా మొక్కల నాటే బాధ్యతను మంత్రులతో పాటు ప్రతిఒక్కరూ తీసుకోవాలని చెప్పారు. కోటి మొక్కల సంకల్పానికి అన్ని రకాల మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారం కల్పించాలని, అందరినీ సంసిద్ధులు చేయాలని చెప్పారు.
శుక్రవారం ఉండవల్లిలోని గ్రీవెన్ హాల్ లో ‘వనం-మనం’ కార్యక్రమంపై అటవీ, పర్యావరణ శాఖ, ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో 26 శాతంగా వున్న అటవీ విస్తీర్ణాన్ని 2029 నాటికి 50 శాతానికి పెంచడమే తన లక్ష్యమని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చెప్పారు. ఉద్యమ స్ఫూర్తితో రాష్ట్రంలో పచ్చదనం పెంపొందించేలా అధికారులు కార్యాచరణ చేపట్టాలన్నారు. హరితాంధ్రప్రదేశ్ సాకారానికి అవసరమైన నిధుల సమీకరణపైనా దృష్టి పెట్టాల్సిందిగా అధికారులతో అన్నారు. నరేగా నిధులను భారీఎత్తున వినియోగించుకోవచ్చని సూచించారు. రైల్వే లైన్లకు, రహదారులకు ఇరువైపులా చెట్లు పెంచాలన్నారు. ‘అటవీ ప్రాంతంలో పడ్డ ఒక్క చుక్క వర్షం నీరు వృధా కాకూడదని ముఖ్యమంత్రి ఆదేశించారు. అటవీప్రాంతం చుట్టూ కందకాలు తవ్వాలని చెప్పారు. చెక్‌డ్యాంలు, రాక్‌ఫిల్ డ్యాంలు పెద్దఎత్తున నిర్మించాలని సూచించారు. అటవీ ప్రాంతంలో నీరు నిల్వ ఉండేలా చూస్తే అడవులు, వన్యప్రాణుల సంరక్షణ జరగడమే కాకుండా ఆ పరిసర ప్రాంతాల్లో భూగర్భ జలాలు పెరుగుతాయని చెప్పారు.
‘నాటే ప్రతి మొక్క చెట్టు అవ్వాలి, పాఠశాలలు సహా వివిధ ప్రాంతాల్లో నాటే మొక్కల వల్ల అందం రావాలి, ఎలాంటి మొక్కలు పెట్టాలి అన్న విషయంలో పూర్తి స్పష్టతతో ముందుకు వెళ్ళాలి. నాటే మొక్కలు పర్యావరణ హితమైనవి. ఆరోగ్యానికి మేలు చేసేవేకాకుండా ఫలాలు ఇచ్చేవి అయుండాలి’ అని ముఖ్యమంత్రి అన్నారు. వృక్ష మిత్రలను నియమించి ప్రతి మొక్కను సంరక్షించాలన్నారు. రాష్ట్రంలో 50 శాతం పచ్చదనం సాధించే లక్ష్యాన్ని ప్రతి ఒక్కరు ప్రతి క్షణం, గుర్తుపెట్టుకొని బాధ్యతతో ఒక యజ్ఞంలా ఈ కార్యక్రమం నిర్వహించాలని సూచించారు. 10 ఏళ్ల పాటు ఏడాదికి 50 కోట్ల మొక్కలు నాటగలిగేతే హరితాంద్ర సాధన పూర్తవుతుంది. ఇందుకోసం నర్సరీల పెంపకానికి ప్రత్యేకంగా ఒక డీఎఫ్ఓ స్థాయి అధికారిని నియమించాలని అధికారులకు సూచించారు.
మొక్కలు పెద్దసంఖ్యలో నాటే వారికి ప్రోత్సాహకాలు ఇవ్వాలని, ప్రతి ఒక్కరిని ప్రకృతికి దగ్గర చేయడమే ఆశయంగా వుండాలని చెప్పారు. చెట్ల పెంపకం కార్యక్రమం, విత్తనాల సేకరణ కార్యక్రమాలు ఏడాది పొడవునా చేపట్టాలని స్పష్టం చేశారు. మన వాతావరణ పరిస్థితులను తట్టుకుని త్వరగా పెరిగే మొక్కలను ఎంచుకోవాలని అన్నారు. ఇందుకోసం ఉద్యాన, అటవీ శాఖలు సంయుక్తంగా పరిశోధనలు చేయాలన్నారు. అమెరికా తరహాలో చెట్ల క్లోనింగ్ పద్దతి ఇక్కడా రావాలని చెప్పారు. అటవీప్రాంతాల్లో నేరేడు, మారేడు, ఉసిరి, వంటి ఔషద గుణాలున్న మొక్కలతో పాటు సీతాఫలం లాంటి పండ్లమొక్కలు విస్తృతంగా నాటాలని సూచించారు. ప్రాంతాలవారీగా మొక్కల పెంపకాన్ని డ్వాక్రా గ్రూపులకు అప్పగించడంతో పాటు వాటి సంరక్షణ బాధ్యతను వారికే ఇవ్వాలని సూచించారు. రాష్ట్రంలోని ప్రతి స్కూలు, కాలేజి, విశ్వవిద్యాలయాలు, పరిశ్రమల ప్రాంగణాలు వంటి మొక్కలకు రక్షణ కల్పించతగిన అన్ని చోట్లా తప్పనిసరిగా మొక్కల పెంపకం జరగాలని అన్నారు. జలవనరులకు సమీపంలో చెట్లను పెంచడం ద్వారా నీటి సంరక్షణ కూడా సాధ్యమవుతుందని అన్నారు.
రాష్ట్రంలోని ఐదు పక్షి సంరక్షణ కేంద్రాలను అభివృద్ధి చేయాలని, మడ అడవులను పెద్ద ఎత్తున పెంచడం ద్వారా తీరప్రాంతాల్లో కాలుష్యాన్ని నివారించే వీలుందని ముఖ్యమంత్రి చెప్పారు. రాష్ట్రంలోని అటవీ ప్రాంతాలను ఆహ్లాదకరంగా, ఆకట్టుకునేలా తీర్చిదిద్దేందుకు ప్రైవేట్ సంస్థల సాయం తీసుకోవాలని సూచించారు. నగరవనాల అభివృద్ధికి చర్యలు చేపట్టాలని, నగరవనాల్లో నెమళ్లు, ఆయుర్వేద వనాల పెంపకానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు.